HCL Tech: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం
HCL Tech: ఫలితాల పండుగ వేళ ఐటీ ఉద్యోగార్థులకు కంపెనీ బిగ్ ఆఫర్ ప్రకటించింది.
HCL Tech: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం
HCL Tech: భారతదేశ మూడో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో (Q2) రికార్డు స్థాయి ప్రదర్శనతో మార్కెట్‌ను మురిపించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 21.2 శాతం మేర పెరిగి రూ.5,132 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.4,235 కోట్లతో పోలిస్తే ఇది అద్భుతమైన వృద్ధి .అంతేకాకుండా, కార్పొరేట్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఒకేసారి ఇద్దరికి సరికొత్త శుభవార్తలను ప్రకటించింది.
కంపెనీ ఆదాయం ఏడాది క్రితం ఉన్న రూ.31,942 కోట్ల నుంచి 11.5 శాతం పెరిగి రూ.35,620 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే నికర లాభం 11%, ఆదాయం 3% పెరిగాయి. ఈ త్రైమాసికంలో దాదాపు రూ.31,700 కోట్లు విలువైన కొత్త ఆర్డర్లను చేజిక్కించుకుంది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇవి 27% ఎక్కువ కావడం విశేషం. కంపెనీ చరిత్రలోనే ఇవి రెండో అత్యధిక ఆర్డర్లు కావడం గమనార్హం. అడ్వాన్స్‌డ్ ఏఐ సేవల విభాగంలో రాబడి ఏకంగా 78% పెరిగి 219 మిలియన్ డాలర్లకు చేరింది. ఏఐ సాంకేతికతలో ముందంజలో ఉండటమే కంపెనీ మార్జిన్లు, లాభాలు పెరగడానికి ప్రధాన కారణమని సీఈఓ సీ విజయ్‌కుమార్ వెల్లడించారు. వ్యాపార వృద్ధి సజావుగా ఉండటంతో, వార్షిక ఆదాయ వృద్ధి అంచనాను గతంలో ఉన్న 1-4% నుండి 2.5% నుండి 4%కి సవరించింది.
ఫలితాల పండుగ వేళ ఐటీ ఉద్యోగార్థులకు కంపెనీ బిగ్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఏకంగా 10,000 మంది ఫ్రెషర్లను నెట్‌వర్క్‌లోకి చేర్చుకోనున్నట్లు కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందర రాజన్ తెలిపారు.సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 6,450 మందితో కలిపి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,30,339కి చేరింది. సెప్టెంబర్ క్వార్టర్‌లోనే 6,136 మంది ఫ్రెషర్లకు అవకాశం కల్పించారు.కంపెనీలో ఉద్యోగుల వలసల రేటు 12.8%కి పరిమితమైంది. అమెరికా ఆంక్షల ప్రభావం తమపై ఏమాత్రం ఉండదని హెచ్‌సీఎల్ స్పష్టం చేసింది. కంపెనీని నమ్ముకున్న షేర్‌హోల్డర్లపై హెచ్‌సీఎల్ కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రతి షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ తేదీ నాటికి డీమ్యాట్ ఖాతాలో షేర్లు కలిగిన ఇన్వెస్టర్లకు డివిడెండ్ అందుతుంది. క్యూ2 ఫలితాల హుషారుతో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో 0.47% లాభపడి రూ.1,220 వద్ద స్థిరపడింది.




