Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11పై భారీ షాక్.. సెక్యూరిటీ ఫీచర్‌కు కట్.?
Google Pixel 11: గూగుల్ తాజాగా తీసుకొచ్చిన పిక్సెల్ 11 సిరీస్కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవసీ, సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇచ్చే ప్రముఖ
Google Pixel 11
Google Pixel 11: గూగుల్ తాజాగా తీసుకొచ్చిన పిక్సెల్ 11 సిరీస్కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవసీ, సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇచ్చే ప్రముఖ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ GrapheneOS.. పిక్సెల్ 11 సిరీస్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఫోన్‌లో ఒక కీలకమైన హార్డ్‌వేర్ సెక్యూరిటీ ఫీచర్ లేకపోవడమేనని GrapheneOS Foundation వెల్లడించింది.
పిక్సెల్ 11లో ఏం మారింది?
GrapheneOS డెవలపర్లు పిక్సెల్ 11 సిరీస్ కోసం తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పోర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సుమారు వారం రోజుల పని తర్వాత పాక్షిక పోర్ట్‌ను సిద్ధం చేసినప్పటికీ.. పూర్తి స్థాయిలో అభివృద్ధిని కొనసాగించలేకపోయామని తెలిపారు. కారణం ARM Memory Tagging Extension (MTE)కు సాఫ్ట్‌వేర్, ఫర్మ్‌వేర్‌తో పాటు దాదాపు ఖచ్చితంగా హార్డ్‌వేర్ స్థాయిలోనూ సపోర్ట్ లేకపోవడమేనని పేర్కొన్నారు.
అసలు MTE అంటే ఏమిటి?
స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీలో MTE చాలా కీలకమైన టెక్నాలజీ. ఇది మెమరీలోని డేటాకు ప్రత్యేకమైన ట్యాగ్‌లను కేటాయించి.. ఏదైనా ప్రోగ్రామ్ తప్పుగా లేదా అనధికారికంగా మెమరీని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు గుర్తించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మెమరీ సేఫ్టీ లోపాలను ఉపయోగించుకునే సైబర్ దాడులను అడ్డుకోవడంలో ఇది అదనపు రక్షణను అందిస్తుంది. GrapheneOS మాత్రం ఈ ఫీచర్‌ను తన బేస్ ఓఎస్, కెర్నల్, స్టాండర్డ్ ప్రాసెస్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తోంది.
పిక్సెల్ 8 నుంచి ఉన్న ఫీచర్‌కు బ్రేక్?
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. పిక్సెల్ 8 సిరీస్ నుంచి గూగుల్ ఫోన్లలో హార్డ్‌వేర్ MTE సపోర్ట్ అందుబాటులో ఉంది. పిక్సెల్ 8, 9, 10 తరాల్లో ఈ సెక్యూరిటీ సామర్థ్యం కొనసాగింది. కానీ పిక్సెల్ 11లో ఇది లేకపోవడంతో GrapheneOS పూర్తి పోర్ట్‌ను కొనసాగించడం కష్టంగా మారింది.
ఖర్చు తగ్గించేందుకేనా?
MTEని పిక్సెల్ 11లో తొలగించడానికి గూగుల్ ఖర్చు తగ్గింపు చర్య తీసుకుని ఉండొచ్చని GrapheneOS Foundation అభిప్రాయపడింది. అయితే గూగుల్ దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు పిక్సెల్ 11 సిరీస్‌లో సెక్యూరిటీకి సంబంధించిన ఇతర అప్‌గ్రేడ్లు కూడా ఉన్నాయి. Tensor G6తో పాటు కొత్త Titan M3 సెక్యూరిటీ చిప్, పోస్ట్-క్వాంటమ్ సెక్యూర్ బూట్ వంటి ఫీచర్లను గూగుల్ అందిస్తోంది.
GrapheneOS యూజర్లకు షాక్
GrapheneOS ప్రస్తుతం ప్రైవసీ, సెక్యూరిటీపై ఎక్కువ దృష్టి పెట్టే యూజర్లలో ప్రత్యేక గుర్తింపు పొందింది. పిక్సెల్ ఫోన్లకు ఇది చాలాకాలంగా ప్రధానంగా అందుబాటులో ఉంది. అయితే MTE లేకపోవడం తమ సెక్యూరిటీ ప్రమాణాలకు పెద్ద అడ్డంకిగా మారిందని డెవలపర్లు చెబుతున్నారు. పరిస్థితి మారకపోతే పిక్సెల్ 11 సిరీస్‌ను పూర్తిగా స్కిప్ చేసి ఇతర డివైజ్‌లపై దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా తెలిపారు.
పిక్సెల్ 11 కొనకూడదా?
సాధారణ పిక్సెల్ యూజర్లకు ఇది వెంటనే ఫోన్ ప్రమాదకరమైందని అర్థం కాదు. గూగుల్ అధికారికంగా పిక్సెల్ 11లో Tensor G6, Titan M3, క్వాంటమ్-సేఫ్ సెక్యూర్ బూట్, ఇతర సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తోంది. గూగుల్ ప్రకారం పిక్సెల్ 11 సిరీస్‌ను బహుళ స్థాయిల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీతో రూపొందించారు. అయితే ప్రత్యేకంగా GrapheneOS ఉపయోగించాలనుకునే వారికి మాత్రం పిక్సెల్ 11 సిరీస్ పరిస్థితి నిరాశ కలిగించే అంశమే. MTE లేకపోవడంతో పూర్తి GrapheneOS సపోర్ట్ సాధ్యమవుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.



