Layoffs: 1000 మందిని తొల‌గించారు 50 రోబోలను తీసుకున్నారు.. భ‌య‌పెడుతోన్న ఉద్యోగాల తొల‌గింపు

Layoffs: అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జ‌న‌ర‌ల్ మోట‌ర్స్ (GM) తన డెట్రాయిట్ తయారీ కేంద్రంలో భారీ మార్పులు చేపట్టింది.

Mokshith
Published on: 22 Jun 2026 11:42 AM IST
Layoffs
X

Layoffs: 1000 మందిని తొల‌గించారు 50 రోబోలను తీసుకున్నారు.. భ‌య‌పెడుతోన్న ఉద్యోగాల తొల‌గింపు

Layoffs: అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జ‌న‌ర‌ల్ మోట‌ర్స్ (GM) తన డెట్రాయిట్ తయారీ కేంద్రంలో భారీ మార్పులు చేపట్టింది. కంపెనీ 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించి, వారి పనిలో కొంత భాగాన్ని 50 రోబోటిక్ యూనిట్లతో భర్తీ చేసింది. ఈ నిర్ణయం కార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది.

డెట్రాయిట్ ప్లాంట్‌లో రోబోల ప్రవేశం

మిచిగాన్ రాష్ట్రంలోని GM ఫ్యాక్టరీలో "కోబోట్స్" (Collaborative Robots) అనే ప్రత్యేక రోబోట్లను ప్రవేశపెట్టారు. ఇవి పూర్తిగా మనుషుల స్థానాన్ని భర్తీ చేయకుండా, మిగిలిన ఉద్యోగులతో కలిసి పనిచేస్తాయి. ముఖ్యంగా అసెంబ్లీ లైన్‌పై కదులుతున్న వాహనాల బాడీ ప్యానెల్స్‌ను అమర్చే పనిని ఈ రోబోలు నిర్వహిస్తున్నాయి.

ఎందుకు రోబోట్లను తీసుకొచ్చింది?

కంపెనీ ప్రకారం, తయారీ ప్రక్రియను మరింత ఆధునికంగా మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. రోబోట్ల వల్ల ఉద్యోగుల భద్రత మెరుగుపడటంతో పాటు శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుందని జ‌న‌ర‌ల్ మోట‌ర్స్ చెబుతోంది. GM ప్రతినిధి కెవిన్ కెల్లీ మాట్లాడుతూ, "మా తయారీ కేంద్రాల్లో ఆధునిక సాంకేతికతను తీసుకురావడంలో భాగంగా కోబోట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇవి ఉద్యోగులతో కలిసి పనిచేస్తూ భద్రత, పనితీరు సామర్థ్యాన్ని పెంచుతాయి" అని తెలిపారు.

కార్మిక సంఘాల తీవ్ర ఆందోళన

అయితే ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యునైటెడ్ ఆటో వ‌ర్క‌ర్స్ (UAW) లోకల్ 22 అధ్యక్షుడు జేమ్స్ కాటన్ మాట్లాడుతూ, రోబోలు ఉద్యోగాలను కబళిస్తున్నాయని ఆరోపించారు. "ఒకే ప్లాంట్‌లో వెయ్యికి పైగా ఉద్యోగులను తొలగించిన తర్వాత రోబోలు రావడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తు రోబోట్లదే అని చెబుతున్నారు. కానీ అలా అయితే వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, "మా ప్లాంట్లలో కోబోట్లను ప్రవేశపెట్టడంపై మేము తీవ్ర అసంతృప్తితో ఉన్నాం" అని తెలిపారు.

లాభాలు పెరిగినా ఉద్యోగాల కోత

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, GM ఆర్థికంగా బలంగా ఉన్న సమయంలోనే ఈ ఉద్యోగాల కోతలు జరిగాయి. 2026 తొలి త్రైమాసికంలో కంపెనీ 4.25 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం ఎక్కువ. దీంతో కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కంపెనీ లాభాలు పెరుగుతున్న సమయంలో ఉద్యోగాలను తగ్గించి, రోబోట్లను పెంచడం సరైన నిర్ణయమేనా అని వారు నిలదీస్తున్నారు.

ఆటోమొబైల్ రంగంలో ఆటోమేషన్ కొత్త దిశ

ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమలో ఆటోమేషన్ వేగంగా పెరుగుతోంది. తయారీ ఖర్చులను తగ్గించడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం, ప్రమాదకర పనులను యంత్రాలతో చేయించడం వంటి లక్ష్యాలతో కంపెనీలు రోబోటిక్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే మరోవైపు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే భయం కార్మికుల్లో పెరుగుతోంది. GM తాజా నిర్ణయం కూడా ఇదే చర్చకు కేంద్రబిందువుగా మారింది. రాబోయే రోజుల్లో ఆటోమేషన్, ఉద్యోగాల భద్రత మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నది పరిశ్రమకు పెద్ద సవాల్‌గా మారనుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story