Back Button Hijacking: జర జాగ్రత్త..! ఫోన్ లో 'బ్యాక్ బటన్' నొక్కితే చిక్కుల్లో పడ్డట్టే..!
Back Button Hijacking: మనం ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు పదేపదే యాడ్స్ ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా బ్యాక్ బటన్ నొక్కినప్పుడు వేరే పేజీలకు తీసుకెళ్తూ ఇబ్బంది పెడుతుంటాయి.
Back Button Hijacking
Back Button Hijacking: ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏదైనా వెబ్‌సైట్ నుంచి బయటకు రావాలని మీరు 'బ్యాక్ బటన్' నొక్కుతుంటే, అది వెనక్కి వెళ్లకుండా పదే పదే కొత్త ప్రకటనల పేజీలను చూపిస్తోందా? అయితే మీరు 'బ్యాక్ బటన్ హైజాకింగ్' బారిన పడ్డట్టే. వినియోగదారులను ముప్పు తిప్పలు పెడుతున్న ఈ సైబర్ మోసానికి అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ ఇప్పుడు యుద్ధం ప్రకటించింది.
ఏమిటీ బ్యాక్ బటన్ హైజాకింగ్?
సాధారణంగా మనం బ్రౌజర్‌లో ఏదైనా సమాచారం చూసినప్పుడు, వెనక్కి వెళ్లడానికి బ్యాక్ బటన్‌ను ఉపయోగిస్తాం. బ్రౌజర్ మన హిస్టరీని గుర్తుంచుకుని క్రమ పద్ధతిలో వెనక్కి తీసుకెళ్తుంది. కానీ, కొన్ని మోసపూరిత వెబ్‌సైట్లు మీ బ్రౌజర్ హిస్టరీలో బలవంతంగా నకిలీ పేజీలను చొప్పిస్తాయి. ఫలితంగా మీరు వెనక్కి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు, అసలు పేజీకి వెళ్లకుండా వారు సృష్టించిన ప్రకటనల వలయంలోనే తిరుగుతూ ఉండిపోతారు. దీనినే సాంకేతిక పరిభాషలో 'బ్యాక్ బటన్ హైజాకింగ్' అంటారు.
జూన్ 15 నుంచి కొత్త నిబంధనలు..
ఈ తరహా వేధింపులకు స్వస్తి పలకాలని గూగుల్ నిర్ణయించింది. జూన్ 15 నుంచి బ్యాక్ బటన్ హైజాకింగ్‌ను 'దుర్బుద్ధితో కూడిన చర్య'గా పరిగణించనున్నారు. ఈ నిబంధనను ఉల్లంఘించే వెబ్‌సైట్లపై గూగుల్ కఠిన చర్యలు తీసుకోనుంది. ఇటువంటి సైట్ల ర్యాంకింగ్‌ను తగ్గించడమే కాకుండా, సెర్చ్ రిజల్ట్స్ నుంచి వాటిని పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. అంటే, మారకపోతే ఆ వెబ్‌సైట్ల ఉనికి గూగుల్‌లో కనుమరుగవ్వడం ఖాయం.
దీనివల్ల పొంచి ఉన్న ప్రమాదాలు..
ఇది కేవలం చిరాకు కలిగించే విషయం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద ముప్పే దాగి ఉంది.
వ్యక్తిగత సమాచారం చోరీ: బ్యాక్ బటన్ నొక్కినప్పుడు మీరు పొరపాటున మీ బ్యాంక్ లేదా ఈమెయిల్ లాంటి నకిలీ పేజీలకు చేరుకోవచ్చు. అక్కడ మీరు ఇచ్చే పాస్‌వర్డ్స్ నేరగాళ్ల చేతికి చిక్కుతాయి.
వైరస్ దాడులు: మీ అనుమతి లేకుండానే మీ ఫోన్ లేదా కంప్యూటర్ లోకి ప్రమాదకరమైన వైరస్‌లు, స్పైవేర్‌లు డౌన్‌లోడ్ అయ్యేలా చేస్తారు.
డేటా ట్రాకింగ్: మీ ఆన్‌లైన్ అలవాట్లను గమనించి, ఆ డేటాను ఇతరులకు అమ్ముకునే ప్రమాదం ఉంది.
గూగుల్ హెచ్చరిక..
వెబ్‌సైట్ నిర్వాహకులకు గూగుల్ ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారులు తమ హిస్టరీలో వెనక్కి వెళ్లకుండా అడ్డుకోవడం నిలిపివేయాలని సూచించింది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, వారి భద్రతను కాపాడటానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇకపై ఇంటర్నెట్ వాడేటప్పుడు ఏదైనా సైట్ మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడితే, వెంటనే ఆ ట్యాబ్‌ను క్లోజ్ చేయడం ఉత్తమం.




