iQOO 16: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐక్యూ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్

iQOO 16: ఐకూ 16 త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ మైక్రోసైట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో 5.01GHz స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 165Hz డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాలు, 8400mAh బ్యాటరీ ఉండనున్నాయి.

Venkat
Published on: 25 Nov 2026 7:43 PM IST
iQOO 16
X

iQOO 16: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐక్యూ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్

iQOO 16: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సందడి చేయబోతోంది. వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ నుంచి వస్తున్న ఐకూ 16 త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్‌ను ఇండియాలోనూ తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అమెజాన్‌లో ప్రత్యేక మైక్రోసైట్ అందుబాటులోకి రావడంతో ఫోన్ లాంచ్‌పై ఆసక్తి పెరిగింది. 5.01GHz వరకు క్లాక్ స్పీడ్ ఉన్న స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. అయితే భారత్‌లో లాంచ్ తేదీ, ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

అమెజాన్‌లో iQOO 16 మైక్రోసైట్

ఐకూ 16 కోసం అమెజాన్ ఇండియాలో ప్రత్యేక మైక్రోసైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయించనున్నట్లు అందులో సూచించారు. కంపెనీ ఇండియా హెడ్ నిపుణ్ మార్యా కూడా ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్లో పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఖచ్చితమైన తేదీ, ధరపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది విడుదలైన iQOO 15కు తర్వాతి మోడల్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

5.01GHz స్పీడ్‌తో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్

ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌కు చెందిన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ ఉండనుంది. ఇది 2nm తయారీ ప్రక్రియపై రూపొందిన చిప్‌సెట్. గరిష్ఠంగా 5.01GHz క్లాక్ స్పీడ్ అందించగలదని కంపెనీ వెల్లడించిన వివరాలు సూచిస్తున్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఈ ప్రాసెసర్ ఉపయోగపడనుంది. చైనా మోడల్‌లో 6.85 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. భారత మోడల్‌లోనూ ఇవే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అయితే ఇండియా వేరియంట్ పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

50MP ట్రిపుల్ కెమెరా.. 32MP సెల్ఫీ కెమెరా

ఫొటోగ్రఫీ కోసం ఐకూ 16లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాకు OIS సపోర్ట్ ఉంది. దీనికి తోడు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. ఈ టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చని సమాచారం. అయితే కెమెరా ఫీచర్లలో భారత మోడల్‌కు ఏమైనా మార్పులు ఉంటాయా అనేది లాంచ్ సమయంలో స్పష్టమవుతుంది.

8400mAh బ్యాటరీ.. 100W ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ఫోన్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ 8,400mAh భారీ బ్యాటరీ. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఎక్కువసేపు గేమింగ్ చేసే వారికి, వీడియోలు చూసే వారికి ఈ బ్యాటరీ ఉపయోగపడే అవకాశం ఉంది. చైనా మోడల్‌లో OriginOS 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారంగా పనిచేస్తుంది. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. భారత మార్కెట్లోకి వచ్చే మోడల్‌లో ఈ స్పెసిఫికేషన్లు ఎంతవరకు ఉంటాయో కంపెనీ అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం ఐకూ 16 భారత ధరను కంపెనీ ప్రకటించలేదు. చైనాలో ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర 5,999 యువాన్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.86 వేల పరిధికి సమానం. అయితే చైనా ధరను నేరుగా భారత ధరగా భావించకూడదు. పన్నులు, మార్కెట్ పరిస్థితులు, వేరియంట్లను బట్టి ఇండియా ధర మారవచ్చు. డిసెంబర్‌లో లాంచ్ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ధర, ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు, ఆఫర్లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.