June 2026 Phones : జూన్‌లో దుమ్మురేపనున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే.!

June 2026 Phones : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మే నెల కొంత నిరాశనే మిగిల్చింది. మార్కెట్లోకి కొన్ని కొత్త ఫోన్లు వచ్చినప్పటికీ, భారతీయ కొనుగోలుదారులు ఎక్కువగా..

G Krishna
Published on: 27 May 2026 12:37 PM IST
June-2026-Smartphones
X

June-2026-Smartphones

June 2026 Phones : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మే నెల కొంత నిరాశనే మిగిల్చింది. మార్కెట్లోకి కొన్ని కొత్త ఫోన్లు వచ్చినప్పటికీ, భారతీయ కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడే మిడ్-రెంజ్ విభాగంలో పెద్దగా చలనం కనిపించలేదు. ఈ ఏడాది వాల్యూ-ఫార్-మనీ స్మార్ట్‌ఫోన్ల నిర్వచనం కూడా పూర్తిగా మారిపోయింది. గతంలో రూ.15,000 నుండి రూ.18,000 ధరలో లభించిన ఫీచర్లు, ఇప్పుడు ఏకంగా రూ.25,000 లేదా అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ ఫోన్లలో కనిపిస్తున్నాయి. రియల్‌మీ 16టీ లాంటి మోడళ్లు భారీ బ్యాటరీని అందించినప్పటికీ, ఎల్‌సీడీ స్క్రీన్‌ను వాడటం వల్ల బడ్జెట్ ఫోన్లలో రాజీ పడక తప్పట్లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో రాబోయే జూన్ నెల మొబైల్ మార్కెట్‌కు అత్యంత కీలకం కానుంది. బ్యాటరీ, కెమెరా, డిస్‌ప్లే , పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో సమతుల్యంగా ఉండే పలు మిడ్-రెంజ్, అప్పర్ మిడ్-రెంజ్ ఫోన్లు ఈ నెలలో సందడి చేయబోతున్నాయి. కొత్త ఫోన్ కొనే తొందర లేకపోతే, మరికొన్ని రోజులు ఆగి జూన్ లాంచ్‌ల కోసం వేచి చూడటం ఉత్తమమైన నిర్ణయం కావచ్చు. జూన్ లో భారత మార్కెట్లోకి రాబోతున్న ఆ క్రేజీ స్మార్ట్‌ఫోన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.





మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+: కేక పుట్టించే పెరిస్కోప్ కెమెరా

ప్రముఖ బ్రాండ్ మోటోరోలా జూన్ 4వ తేదీన భారత మార్కెట్లో తన అత్యంత ప్రీమియం మోడల్ ‘మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+’ను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో లభించే ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా సెటప్ అనే చెప్పాలి. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్‌ను అమర్చారు, ఇది ఈ సిరీస్‌లోని సాధారణ ప్రో మోడల్ కంటే దీనిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. దీనికి తోడు 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా 710 మెయిన్ కెమెరా, నైట్ ఫోటోగ్రఫీ, ఫ్రేమ్ స్టెబిలైజేషన్ , 50x ఏఐ సూపర్ జూమ్ ప్రో వంటి ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి ట్రావెల్ ఫోటోగ్రఫీ, పోర్ట్రెయిట్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. డిజైన్ పరంగా కూడా పాంటోన్ ఫినిషింగ్‌తో వస్తున్న ఈ ఫోన్ ఎడమ వైపున షార్ట్‌కట్స్ లేదా ఏఐ ఫీచర్ల కోసం ఒక అదనపు బటన్‌ను కూడా కలిగి ఉండటం విశేషం.






షావోమి 17టీ: నాలుగు సంవత్సరాల తర్వాత పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ

మోటోరోలాకు పోటీగా షావోమి కూడా అదే జూన్ 4వ తేదీన తన సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. కంపెనీ తన పాపులర్ టి-సిరీస్‌ను దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకువస్తూ ‘షావోమి 17టీ’ మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. దీనిని కంపెనీ “ది టెలిఫోటో మాస్టర్” అని పిలుస్తోంది. ఇందులో లైకా (Leica) ట్యూన్ చేసిన 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించారు, ఇది 10x ఆప్టికల్ క్వాలిటీ హైబ్రిడ్ జూమ్ , 120x ఏఐ అల్ట్రా జూమ్ సామర్థ్యాన్ని ఇస్తుంది. లీకైన సమాచారం ప్రకారం ఇందులో 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్, 6500mAh భారీ బ్యాటరీ , 67W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉండనున్నాయి. దీని ధర దాదాపు రూ.55,000 నుండి రూ.60,000 మధ్య ఉండే అవకాశం ఉంది.





వన్ ప్లస్ 15ఎస్: 7500mAh బ్యాటరీతో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ కిల్లర్

నార్డ్ సిరీస్ విజయాల తర్వాత వన్ ప్లస్ సంస్థ జూన్ నెలలో ‘వన్ ప్లస్ 15ఎస్’ మోడల్‌ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. చైనాలో విడుదలైన వన్ ప్లస్ 15టీ మోడల్‌ను ఇక్కడ రీబ్రాండ్ చేసి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 6.32-ఇంచుల 1.5K అమోలెడ్ స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్ , 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రానుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించబోతున్నారు. దీనికి తోడు ఏకంగా 7500mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఛార్జింగ్ , 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి రాకెట్ ఫీచర్లు ఉండనున్నాయి. కెమెరా పరంగా 50MP డ్యూయల్ కెమెరాతో పాటు 3.5x పెరిస్కోప్ లెన్స్ , అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అధునాతన హంగులు ఇందులో ఉండబోతున్నాయి.






రెడ్‌మీ టర్బో 5 , రెడ్‌మీ 17 5జీ: ఒకే రోజు రెండు విభిన్న ఫోన్లు

షావోమి సబ్ బ్రాండ్ రెడ్‌మీ జూన్ 18వ తేదీన భారత్‌లో పెద్ద ప్లాన్‌తో వస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం రెడ్‌మీ టర్బో 5 , రెడ్‌మీ 17 5జీ మోడళ్లు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఇవి ఇద్దరు వేర్వేరు కస్టమర్లను టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. ఇందులో రెడ్‌మీ టర్బో 5 మోడల్ పవర్ యూజర్లు, గేమింగ్ ప్రియుల కోసం రాబోతోంది. ఇది 1.5K అమోలెడ్ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, 7560mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ , 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. కాగా, రెడ్‌మీ 17 5జీ మోడల్ బడ్జెట్ వినియోగదారుల కోసం ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్‌గా రాబోతోంది. ఇందులో ఎల్‌సీడీ హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్‌సెట్, 7000mAh కంటే పెద్ద బ్యాటరీ , ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్ ఉండనున్నాయి.





వీవో టీ5 లైట్ 5జీ , ఐకూ జెడ్11 5జీ: మిడ్-రెంజ్‌లో గట్టి పోటీ

ప్రముఖ బ్రాండ్లు వీవో , ఐకూ కూడా జూన్ నెలలోనే తమ కొత్త వేరియంట్లను రంగంలోకి దించుతున్నాయి. వీవో నుండి టీ5 లైట్ 5జీ మోడల్ నెలాఖరుకల్లా వచ్చే అవకాశం ఉంది. ఇది డైమెన్సిటీ 6300, 6400 ప్రాసెసర్‌తో దాదాపు రూ.20,000 బడ్జెట్ ధరలో అందుబాటులోకి రానుంది. అదే సమయంలో ఐకూ (iQOO) బ్రాండ్ నుండి జెడ్11 5జీ మోడల్ రాబోతోంది, దీని ధర రూ.30,000 లోపు ఉండవచ్చని అంచనా. భారతీయ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్, అడ్రినో 810 జీపీయూ , ఆండ్రాయిడ్ 16 వంటి లేటెస్ట్ ఫీచర్లను అందించబోతున్నారు.





టెక్నో పోవా 8 5జీ: వినూత్న డిజైన్‌తో సరికొత్త ప్రయోగం

టెక్నో సంస్థ తన పోవా 8 సిరీస్ ఫోన్ల ఇండియా లాంచ్‌ను అధికారికంగా ఖరారు చేసింది. "డిలీట్ నార్మల్" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో గ్లిఫ్ లైట్స్, సెకండరీ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే వంటి వినూత్న డిజైన్ ఫీచర్లను కలిగి ఉండబోతోంది. లీక్స్ ప్రకారం టెక్నో పోవా 8 5జీ మోడల్‌లో డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 6.76-ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ+ 144Hz స్క్రీన్, 50MP మెయిన్ కెమెరా ఉంటాయి. అన్నింటికీ మించి ఇందులో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని అందించడం ఈ ఫోన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది.






ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో 5జీ: బడ్జెట్ గేమర్లకు అసలైన పండగ

జూన్ నెలలో రాబోతున్న స్మార్ట్‌ఫోన్ల జాబితాలో ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రో 5జీ అత్యంత ఆసక్తికరమైన మోడల్‌గా నిలవనుంది. ఇండోనేషియా మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ ఫోన్, ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టబోతోంది. మొబైల్‌లో ఎక్కువ సమయం గేమింగ్ ఆడేటప్పుడు వచ్చే హీటింగ్ సమస్యలను, పర్ఫార్మెన్స్ డ్రాప్స్‌ను అరికట్టడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ఇందులో డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్, బయాపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6500mAh బ్యాటరీ, , ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పెంచడానికి ఇందులో ఫిజికల్ షోల్డర్ ట్రిగర్లను కూడా అమర్చారు. దీని ధర దాదాపు రూ.27,999 నుండి రూ.30,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇన్ఫినిక్స్ కనుక దీనిని రీజనబుల్ ధరలో మార్కెట్లోకి తెస్తే మిగిలిన గేమింగ్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story