WhatsApp Users: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా..? బ్రౌజర్ క్లోజ్ చేసినా మీ చాట్‌లకు ముప్పు

WhatsApp Users: వాట్సాప్‌లో 5 తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని కేంద్ర సైబర్ భద్రతా సంస్థ CERT-In హెచ్చరించింది.

Gagan kumar
Published on: 27 Nov 2026 2:15 PM IST
WhatsApp Users
X

WhatsApp Users: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా..? బ్రౌజర్ క్లోజ్ చేసినా మీ చాట్‌లకు ముప్పు

WhatsApp Web: కోట్లాది మంది నిత్యం ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి చొరబడి సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ విండోస్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రభావితం చేసే ఈ లోపాలపై నవంబర్ 26న అధిక తీవ్రత గల అడ్వైజరీని జారీ చేసింది.

ప్రత్యేకంగా రూపొందించిన మెసేజ్‌లు, అటాచ్‌మెంట్‌లు లేదా లింక్‌ల ద్వారా హ్యాకర్లు వినియోగదారుల పరికరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని CERT-In పేర్కొంది. ఆ ఐదు ప్రధాన లోపాలు ఇవే.. ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఆర్డర్ వివరాలు మెసేజ్ పంపి, దాన్ని ట్యాప్ చేయగానే SQL ఇంజెక్షన్ ద్వారా ఫోన్‌లోని వాట్సాప్ ఫైళ్లను హ్యాకర్లు తొలగించగలరు. అంతేకాకుండా, యాప్ క్రాష్ అయ్యే సమయాన్ని బట్టి చాట్ డేటాబేస్ సమాచారాన్ని కూడా పసిగట్టే అవకాశం ఉంది. మెటా AI కంప్యూటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన సర్టిఫికేట్ చైన్‌ను సరిగ్గా ధృవీకరించకపోవడం వల్ల, పరికరంలోని భద్రతా వలయాన్ని దాటుకుని యాక్సెస్ పొందే ప్రమాదం ఉంది.

ఆండ్రాయిడ్‌లో 'క్లిక్ టు వాట్సాప్' ప్రకటనలకు వచ్చే ప్రత్యుత్తర సందేశాల ద్వారా హ్యాకర్ల సర్వర్ నుంచి మీడియా లోడ్ అయ్యేలా చేసి, బాధితుడి IP అడ్రస్ వివరాలను తస్కరించగలరు. కొన్ని స్పామ్ మెసేజ్‌లలో దీనిని వాడి ఉండవచ్చని వాట్సాప్ గుర్తించింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు సంబంధించిన AI-ఆధారిత ప్రతిస్పందనలో హానికరమైన URL చొప్పించడం ద్వారా iOS లేదా ఆండ్రాయిడ్ ఫోన్లు ఆ ప్రమాదకర కంటెంట్‌ను ప్రాసెస్ చేసేలా చేయవచ్చు. విండోస్ వాట్సాప్‌లో ఒక సాధారణ ఫైల్‌లా కనిపించే అటాచ్‌మెంట్‌ను పంపి, యూజర్ దాన్ని ఓపెన్ చేయగానే వైరస్ లేదా హానికరమైన ప్రోగ్రామ్ రన్ అయ్యేలా చేసే లోపం ఇది.

మరోవైపు, ఆఫీసులు లేదా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వాడేవారికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలక సూచన చేసింది. కేవలం బ్రౌజర్ ట్యాబ్ క్లోజ్ చేసినంత మాత్రాన వాట్సాప్ లాగ్ అవుట్ అవ్వదని, దీనివల్ల ఇతరులు మీ చాట్‌లను చూడటమే కాకుండా, మీ పేరుతో ఇతరులను మోసం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు AI సాధనాలను సైతం ఉపయోగించి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించాలి. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లేదా విండోస్ స్టోర్‌లోకి వెళ్లి మీ వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఆర్డర్ వివరాలు, ఆఫర్ లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయవద్దు. కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ వాడిన తర్వాత, పని పూర్తవగానే తప్పనిసరిగా Log Out బటన్ నొక్కండి. పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ లాగిన్ చేయకపోవడమే ఉత్తమం.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.