Honor 600 Pro: 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. హానర్ నుంచి బాహుబలి ఫోన్.. ధరెంతంటే?
Honor 600 Pro: అత్యాధునిక సాంకేతికత, భారీ బ్యాటరీ, శక్తివంతమైన కెమెరా కోరుకునే వారికి హానర్ 600 సిరీస్ ఒక అద్భుతమైన ఎంపిక. త్వరలోనే ఇవి భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది.
Honor 600 Pro
Honor 600 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ అంతర్జాతీయ మార్కెట్లోకి తన సరికొత్త ఫ్లాగ్షిప్ మోడళ్లను ప్రవేశపెట్టింది. అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యం, శక్తివంతమైన కెమెరాలే లక్ష్యంగా హానర్ 600, హానర్ 600 ప్రో ఫోన్లను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తో వస్తున్న ఈ ఫోన్లు ప్రస్తుతం మొబైల్ ప్రియులలో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ధర, లభ్యత..
హానర్ తన 600 సిరీస్ ఫోన్లను ప్రస్తుతానికి సౌదీ అరేబియా, మలేషియా మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చింది.
హానర్ 600 ప్రో: దీని 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 75,000 (2,999 సౌదీ రియాల్స్) గా నిర్ణయించారు.
హానర్ 600: దీని ప్రాథమిక మోడల్ (8GB + 256GB) ధర సుమారు రూ. 45,000 కాగా, టాప్ ఎండ్ మోడల్ (12GB + 256GB) ధర సుమారు రూ. 50,000లుగా ఉంది.
ఈ ఫోన్లు బ్లాక్, గోల్డ్ వైట్, ఆరెంజ్ రంగుల్లో లభిస్తాయి. ప్రస్తుతం వీటిని హానర్ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు.
అబ్బురపరిచే డిస్ప్లే, రక్షణ..
ఈ రెండు ఫోన్లలోనూ 6.57 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 8,000 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, నీరు, ధూళి నుంచి రక్షణ కోసం వీటికి అత్యున్నత స్థాయి రేటింగ్లను (IP68, IP69, IP69K) కేటాయించారు.
శక్తివంతమైన ప్రాసెసర్..
హానర్ 600 ప్రో మోడల్లో అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను వాడారు. గేమింగ్ కోసం ఇందులో ప్రత్యేకమైన గ్రాఫిక్స్ కార్డ్ కూడా ఉంది. ఇక సాధారణ హానర్ 600 మోడల్లో స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇవి ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10 పై పనిచేస్తాయి.
200 మెగాపిక్సెల్ కెమెరా ప్రత్యేకత..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు.
ప్రో మోడల్: ఇందులో మూడు కెమెరాలు ఉంటాయి. 200MP ప్రధాన కెమెరాతో పాటు, 50MP టెలిఫోటో కెమెరా (120x డిజిటల్ జూమ్), 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
సాధారణ మోడల్: ఇందులో రెండు కెమెరాలు (200MP + 12MP) మాత్రమే ఉంటాయి. సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ముందు కెమెరాను అమర్చారు.
మెగా బ్యాటరీ, ఛార్జింగ్..
ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణ 7,000mAh బ్యాటరీ. ఇది చాలా కాలం పాటు ఛార్జింగ్ నిలుపుకుంటుంది. వీటికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ప్రో మోడల్లో అదనంగా 50W వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా కల్పించారు. కేవలం 7.8 మిల్లీమీటర్ల మందం ఉన్నప్పటికీ, ఇంత పెద్ద బ్యాటరీని అమర్చడం విశేషం.




