iPhone overheating : ఐఫోన్ వేడెక్కితే.. తర్వాత ఏమవుతుంది.?
iPhone overheating : ప్రస్తుతం మనం ఎన్నడూ లేని విధంగా అత్యంత వేడి వాతావరణంలో జీవిస్తున్నాము. ఈ భానుడి భగభగలకు కేవలం మనుషులమే కాదు,
iphone-heating
iPhone overheating : ప్రస్తుతం మనం ఎన్నడూ లేని విధంగా అత్యంత వేడి వాతావరణంలో జీవిస్తున్నాము. ఈ భానుడి భగభగలకు కేవలం మనుషులమే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా తట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన ఐఫోన్ (iPhone) వినియోగదారులు ఇటీవల తీవ్రమైన హీటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫోన్ విపరీతంగా వేడెక్కడం వల్ల కనీసం కాల్స్ చేయడానికి లేదా మెసేజ్ చేయడానికి కూడా వీలు పడటం లేదని చాలా మంది సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.
ఐఫోన్ ఎందుకు అంత త్వరగా వేడెక్కుతోంది.?
యాపిల్ తన ఐఫోన్లను సాధారణంగా 0 డిగ్రీల నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఉత్తమంగా పనిచేసేలా రూపొందించింది. ఒకవేళ వాతావరణం అంతకంటే వేడెక్కితే, ఫోన్ తనను తాను రక్షించుకోవడానికి పనితీరును నెమ్మదింపజేస్తుంది. మీ ఐఫోన్ ఓవర్ హీట్ అయినప్పుడు అది 'ప్రొటెక్షన్ మోడ్'లోకి వెళ్లిపోతుంది. దీని వల్ల ఫోన్ లోపల ఉండే బ్యాటరీ లేదా ఇతర విభాగాలు పాడవకుండా ఉంటాయి.
ఫోన్ ఓవర్ హీట్ అవుతుందని తెలిపే లక్షణాలు
- స్క్రీన్ అకస్మాత్తుగా డిమ్ (మసకగా) అయిపోతుంది.
- చార్జింగ్ ఆగిపోయి, “Charging on Hold” అనే అలర్ట్ కనిపిస్తుంది.
- ఫోన్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది (Sluggish).
- కెమెరా సరిగ్గా పనిచేయదు లేదా ఫ్లాష్ వెలగదు.
- యాప్స్ ఓపెన్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది.
- పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే, స్క్రీన్‌పై థర్మామీటర్ గుర్తు కనిపిస్తుంది.
ఐఫోన్ వేడెక్కడానికి ప్రధాన కారణాలు
నేరుగా ఎండలో ఉంచడం: కేవలం ఎండలే కాకుండా మనం చేసే కొన్ని పనులు కూడా ఫోన్ వేడెక్కడానికి కారణమవుతాయి. ఫోన్‌ను నేరుగా ఎండ పడే చోట లేదా వేడి ఎక్కువగా ఉన్న చోట ఉంచడం.
చార్జింగ్ పెట్టి వాడటం: ఫోన్ చార్జింగ్‌లో ఉన్నప్పుడు గేమ్స్ ఆడటం లేదా వీడియోలు చూడటం అస్సలు చేయకూడదు.
వైర్‌లెస్ చార్జింగ్: వైర్డ్ చార్జింగ్ కంటే వైర్‌లెస్ చార్జర్లు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి.
హెవీ యాప్స్: గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ లేదా యాప్స్ వాడటం వల్ల ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరిగి వేడి పుడుతుంది.
బ్యాక్‌గ్రౌండ్ యాప్స్: జీపీఎస్ (GPS), బ్లూటూత్ వంటివి నిరంతరం ఆన్ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ ఖర్చయ్యి ఫోన్ వేడెక్కుతుంది.
వేడెక్కిన ఐఫోన్‌ను చల్లబరచడం ఎలా?
- ఫోన్‌ను ఎండలో నుంచి తీసి నీడ ఉన్న చోటికి లేదా చల్లని గదిలోకి తీసుకెళ్లండి.
- ఫోన్ కున్న లావుపాటి బ్యాక్ కవర్లను తీసేయండి, ఇవి వేడిని బయటకు పోనివ్వకుండా అడ్డుకుంటాయి.
- వైర్‌లెస్ చార్జింగ్‌కు బదులుగా సాధారణ కేబుల్ చార్జింగ్ వాడండి.
- అవసరం లేని బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను పూర్తిగా క్లోజ్ చేయండి.
- ఫోన్‌ను Low Power Mode లో ఉంచడం ద్వారా లోడ్ తగ్గించవచ్చు.
- ముఖ్యంగా పార్క్ చేసిన కారులో లేదా బైక్ డ్యాష్ బోర్డులపై ఫోన్‌ను అస్సలు వదిలి వెళ్లకండి.
ముఖ్య హెచ్చరిక.. ఇవి అస్సలు చేయకండి.!
- ఫోన్ వేడెక్కిందని కంగారులో చాలా మంది చేసే తప్పులు ఫోన్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తాయి.
- వేడెక్కిన ఐఫోన్‌ను తీసుకెళ్లి ఫ్రిజ్‌లో లేదా ఫ్రీజర్‌లో పెట్టకండి.
- ఫోన్‌పై నీళ్లు పోయడం వంటివి చేయకండి.
- ఫోన్ వేడిగా ఉన్నప్పుడు బలవంతంగా చార్జింగ్ పెట్టకండి.
అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు ఫోన్ లోపలి భాగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి, ఈ వేసవిలో మీ ఖరీదైన ఐఫోన్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి..




