Hybrid AI Energy Efficiency: ఆశలు పెంచుతున్న హైబ్రీడ్ ఏఐ... తర్కంతో తగ్గనున్న ఖర్చు
Hybrid AI Energy Efficiency: నేటి డిజిటల్ యుగంలో సమాచారం ఎంత వేగంగా అందుతోందో, దాని వెనుక అంత అపారమైన విద్యుత్ వినియోగం దాగి ఉంది.
Hybrid AI Energy Efficiency
Hybrid AI Energy Efficiency: నేటి డిజిటల్ యుగంలో సమాచారం ఎంత వేగంగా అందుతోందో, దాని వెనుక అంత అపారమైన విద్యుత్ వినియోగం దాగి ఉంది. మనం కృత్రిమ మేధని అడిగే ఒక్కో ప్రశ్న వెనుక ఏడు నుండి పది రెట్లు అదనపు విద్యుత్ ఖర్చవుతుందన్నది చేదు నిజం. ఈ క్రమంలోనే, అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించిన "న్యూరో-సింబాలిక్ ఏఐ" ఒక సరికొత్త ఆశగా మారుతోంది. ఇది యంత్రాలకు కేవలం 'గుర్తుంచుకోవడం' మాత్రమే కాదు, మనిషిలా 'ఆలోచించడం' కూడా నేర్పిస్తోంది.
ఏఐ ఎందుకు 'విద్యుత్ రక్కసి'గా మారింది?
సాధారణ గూగుల్ సెర్చ్‌తో పోలిస్తే, ఏఐ చాట్‌బాట్‌లు పని చేయడానికి భారీ డేటా సెంటర్లు అవసరం. ప్రస్తుతం అమెరికాలో వాడుతున్న మొత్తం విద్యుత్తులో 10% ఈ డేటా సెంటర్లకే వెళ్తోంది. ఇది 2030 నాటికి 20%కి చేరుతుందని అంచనా. ఒక ఏఐ మోడల్‌కు శిక్షణ ఇవ్వాలంటే కోట్లాది ఫోటోలు, సమాచారాన్ని ప్రాసెస్ చేయాలి. దీనివల్ల కంప్యూటర్లు వేడెక్కి, వాటిని చల్లబరచడానికి లక్షలాది లీటర్ల నీరు, అపారమైన విద్యుత్తు ఖర్చవుతున్నాయి.
న్యూరో-సింబాలిక్ ఏఐ: అద్భుత ప్రయోగం
టఫ్ట్స్ శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 2026లో నిర్వహించిన ఒక ప్రయోగం ఏఐ భవిష్యత్తును మార్చబోతోంది. 'హనోయ్ టవర్' అనే క్లిష్టమైన పజిల్‌ను ఏఐకి ఇచ్చారు. మెషిన్ లెర్నింగ్ పద్దతిలో పనిచేసిన ఏఐ 100కి కేవలం 34 సార్లు మాత్రమే పజిల్‌ను సాల్వ్ చేసింది. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి 36 గంటల సమయం పట్టింది. కానీ, కొత్తపద్దతైన న్యూరో సింబాలిక్ విధానంలో ఏఐకి తర్కాన్ని నేర్పారు. తర్కాన్ని నేర్చుకున్న ఏఐ ఈ పజిల్‌ను 95 శాతం విజయవంతంగా పూర్తిచేసింది. కేవలం 34 నిమిషాల్లోనే పని పూర్తిచేసింది. తర్కం నేర్చుకున్న ఏఐ ఎంత స్పీడ్‌గా పనిచేస్తుందో అంతే తక్కువగా విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. టెక్నాలజీ బాషలో చెప్పాలి అంటే డేటాను తెలివిగా ప్రెసెస్‌చేసి తక్కువ సమయంలో తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేస్తుంది.
మనకు ఎందుకు ముఖ్యం?
భారతదేశం వంటి దేశాల్లో వేసవిలో విద్యుత్ కొరత సహజం. మన దగ్గర ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకు ఈ కొత్త సాంకేతికత ఎంతో మేలు చేస్తుంది. తక్కువ విద్యుత్తుతో ఎక్కువ పని చేసే ఈ 'స్మార్ట్ ఏఐ'ని మన సౌరశక్తితో అనుసంధానిస్తే, ప్రకృతికి నష్టం లేకుండానే సాంకేతిక విప్లవాన్ని సాధించవచ్చు.
మొత్తంగా చూసుకుంటే జ్ఞానం అనేది మనిషికి భారం కాకూడదు, భారాన్ని తగ్గించేదిగా ఉండాలి. కేవలం డేటా ఆధారిత ఏఐ నుండి తర్క ఆధారిత ఏఐ వైపు అడుగులు వేయడం ద్వారానే 'తక్కువ ఇంధనం... మెరుగైన జ్ఞానం' అనే లక్ష్యాన్ని మనం చేరుకోగలం. ఆశలు రేపుతున్న ఈ హైబ్రీడ్ ఏఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారీ స్థాయిలో విద్యుత్ ఆదా అవుతుంది. ప్రకృతి మనుగడకు కూడా ముప్పు తగ్గుతుంది.




