చాట్‌జీపీటీగా స్వదేశీ ఏఐ మోడల్స్.. ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తాయంతే..!
Indian AI Models: టెక్నాలజీ రంగంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. EKA-1, Dhir 2B, Dhir 5B అనే మూడు స్వదేశీ AI మోడల్స్‌ను ఆవిష్కరించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, ఇండియాఏఐ మిషన్ సహకారంతో వీటిని విడుదల చేసింది.
చాట్‌జీపీటీగా స్వదేశీ ఏఐ మోడల్స్.. ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తాయంతే..!
Indian AI Models: న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూడు మోడల్స్‌ను ప్రవేశపెట్టారు. ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో సహా ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ టూల్స్‌ను ప్రభుత్వ కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, పాఠశాలలు వంటి చోట్ల వినియోగించుకోవచ్చని వారు తెలిపారు. విదేశీ AI మోడల్స్‌పై ఆధారపడటం కూడా దీనివల్ల తగ్గుతుందని భావిస్తున్నారు.
EKA-1 ఫీచర్లు..
మూడు మోడల్స్‌లో ఇదే అతిపెద్దది. దీన్ని బెంగళూరుకు చెందిన స్టార్టప్ సోకెట్ ల్యాబ్స్ (Soket Labs) అభివృద్ధి చేసింది. ఇది శక్తివంతమైన, ఓపెన్, స్పార్స్ హైబ్రిడ్ లాంగ్వేజ్ మోడల్. క్లిష్టమైన పనుల కోసం దీన్ని రూపొందించారు.
అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, రీజనింగ్ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు.
AI ఏజెంట్‌గా కూడా పనిచేసి, అనేక టాస్క్‌లను పూర్తిచేయగలదు.
26.3 బిలియన్ (2,630 కోట్లు) పారామీటర్లపై ఆధారపడింది.
7.5 ట్రిలియన్ టెక్స్ట్ టోకెన్ల భారీ డేటాతో శిక్షణ ఇచ్చారు.
ఇంగ్లిష్‌తో పాటు భారతదేశంలోని షెడ్యూల్డ్ భాషలన్నింటినీ సులభంగా అర్థం చేసుకోగలదు.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
Dhir 2B, Dhir 5B ఫీచర్లు..
ఈ రెండు మోడల్స్ EKA-1 కంటే భిన్నమైనవి, వేర్వేరు అవసరాల కోసం రూపొందించినవి. వీటిని జెంటైక్యూ ఏఐటెక్ ఇన్నోవేషన్స్ (ZenteiQ AiTech Innovations) అభివృద్ధి చేసింది.
ఈ రెండింటి అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నెట్ లేకుండా కూడా వీటిని నడపవచ్చు. ఇందుకోసం ఎలాంటి పెద్ద క్లౌడ్ సర్వర్ అవసరం లేదు. వీటిని నేరుగా ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు.




