Lenovo Laptop: 22 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో కొత్త ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లు ఇవే!
Lenovo V15 G7 Q7X Laptop: లెనోవో కొత్త V15 G7 Q7X ల్యాప్‌టాప్‌లో 22 గంటల బ్యాటరీ బ్యాకప్, 16GB RAM, 512GB SSD, 400 నిట్స్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ప్రత్యేకతలు.
Lenovo Laptop: 22 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో కొత్త ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లు ఇవే!
Lenovo V15 G7 Q7X Laptop: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ సంస్థ లెనోవో (Lenovo) కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. Lenovo V15 G7 Q7X పేరుతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్‌లో 15.3 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 20 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా వీడియో ప్లేబ్యాక్ సమయంలో గరిష్ఠంగా 22 గంటల వరకు బ్యాటరీ వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ల్యాప్‌టాప్ ధర, స్పెసిఫికేషన్లు ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ విభాగంలో లెనోవో కొత్త ల్యాప్‌టాప్
లెనోవో V15 G7 Q7X మోడల్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ C ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. గతంలో ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ కాగా, తాజాగా మార్కెట్లోకి వచ్చింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ కంప్యూటింగ్ అవసరాలు ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
డిజైన్, మార్కెట్లో లభ్యత
లెనోవో సపోర్ట్ డాక్యుమెంట్లు, PSREF వెబ్సైట్లో ఈ ల్యాప్‌టాప్ వివరాలు ముందుగానే కనిపించాయి. ఇదే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ C C11-0100 చిప్సెట్తో పనిచేసే IdeaPad Slim 3 14Q7X11, IdeaPad Slim 3 15Q7X11 మోడళ్లను కూడా కంపెనీ వివిధ దేశాల్లో విక్రయిస్తోంది.
ప్రస్తుతం Lenovo V15 G7 Q7X ల్యాప్‌టాప్ జపాన్ మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. యూరప్, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు చూపిస్తోంది. అమెరికా, కెనడా మార్కెట్లలో విడుదలపై గతంలో సమాచారం ఉన్నప్పటికీ, అక్కడ ఇంకా విక్రయానికి లిస్ట్ కాలేదు.
ఈ ల్యాప్‌టాప్ Onyx Grey రంగులో మాత్రమే లభిస్తుంది. ప్లాస్టిక్ టాప్, బాటమ్ ప్యానెల్స్‌తో రూపొందించిన ఈ పరికరం బరువు 1.59 కిలోలు.
Lenovo V15 G7 Q7X స్పెసిఫికేషన్లు
ఈ ల్యాప్‌టాప్‌లో 15.3 అంగుళాల IPS డిస్ప్లేను అందించారు. ఇది 1200p రిజల్యూషన్, 400 నిట్స్ బ్రైట్నెస్, 60Hz రిఫ్రెష్ రేట్, 45 శాతం NTSC కలర్ కవరేజ్‌కు మద్దతు ఇస్తుంది.
ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇందులో Qualcomm Snapdragon C C11-0100 ARM చిప్‌సెట్‌ను ఉపయోగించారు. వేగవంతమైన వైర్లెస్ కనెక్టివిటీ కోసం Wi-Fi 6E, బ్లూటూత్ 6.0 సపోర్ట్ కూడా ఉన్నాయి.
22 గంటల బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేకత
ఈ ల్యాప్‌టాప్‌లో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ బ్యాకప్. ఇందులో 50Wh బ్యాటరీని అందించారు. దీనికి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
150 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1080p వీడియోలను ప్లే చేసినప్పుడు గరిష్ఠంగా 22 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని లెనోవో చెబుతోంది. అలాగే 200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో నిర్వహించిన JEITA-BAT 3.0 వీడియో ప్లేబ్యాక్ పరీక్షలో 20 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్‌ను అందించినట్లు సమాచారం.
Lenovo V15 G7 Q7X ధర ఎంత?
జపాన్‌లో విడుదలైన Intel ప్రాసెసర్‌తో కూడిన V15 G7 IWC మోడల్‌తో పోలిస్తే స్నాప్‌డ్రాగన్ వెర్షన్ ధర కొంత ఎక్కువగా ఉంది. అయితే ఇతర స్నాప్‌డ్రాగన్ ఆధారిత ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే దీని ధర తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
16GB RAM, 512GB SSD స్టోరేజ్, Windows 11 Home కలిగిన బేస్ వేరియంట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ.71,000గా ఉంది. Windows 11 Pro, Office Home & Business 2024 లైసెన్స్‌తో వచ్చే టాప్ వేరియంట్ ధర సుమారు రూ.1.09 లక్షలుగా పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ భారత మార్కెట్లో విడుదలైనట్లు సమాచారం లేదు. కాబట్టి భారతదేశంలో ధర, విక్రయాల ప్రారంభ తేదీపై లెనోవో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




