Jio 5G Pico: గోడలు అడ్డొచ్చినా 5G సిగ్నల్ తగ్గేదేలే.. జియో కొత్త టెక్నాలజీ ప్రత్యేకతలు ఇవే..!
Jio 5G Pico: బయటకు వెళ్లగానే ఫుల్ 5G సిగ్నల్.. అదే బిల్డింగ్‌లోకి వెళ్లగానే నెట్వర్క్ మాయం! ఈ సమస్యకు పరిష్కారం చూపేలా రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త Pico Small Cell టెక్నాలజీని తీసుకొచ్చింది.
Jio 5G Pico: గోడలు అడ్డొచ్చినా 5G సిగ్నల్ తగ్గేదేలే.. జియో కొత్త టెక్నాలజీ ప్రత్యేకతలు ఇవే..!
Jio 5G Pico: దేశంలో 5G నెట్వర్క్ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే చాలామంది వినియోగదారులకు ఒక సమస్య ఎదురవుతోంది. బయట రోడ్లపై ఉన్నప్పుడు ఫోన్లో 5G సిగ్నల్ బాగానే ఉన్నప్పటికీ, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, అపార్ట్మెంట్లు, భారీ భవనాల్లోకి వెళ్లగానే నెట్వర్క్ బలహీనపడుతోంది. కాంక్రీట్ గోడలు, ప్రత్యేక గాజు నిర్మాణాల కారణంగా సిగ్నల్స్ సరిగా చేరకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సమస్యను తగ్గించేందుకు రిలయన్స్ జియో (Reliance Jio) Pico Small Cell అనే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇది చిన్న 5G బేస్ స్టేషన్లా పనిచేస్తూ భవనాల లోపల నెట్వర్క్ కవరేజీని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
అసలు ఏమిటీ Jio Pico Small Cell?
Pico Small Cell అనేది చిన్న పరిమాణంలో ఉండే 5G నెట్వర్క్ పరికరం. దీన్ని భవనాల గోడలు లేదా పైకప్పులపై అమర్చవచ్చు. భవనంలో ఏ ప్రాంతంలో నెట్వర్క్ సమస్య ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ యూనిట్లను ఏర్పాటు చేసి 5G కవరేజీని విస్తరించవచ్చు.
సాధారణంగా భారీ భవనాల్లో మొబైల్ సిగ్నల్స్ అందించేందుకు డిస్ట్రిబ్యూటెట్ యాంటెనా సిస్టం (DAS) ఉపయోగిస్తారు. ఇందుకోసం బేస్మెంట్ నుంచి ప్రతి అంతస్తు వరకు కేబుల్స్, యాంటెన్నాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే పికో స్మాట్ సెల్ సిగ్నల్ ప్రాసెసింగ్, రేడియో ట్రాన్స్మిషన్ వ్యవస్థలను ఒకే చిన్న యూనిట్లో పొందుపరిచారు. దీంతో భారీ కేబులింగ్ అవసరాన్ని తగ్గించవచ్చు.
1Gbps వరకు డౌన్లోడ్ స్పీడ్!
ఈ టెక్నాలజీలో మరో ఆకర్షణీయమైన అంశం ఇంటర్నెట్ వేగం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ పరికరం 3.3GHz నుంచి 3.6GHz మధ్య ఉండే n78 స్పెక్ట్రమ్ బ్యాండ్‌పై పనిచేస్తుంది. అలాగే స్టాండర్డ్ లోన్ 5G నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుంది.
దీని ద్వారా గరిష్ఠంగా 1Gbps డౌన్లోడ్ స్పీడ్, 75Mbps వరకు అప్లోడ్ స్పీడ్ సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. అయితే ఇవి గరిష్ఠ సామర్థ్యానికి సంబంధించిన వేగాలు మాత్రమే. వాస్తవంగా వినియోగదారులకు లభించే స్పీడ్ నెట్వర్క్ పరిస్థితులు, ఒకేసారి కనెక్ట్ అయ్యే వినియోగదారుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
సాఫ్ట్వేర్ అప్డేట్స్తో కొత్త ఫీచర్లు
జియో ఈ పరికరాన్ని సాఫ్ట్ వేర్ డిఫైన్డ్ రేడియో (SDR) ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించినట్లు సమాచారం. దీని ప్రత్యేకత ఏమిటంటే భవిష్యత్తులో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రతిసారీ మొత్తం హార్డ్‌వేర్‌ను మార్చాల్సిన అవసరం ఉండదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా కూడా కొత్త ఫీచర్లు జోడించే అవకాశం ఉంటుంది.
అలాగే ఈ వ్యవస్థలో లేటెన్సీ 15 నుంచి 20 మిల్లీసెకన్ల వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్, క్లౌడ్ ఆధారిత సేవలు, రియల్ టైమ్ అప్లికేషన్లకు ఉపయోగపడుతుంది.
విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుందా?
పెద్ద భవనాల్లో నెట్వర్క్ పరికరాలను ఏర్పాటు చేయడం సాధారణంగా సమయం తీసుకునే ప్రక్రియ. అయితే పికో స్మాల్ సెల్ సెటప్‌ను ఆటోమేటెడ్ విధానంలో నిర్వహించేలా రూపొందించినట్లు సమాచారం. ఒకేసారి పలు అంతస్తుల్లో పరికరాలను యాక్టివేట్ చేయడం, కాన్ఫిగర్ చేయడం సాధ్యమవుతుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నెట్వర్క్ వినియోగం తక్కువగా ఉన్న సమయాల్లో విద్యుత్ వినియోగాన్ని 20 శాతం వరకు తగ్గించగలదని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఎవరికి ఎక్కువ ఉపయోగం?
ఈ టెక్నాలజీ ముఖ్యంగా షాపింగ్ మాల్స్, కార్పొరేట్ ఆఫీసులు, ఆసుపత్రులు, హోటళ్లు, భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఆయా భవనాల్లో 5G సిగ్నల్ బలహీనంగా ఉండే ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందించవచ్చు.
మొత్తంగా చూస్తే జియో పికో స్మాల్ సెల్ టెక్నాలజీ ఇండోర్ 5G కనెక్టివిటీలో కీలక మార్పులు తీసుకురాగలదు. అయితే దీని వాస్తవ పనితీరు, విస్తృత స్థాయి అమలు, అందుబాటుపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.




