Quantum Reference Facility: క్వాంటం టెక్నాలజీ సీక్రెట్స్: క్వాంటం కంప్యూటింగ్ నుంచి క్వాంటం వ్యాలీ వరకు

Quantum Reference Facility: భారతదేశ సాంకేతిక చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Balachander
Published on: 16 April 2026 12:38 PM IST
Quantum Reference Facility
X

Quantum Reference Facility: క్వాంటం టెక్నాలజీ సీక్రెట్స్: క్వాంటం కంప్యూటింగ్ నుంచి క్వాంటం వ్యాలీ వరకు

Quantum Reference Facility: భారతదేశ సాంకేతిక చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా 'అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ' ప్రారంభమైంది. దీంతో భారత్.. క్వాంటం రంగంలో ప్రపంచ అగ్రరాజ్యాల సరసన చేరింది. గత కొన్ని రోజులుగా క్వాంటం టెక్నాలజీ, క్వాంటం వ్యాలీ అనే పదాలు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ క్వాంటం టెక్నాలజీ అంటే ఏమిటి? అమరావతి ఎందుకు 'క్వాంటం వ్యాలీ'గా మారుతోంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను విశ్లేషించుకుందాం.

అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ - క్వాంటం యుగానికి పునాది

క్వాంటం టెక్నాలజీ అనేది భవిష్యత్తును శాసించే శక్తి అని చెప్పవచ్చు. సాధారణ కంప్యూటర్లు సంవత్సరాల తరబడి చేసే లెక్కలు, ఇతర పనులను ఈ క్వాంటం కంప్యూటర్లు కేవలం సెకన్లలోనే పూర్తి చేస్తాయి. సూపర్‌ ఫాస్ట్‌ కంప్యూటర్ల కంటే కూడా ఇవి సూపర్‌ అని చెప్పాలి. ఇంత ఫాస్టెస్ట్‌ క్వాంటం కంప్యూటర్స్‌ని తయారు చేయడం సాధారణమైన విషయం కాదు. ఇందులో ఉపయోగించే హార్డ్‌వేర్‌ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. క్విబిట్స్‌ అవరమైతాయి. క్వాంటం కంప్యూటర్స్‌లో ఉపయోగించే హార్డ్‌వేర్‌ను పరీక్షించడానికి, వాటి పనితీరును దృవీకరించడానికి క్వాంటం రిఫరెన్స్‌ ఫెసిలిటీ అవసరమైతాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటం రెఫరెన్స్‌ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు.

క్వాంటం రిఫరెన్స్‌ ఫెసిలిటీ అంటే ఏమిటి?

క్వాంటం కంప్యూటర్లు నిర్మించడం అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. వాటిలో వాడే క్విబిట్స్ చాలా సున్నితమైనవి. చిన్నపాటి వేడి లేదా శబ్దం తగిలినా అవి పనిచేయవు. ఇలాంటి క్లిష్టమైన భాగాలను వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు వాటిని పరీక్షించి, సర్టిఫికేట్ ఇచ్చే కేంద్రమే ఈ 'రిఫరెన్స్ ఫెసిలిటీ'.

క్వాంటం వ్యాలీ - అమరావతిలో రెండు కీలక కేంద్రాలు

అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దే క్రమంలో రెండు ప్రధాన ప్రాంతాలలో ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఒకటి ఏక్యూఆర్‌ఎఫ్‌ 1ఎస్. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఇందులో ప్రధానంగా పరిశోధనలు, విద్యార్థుల శిక్షణపై దృష్టి పెడుతుంది. రెండోది ఏక్యూఆర్‌ఎఫ్‌ 1క్యూ. ఇది మేధా టవర్స్‌లో ఉంది. ఇక్కడ స్టార్టప్‌లకు, వాణిజ్యపరమైన హార్డ్‌వేర్‌ పరీక్షలకు వేదికగా ఉంటుంది.

అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద పరీక్షలు

క్వాంటం కంప్యూటర్లు సరిగ్గా పనిచేయాలంటే అవి అంతరిక్షం కంటే చల్లగా ఉండాలి. ఈ AQRF కేంద్రాలలో క్విబిట్స్, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్‌ను మైనస్ -273°C (క్రియోజెనిక్ టెంపరేచర్) వద్ద పరీక్షిస్తారు. ఇది అంతరిక్షం కంటే చల్లని వాతావరణం. ఇంతటి కఠినమైన వాతావరణంలో హార్డ్‌వేర్ ఎలా స్పందిస్తుందో ఇక్కడ శాస్త్రవేత్తలు గుర్తిస్తారు.

అమరావతి క్వాంటం రిఫరెన్స్‌ ఫెసిలిటీ విశిష్టతలు

ఇప్పటి వరకు మనం క్వాంటం విడిభాగాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. అక్కడి నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. సున్నితమైన భాగాలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు వలన సుమారు 85 శాతం వరకు విడిభాగాలను భారత్‌లోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, అమరావతిలో ఏర్పాటు చేసింది ఓపెన్‌ యాక్సెస్‌ టెస్ట్‌బెడ్‌. అంటే ఏ స్టార్టప్‌ అయినా, పరిశోధకుడు అయినా తన ఆవిష్కరణలను ఇక్కడ పరీక్షించుకోవచ్చు. తద్వారా భారత్‌లో పరికరాల తయారీ మరింత సులభమౌతుంది. ఇలాంటి వాటికి తప్పనిసరిగా సాంకేతిక సహకారం కావాలి. దీనికోసం టిఐఎఫ్‌ఆర్‌, ఐఐఎస్ఈ, డీఆర్డీవో వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఇది భారత జాతీయ క్వాంటం మిషన్‌లో ఓ కీలక భాగం.

సామాన్యుడికి దీనివల్ల లాభం ఏంటి?

సూపర్‌ ఫాస్ట్‌ కంప్యూటర్‌, క్వాంటం కంప్యూటర్స్‌ అని చెప్పుకుంటున్నాం కదా. దీని వలన సామాన్యులకు కలిగే లాభం ఏంటనే సందేహం రావొచ్చు. క్వాంటం టెక్నాలజీ అనేది కేవలం గణత సమస్యలను పరిష్కరించడానికే కాదు.. వైద్యరంగంలోనూ, సైబర్‌ సెక్యూరిటీ రంగంలోనూ ఇతర రంగాల్లోనూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి మొండి రోగాలకు కొత్త మందులను సులభంగా కనుగొనవచ్చు. అంతేకాదు, సైబర్‌ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకోవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పులను ముందుగానే ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. దీని వలన సామాన్యులకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఏపీ రాజధాని అమరావతి ఈ పరిశోధనలకు కేంద్రం కావడం వలన వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలకు అవకాశం లభిస్తుంది.

అమరావతి 'ది క్వాంటం వ్యాలీ'

ఇప్పటి వరకు మనం అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ గురించి విన్నాం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు సిలికాన్‌ వ్యాలీలో పనిచేయాలి అని కలలు కంటుంటారు. అదేవిధంగా క్వాంటం టెక్నాలజీకి అమరావతి క్వాంటం వ్యాలీగా మారబోతున్నది. ఇక్కడ కేవలం సాఫ్ట్‌వేర్‌ మాత్రమే కాదు, హార్ట్‌వేర్‌ రంగంలో కూడా భారత్‌ స్వయం సమృద్ది సాధించాలనే సంకల్పానికి ఈ అమరావతి క్వాంటం రిఫరెన్స్‌ ఫెసిలిటీ ఒక నిదర్శనం. విదేశీ కంపెనీల మీద ఆధారపడకుండా, మన సొంత చిప్స్, మన సొంత సూపర్ కండక్టింగ్ క్విబిట్స్‌తో భారత్ ప్రపంచాన్ని శాసించబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా చూసుకుంటే.. అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ కేవలం ఒక ప్రయోగశాల కాదు.. అది నవభారత సాంకేతిక సత్తాకు ప్రతీక అని చెప్పొచ్చు. మన శాస్త్రవేత్తల మేధస్సు, ప్రభుత్వ మద్దతు తోడైతే, అతి త్వరలోనే ప్రపంచపు మొట్టమొదటి సంపూర్ణ క్వాంటం కంప్యూటర్ భారత్ నుంచే వచ్చే అవకాశం ఉంది. అమరావతి వేదికగా మొదలైన ఈ క్వాంటం ప్రయాణం దేశ భవిష్యత్తును మార్చబోతోందనడంలో సందేహం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story