Google Earth AI: ఏఐతో నకిలీ శాటిలైట్ చిత్రాలు.. గూగుల్ ఎర్త్ ఫీచర్‌ను వెనక్కి తీసుకున్న గూగుల్
నకిలీ ఉపగ్రహ చిత్రాలపై విమర్శల నేపథ్యంలో గూగుల్ ఎర్త్‌లోని ఏఐ 'Create Image' ఫీచర్‌ను గూగుల్ తాత్కాలికంగా నిలిపివేసింది.
Google Earth AI
నకిలీ ఉపగ్రహ చిత్రాలు సృష్టించే అవకాశం ఉందంటూ తీవ్ర విమర్శలు రావడంతో గూగుల్ తన గూగుల్ ఎర్త్‌లో ప్రవేశపెట్టిన ఏఐ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) నిపుణులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఇటీవల గూగుల్ ఎర్త్‌లో ప్రవేశపెట్టిన "Create Image" ఫీచర్ ద్వారా వినియోగదారులు ఉపగ్రహ చిత్రాలు, వైమానిక ఫోటోలు, 3డీ మ్యాపింగ్ డేటా ఆధారంగా కొన్ని సెకన్లలో ఏఐ సహాయంతో చిత్రాలను రూపొందించుకునే అవకాశం కల్పించింది. ఈ ఫీచర్‌లో గూగుల్ అభివృద్ధి చేసిన Nano Banana 2 ఇమేజ్ జనరేషన్ టెక్నాలజీని వినియోగించింది.
ఈ ఫీచర్‌ను చరిత్రను దృశ్యరూపంలో చూపించడం, రియల్ ఎస్టేట్ ప్రణాళికలు రూపొందించడం వంటి ప్రయోజనాల కోసం రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. అయితే, ఇదే సాంకేతికతను దుర్వినియోగం చేసి వాస్తవంగా కనిపించే నకిలీ ఉపగ్రహ చిత్రాలను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
డిజిటల్ దర్యాప్తు నిపుణుడు హెంక్ వాన్ ఎస్ స్పందిస్తూ.. ప్రపంచం నిజానిజాలు నిర్ధారించుకునే వేదికగా రెండు దశాబ్దాలుగా గూగుల్ ఎర్త్ విశ్వసనీయతను సంపాదించిందని, ఇప్పుడు అదే వేదికలో కల్పిత చిత్రాలను సృష్టించే అవకాశం కల్పించడం ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.
అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు బ్రాడీ ఆఫ్రిక్ కూడా ఈ ఫీచర్ వల్ల నకిలీ ఉపగ్రహ చిత్రాలు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అవి ప్రజలను తప్పుదారి పట్టించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఏఎఫ్‌పీ నిర్వహించిన పరీక్షల్లో ఈ టూల్ సహాయంతో పారిస్‌లో పేలుడు, ఇరాన్‌లో అణు కేంద్రం, రష్యాలో బాంబు బీభత్సం, సిరియాలో ఉగ్రవాద శిక్షణ శిబిరం వంటి వాస్తవంలో లేని దృశ్యాలను సృష్టించగలిగినట్లు వెల్లడైంది. అలాగే బంగ్లాదేశ్‌లో వరదలు, అమెరికా-మెక్సికో సరిహద్దులో వలసదారుల శిబిరాలు, ఎన్నికల మోసాలకు సంబంధించిన తప్పుడు దృశ్యాలను కూడా రూపొందించగలిగిందని పేర్కొంది.
విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ స్పందిస్తూ, ఏఐతో రూపొందించిన చిత్రాల్లో SynthID అనే డిజిటల్ వాటర్‌మార్క్‌ను ఉపయోగించినప్పటికీ, తప్పుడు సమాచారం వ్యాప్తిని అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపింది. వినియోగదారులు సంస్థ ఏఐ విధానాలను పాటించాలని కూడా సూచించింది.
అయితే, భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసే వరకు గూగుల్ ఎర్త్‌లోని "Create Image" ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఎర్త్‌పై ఉన్న విశ్వాసాన్ని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.




