Smartphone Tips: వేడికి మీ ఫోన్ హీటెక్కి సతాయిస్తోందా..? ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇక టెన్షన్ లేదు!
Smartphone Cooling Tips: బ్యాటరీ ఆరోగ్యం దెబ్బతినకుండా, ఫోన్ పనితీరు మందగించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మీ ఫోన్‌ను కూల్-కూల్‌గా ఉంచుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి.
Smartphone Tips
Smartphone Cooling Tips: వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ ప్రభావం నేరుగా ఎలక్ట్రానిక్ పరికరాలపై పడుతోంది. స్మార్ట్‌ఫోన్ అధికంగా వేడెక్కితే బ్యాటరీ ఉబ్బిపోవడం లేదా పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే, ఫోన్ హ్యాంగ్ అవ్వడం, వేగం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. లోపలి భాగాలు వేడెక్కకుండా చూసుకోవడం ద్వారా ఫోన్ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.
స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గిస్తే బెటర్..
చాలామంది ఫోన్ డిస్‌ప్లేను పూర్తి కాంతితో ఉపయోగిస్తారు. స్క్రీన్ వెలుతురు పెరిగేకొద్దీ బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. బ్యాటరీ వేగంగా ఖర్చవుతున్నప్పుడు సహజంగానే వేడి ఉత్పత్తి అవుతుంది. కావున, అవసరమైన మేరకు మాత్రమే కాంతిని ఉంచుకోవడం లేదా 'ఆటో బ్రైట్‌నెస్' మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఫోన్ వేడెక్కకుండా చూడవచ్చు.
ఫోన్ కవర్‌ను తొలగించండి..
మనం ఫోన్ రక్షణ కోసం వాడే ప్లాస్టిక్ లేదా రబ్బర్ కవర్లు వేడిని బయటకు పోనివ్వకుండా అడ్డుకుంటాయి. ఫోన్ లోపల ఉత్పన్నమయ్యే వేడి గాలి బయటకు వెళ్లలేక లోపలే ఉండిపోతుంది. ముఖ్యంగా ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు కవర్‌ను తీసివేయడం వల్ల గాలి తగిలి ఫోన్ త్వరగా చల్లబడుతుంది.
ఎండలో నేరుగా వాడకండి..
సూర్యరశ్మి నేరుగా ఫోన్‌పై పడటం చాలా ప్రమాదకరం. ఎండలో ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ సరిగ్గా కనిపించక మనం బ్రైట్‌నెస్ పెంచుతుంటాం. దీనివల్ల బాహ్య ఉష్ణోగ్రత, అంతర్గత వేడి కలిసి ఫోన్‌ను మరింత వెడిక్కిస్తాయి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయట తిరుగుతున్నప్పుడు ఫోన్‌ను జేబులో లేదా బ్యాగులో ఉంచడం శ్రేయస్కరం.
విమాన ప్రయాణ మోడ్ (ఫ్లైట్ మోడ్) సహాయం..
మీరు ఫోన్‌ను వాడటం లేదనుకున్నప్పుడు లేదా సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయండి. సిగ్నల్ కోసం ఫోన్ నిరంతరం వెతకడం వల్ల ప్రాసెసర్, బ్యాటరీపై భారం పడుతుంది. ప్రయాణాల్లో ఈ చిట్కా ఫోన్ వేడెక్కకుండా చేయడమే కాకుండా బ్యాటరీని కూడా ఆదా చేస్తుంది.
అతిగా చార్జింగ్ చేయవద్దు..
చార్జింగ్ వంద శాతం పూర్తి కాగానే ప్లగ్ తొలగించాలి. రాత్రంతా చార్జింగ్ పెట్టడం లేదా పూర్తి అయిన తర్వాత కూడా అలాగే ఉంచడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. చార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ వాడటం కూడా ప్రమాదకరమని మరువకండి.




