Air Cooler Tips: కూలర్‌ను ఇలా సెట్ చేయండి.. తక్కువ కరెంట్ బిల్లుతో గది మొత్తం మంచు కురవాల్సిందే..!

Air Cooler Tips: ఏప్రిల్ నెల రాకతోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగి, సాయంత్రం వరకు ఉక్కపోత వేధిస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో ఎయిర్ కూలర్లు బయటకు వచ్చేశాయి. అయితే, కూలర్‌ను ఏ స్పీడ్‌లో ఉంచితే గది త్వరగా చల్లబడుతుంది? విద్యుత్ బిల్లు భారం పడకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం.

Venkat
Published on: 5 April 2026 7:01 PM IST
How To Run Cooler In April Tips For Cooling And Low Electricity Bill Telugu
X

Air Cooler Tips: కూలర్‌ను ఇలా సెట్ చేయండి.. తక్కువ కరెంట్ బిల్లుతో గది మొత్తం మంచు కురవాల్సిందే..!

Cooler Speed Settings: ఎండలు మండిపోతున్నాయి. దీంతో అంతా కూలర్లు, ఏసీల వాడకం మొదలుపెట్టేశారు. అయితే, ముఖ్యంగా కూలర్ వాడడంలో కొన్ని టిప్స్ పాటిస్తే, కరెంట్ బిల్లును ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా కూలర్లలో లొ (Low), మీడియం (Medium), హై స్పీడ్ (High) అనే మూడు రకాల పరిమితులు ఉంటాయి. చాలామంది కూలర్ ఆన్ చేయగానే నేరుగా 'హై స్పీడ్'లో పెట్టేస్తుంటారు. కానీ, ఏప్రిల్ వంటి ప్రారంభ వేసవిలో ఇలా చేయడం అవసరం లేదు. వాతావరణాన్ని బట్టి వేగాన్ని మార్చుకోవడం వల్ల మెరుగైన చల్లదనం లభిస్తుంది.

ఏప్రిల్ నెలలో ఏ నంబర్ బెస్ట్?

ఏప్రిల్ నెలలో ఎండలు ఉన్నప్పటికీ, మే నెల అంత తీవ్రంగా ఉండవు. కాబట్టి పగటిపూట కూలర్‌ను మీడియం స్పీడ్ (2వ నంబర్) మీద నడపడం అత్యంత ఉత్తమం. దీనివల్ల గదిలో గాలి ప్రసరణ బాగుంటుంది. తేమ శాతం పెరగకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కొంతసేపు హై స్పీడ్ వాడాలి. ఇక రాత్రి సమయానికి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి, నిద్రపోయేటప్పుడు 1వ నంబర్ (Low) మీద ఉంచితే తెల్లవారుజామున చలి వేయకుండా, హాయిగా నిద్ర పడుతుంది.

గాలి, వెలుతురు (వెంటిలేషన్) ముఖ్యం..

ఎయిర్ కూలర్ సమర్థవంతంగా పనిచేయాలంటే గదిలోకి బయటి గాలి రావడం చాలా అవసరం. గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేస్తే గదిలో ఉక్కపోత (హ్యూమిడిటీ) పెరుగుతుంది. కాబట్టి, కిటికీని కొంచెం తెరిచి ఉంచడం వల్ల గాలి ప్రసరణ జరిగి, మీడియం స్పీడ్‌లో కూడా గది ఏసీ లాగా చల్లగా మారుతుంది.

నీరు, కూలింగ్ ప్యాడ్ల నిర్వహణ..

చల్లదనం అనేది కేవలం ఫ్యాన్ స్పీడ్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కూలర్‌లో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. అలాగే కూలింగ్ ప్యాడ్లు శుభ్రంగా ఉంటేనే గాలి చల్లగా వస్తుంది. ప్యాడ్లపై దుమ్ము పేరుకుపోతే మీరు ఎంత హై స్పీడ్‌లో పెట్టినా ప్రయోజనం ఉండదు. వారానికి ఒకసారి ప్యాడ్లను శుభ్రం చేయడం వల్ల తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ చల్లదనాన్ని పొందవచ్చు.

కరెంట్ బిల్లు తగ్గించుకునే మార్గం..

విద్యుత్ ఆదా చేయాలంటే కూలర్‌ను నిరంతరం హై స్పీడ్‌లో వాడటం మానేయాలి. రాత్రిపూట లో-స్పీడ్ మోడ్‌లో వాడటం వల్ల కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది. అలాగే కూలర్ మోటార్‌పై భారం పడకుండా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. స్మార్ట్ గా ఆలోచించి సెట్టింగ్స్ మార్చుకుంటే ఈ వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండటమే కాకుండా మీ జేబుకు చిల్లు పడదు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story