Mobile Charging: ఎక్కువ వాట్స్ ఉన్న ఛార్జర్‌తో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.? అసలు నిజం ఇదిగో
Mobile Charging: తక్కువ వాట్స్ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ వాట్స్ ఉన్న ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే ఫోన్ పాడైపోతుందా.? ఈ విషయంపై నిపుణులు చెబుతున్న అసలు నిజం..
Mobile Charging: ఈ రోజుల్లో మార్కెట్లోకి రకరకాల ఫాస్ట్ ఛార్జర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలామంది మొబైల్ వినియోగదారుల్లో ఒక సాధారణ అనుమానం ఉంటుంది. మన ఫోన్ తక్కువ వాట్స్ సపోర్ట్ చేసి.. దానికి ఎక్కువ వాట్స్ ఉన్న ఫాస్ట్ ఛార్జర్ కనెక్ట్ చేస్తే బ్యాటరీ పాడైపోతుందా లేదా ఫోన్ పేలిపోతుందా అని భయపడుతుంటారు. ఈ అపోహలపై టెక్ నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇలా ఉన్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తక్కువ వాట్స్(ఉదాహరణకు 20W లేదా 40W) మాత్రమే సపోర్ట్ చేసే ఫోన్లను, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న 60W లేదా అంతకంటే ఎక్కువ వాట్స్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసినా ఫోన్ ఎంతమాత్రం పాడవ్వదు. అదొక కేవలం అపోహ మాత్రమే. ఆధునిక స్మార్ట్ఫోన్లలో ప్రత్యేకమైన పవర్ మేనేజ్మెంట్ చిప్స్ ఉంటాయి. ఈ చిప్స్ మీ ఫోన్ బ్యాటరీకి ఎంత పవర్ కావాలో అంత మాత్రమే ఛార్జర్ నుంచి గ్రహించేలా నియంత్రిస్తాయి.
మీ ఫోన్ కెపాసిటీ 20W అయితే, మీరు 60W ఛార్జర్ కనెక్ట్ చేసినా కూడా ఆ ఫోన్ కేవలం 20W పవర్‌ను మాత్రమే తీసుకుంటుంది. మనం వాడే ఒరిజినల్, బ్రాండెడ్ ఛార్జర్లు వోల్టేజ్‌ను సురక్షితంగా సర్దుబాటు చేసేలా డిజైన్ చేసి ఉంటాయి. ఇవి ఫోన్ సామర్థ్యాన్ని బట్టి ఆటోమేటిక్‌గా పవర్‌ను సప్లై చేస్తాయి.
అసలైన ప్రమాదం ఎక్కడుంది?
ఎక్కువ వాట్స్ ఉన్న ఛార్జర్ల వల్ల ఫోన్లకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ, మార్కెట్లో దొరికే నకిలీ ఛార్జర్లను వాడితే మాత్రం కచ్చితంగా ఫోన్ పాడవుతుంది. నకిలీ ఛార్జర్లలో సరైన పవర్ కంట్రోల్ మెకానిజం ఉండదు. కాబట్టి బ్రాండెడ్, ఒరిజినల్ ఛార్జర్లు అయితే ఇంట్లో అందరూ ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




