జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. గూగుల్ AI ప్రో ప్లాన్ రద్దు.! మరి ఇప్పుడు బెస్ట్ ఏంటి.?

Jio: జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో రూ.35 వేల విలువైన గూగుల్ AI ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కొత్త యూజర్లకు నిలిపివేసి, దాని స్థానంలో కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ ఆఫర్లను అందిస్తోంది.

Ravi
By Ravi
Published on: 16 Nov 2026 4:15 PM IST
Jio
X

జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. గూగుల్ AI ప్రో ప్లాన్ రద్దు.! మరి ఇప్పుడు బెస్ట్ ఏంటి.?

Jio: జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌లో పలు మార్పులు చేసింది. రూ.35వేలు విలువ చేసే గూగుల్ AI ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కొత్త యూజర్లకు తొలగించింది. గతంలో ఎలాంటి అడిషనల్ ప్లాన్స్ లేకుండా దీనిని ఉచితంగా అందించింది. అయితే ఇప్పటికే క్లెయిమ్ చేసుకున్నవారికి వర్తిస్తుందని పేర్కొంది. దీని స్థానంలో పలు రీఛార్జ్ ప్లాన్లపై రూ.4వేలు విలువ చేసే కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్లను అందిస్తుంది.

గూగుల్ AI ప్రో ఆఫర్‌ను జియో ఈ ఏడాది ప్రారంభించింది. అర్హత ఉన్న యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా ఇచ్చే ఈ సబ్‌స్క్రిప్షన్ విలువ రూ.35,100గా చెప్పారు. జెమిని మోడల్, ఇమేజ్, వీడియో జనరేషన్ టూల్స్, 2 టీబీ క్లౌడ్ స్టోరేజ్, నోట్‌బుక్ఎల్‌ఎం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అదే ప్లాన్‌ను గూగుల్ నుంచి నేరుగా కొంటే భారత్‌లో నెలకు రూ.1,950 ఖర్చవుతుంది. దీంతో ఎంతోమంది యూజర్లు రూ.349 ప్లాన్‌కు మారారు.

అయితే గత నెలాఖరు నుంచి ఈ ఆఫర్ కొత్త క్లెయిమ్‌లకు నిలిచిపోయింది. అక్టోబర్ 29 లోపు క్లెయిమ్ చేసుకున్నవారు మిగిలిన కాలం పాటు ఉపయోగించుకోవచ్చని సోషల్ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. జియో హెల్ప్ పేజీ ప్రకారం, ముందే క్లెయిమ్ చేసినవారు 18 నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా దీన్ని వాడుకోవచ్చు. అయితే ఆ మొత్తం కాలంలో వారి నంబర్ రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువ ఉన్న అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లో కొనసాగాలి.

దీని స్థానంలో జియో కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అర్హత ఉన్న రీఛార్జ్‌లపై 12 నెలల పాటు కాన్వా ప్రీమియం ప్లాన్‌ను ఉచితంగా ఇస్తోంది. రూ.399 ప్లాన్ ఉన్నవారికి కాన్వా ప్రో, రూ.349 ప్లాన్‌తో పాటు రోజుకు 2GB డేటా లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చే అర్హత ఉన్న ఇతర ప్లాన్లకు కాన్వా ప్రో లైట్ వస్తుంది. సవరించిన రూ.349 ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్ సదుపాయం కూడా చేరినట్లు ఒక రిపోర్ట్ పేర్కొంది.

రెండింటి మధ్య తేడా కూడా ఉంది. కాన్వా ప్రోలో కంటెంట్ ప్లానర్, కాన్వా AI, అధిక AI వినియోగ పరిమితులు, పెద్ద బ్రాండ్ కిట్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ప్రో లైట్‌లో ప్రాథమిక డిజైన్ టూల్స్ మాత్రమే ఉండి, AI ఫీచర్లు ఉచిత వెర్షన్ స్థాయిలోనే పరిమితంగా ఉంటాయి. విద్యార్థులు, క్రియేటర్లు, చిన్న వ్యాపారులు ఈ ఆఫర్‌తో డిజైనింగ్ కోసం ప్రత్యేకంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

అయినప్పటికీ, కేవలం గూగుల్ AI ప్రో కోసమే రూ.349 ప్లాన్‌కు మారిన వినియోగదారులకు ఇది నిరాశ కలిగించే మార్పే. వారు ఇప్పుడు గూగుల్ AI ప్రోను సాధారణ ధరకే కొనుక్కోవాల్సి ఉంటుంది. జియో ఈ మార్పుపై ముందుగా పెద్దగా ప్రకటన ఇవ్వలేదని, ఆఫర్ కోసం ఎదురుచూసిన కొందరు వినియోగదారులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.