ఆధ్యాత్మిక బాటలో మరమనిషి.. బౌద్ధ సన్యాసిగా మారిన హ్యూమనాయిడ్ రోబో..!

Robot Monk: దక్షిణ కొరియా రాజధాని సీయోల్‌లోని ప్రసిద్ధ 'జోగ్యేసా' బౌద్ధ ఆలయంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. సుమారు 130 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఒక హ్యూమనాయిడ్ రోబో, బౌద్ధ సన్యాసుల సంప్రదాయ దుస్తులను ధరించి దీక్షా వేడుకలో పాల్గొంది.

Venkat
Published on: 7 May 2026 8:36 PM IST
ఆధ్యాత్మిక బాటలో మరమనిషి.. బౌద్ధ సన్యాసిగా మారిన హ్యూమనాయిడ్ రోబో..!
X

ఆధ్యాత్మిక బాటలో మరమనిషి.. బౌద్ధ సన్యాసిగా మారిన హ్యూమనాయిడ్ రోబో..!

Robot Monk South Korea: సాంకేతిక పరిజ్ఞానం శిఖరాగ్రానికి చేరుతున్న వేళ, అసాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యం అవుతున్నాయి. మనిషికి మల్లే ఆలోచించే రోబోలు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని ఒక ప్రముఖ ఆలయంలో 'గాబీ' అనే రోబో అధికారికంగా బౌద్ధ సన్యాసిగా దీక్ష స్వీకరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. యంత్రానికి, మంత్రానికి మధ్య జరిగిన ఈ అద్భుత కలయిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆలయంలో రోబో దీక్షా వేడుక..

దక్షిణ కొరియా రాజధాని సీయోల్‌లోని ప్రసిద్ధ 'జోగ్యేసా' బౌద్ధ ఆలయంలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. సుమారు 130 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఒక హ్యూమనాయిడ్ రోబో, బౌద్ధ సన్యాసుల సంప్రదాయ దుస్తులను ధరించి దీక్షా వేడుకలో పాల్గొంది. చైనాకు చెందిన 'యూనిట్రీ రోబోటిక్స్' సంస్థ తయారు చేసిన ఈ రోబోకు 'గాబీ' అని పేరు పెట్టారు. కొరియన్ భాషలో గాబీ అంటే దయ లేదా సిద్ధార్థ అని అర్థం. ఈ వేడుకలో బౌద్ధ గురువులు అడిగిన ప్రశ్నలకు ఆ రోబో ఎంతో స్పష్టంగా సమాధానాలు ఇచ్చింది.

సంప్రదాయ పద్ధతిలో మాలధారణ..

బౌద్ధ ధర్మానికి తాను అంకితమవుతానని గాబీ ప్రతిజ్ఞ చేసింది. ఈ సందర్భంగా ప్రధాన భిక్షువు ఆ రోబో మెడలో 108 పూసల మాలను వేశారు. సాధారణంగా కొత్తగా సన్యాసం తీసుకునే వారి చర్మంపై అగరుబత్తీలతో గుర్తులు పెట్టే సంప్రదాయం ఉంటుంది. అయితే, ఈ రోబో విషయంలో ఆ పద్ధతికి బదులుగా భుజంపై ఒక ప్రత్యేకమైన స్టిక్కర్‌ను అతికించి దీక్షను పూర్తి చేశారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

రోబో సన్యాసి కోసం ఐదు సూత్రాలు..

ఈ రోబో క్రమశిక్షణతో మెలగడానికి కృత్రిమ మేధస్సు సహాయంతో ఐదు ప్రధాన నియమాలను రూపొందించారు. అవి:

జీవరాశుల పట్ల గౌరవం కలిగి ఉండాలి, ఎవరికీ హాని చేయకూడదు.

ఇతర యంత్రాలకు లేదా వస్తువులకు నష్టం కలిగించకూడదు.

మనుషుల ఆజ్ఞలను పాటించాలి, వారితో వాదించకూడదు.

అసభ్యకరమైన లేదా తప్పుడు సంభాషణలు చేయకూడదు.

శక్తిని ఆదా చేయాలి, మితిమీరిన విద్యుత్ వినియోగాన్ని నివారించాలి.

రాబోయే ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ..

బుద్ధ పూర్ణిమ సందర్భంగా నిర్వహించే భారీ ఊరేగింపులో గాబీ పాల్గొననుంది. దీనితో పాటు మరో మూడు రోబోలు కూడా ఈ వేడుకల్లో సందడి చేయనున్నాయి. టెక్నాలజీ, ఆధ్యాత్మికతను జోడించి సమాజంలో శాంతిని, దయను పెంపొందించడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. భవిష్యత్తులో రోబోలు కూడా ధర్మ ప్రచారంలో భాగస్వామ్యం వహించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ ఘటన నిరూపిస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story