Lift Safety: లిఫ్ట్ మూసుకుపోతుంటే చేయి అడ్డు పెడుతున్నారా?.. ఈ ఒక్క పొరపాటుతో ప్రాణాలకే ప్రమాదం
Lift Safety: బహుళ అంతస్తుల భవనాల్లో రోజువారీ ప్రయాణానికి లిఫ్ట్ కామన్ గా మారింది.
Lift Safety
Lift Safety: బహుళ అంతస్తుల భవనాల్లో రోజువారీ ప్రయాణానికి లిఫ్ట్ కామన్ గా మారింది. చాలామంది తలుపులు మూసుకునే సమయంలో ఆపేందుకు కాళ్లు, చేతులు అడ్డుపెడుతుంటారు. సెన్సార్లు ఉన్నాయనే ధీమాతో చేసే ఈ చిన్న పొరపాటు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది లిఫ్ట్ తలుపులు మూసుకుంటున్నప్పుడు సెన్సార్ ఉందనే నమ్మకంతో చేతిని లేదా బ్యాగును అడ్డుగా పెడతారు. అన్ని లిఫ్ట్ డోర్లలో అత్యంత అధునాతన సెన్సార్ పరిజ్ఞానం ఉండదు. పాతకాలపు లిఫ్ట్‌లలో కేవలం మధ్య భాగంలోనో లేదా కింద మాత్రమే సెన్సార్లు పనిచేస్తుంటాయి. మనం అడ్డుపెట్టిన చేయి ఆ సెన్సార్ పరిధిలోకి రాకపోతే తలుపులు ఆగకుండా మూసుకుపోతాయి. సాంకేతిక లోపాలు, మెకానికల్ వైఫల్యాలు ఎదురైనప్పుడు సెన్సార్ పనిచేయక డోర్లు విపరీతమైన ఒత్తిడితో మూసుకుంటాయి. దీనివల్ల వేళ్లు నలిగిపోవడం, ఎముకలు విరిగిపోవడం వంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.
లిఫ్ట్ ఆపాలంటే సరైన మార్గాలు ఇవే
లిఫ్ట్ డోర్లు మూసుకుంటున్నప్పుడు వాటిని చేతులతో బలవంతంగా ఆపే ప్రయత్నం అస్సలు చేయకూడదు. మీరు లిఫ్ట్ లోపల ఉన్నట్లయితే కంట్రోల్ ప్యానెల్‌పై ఉండే డోర్ ఓపెన్ (◄►) బటన్‌ను మాత్రమే నొక్కాలి. బయట వేచి చూస్తున్నవారైతే ప్యానెల్ పైభాగంలో ఉన్న అప్ లేదా డౌన్ బటన్ నొక్కితే తలుపులు దానంతట అవే తెరుచుకుంటాయి. ఈ సరైన పద్ధతులు పాటించడం వల్ల అనవసరమైన ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.
అత్యవసర సమయాల్లో ఏం చేయాలి?
ప్రతి లిఫ్ట్‌కు నిర్దిష్టమైన బరువు మోసే సామర్థ్యం ఉంటుంది. ఇళ్లలో వాడే లిఫ్ట్‌ల సామర్థ్యం కమర్షియల్ కాంప్లెక్స్ లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కితే కేబుళ్లు తెగిపడే ముప్పు ఉంటుంది. ఒకవేళ ప్రయాణిస్తున్నప్పుడు లిఫ్ట్ సడెన్‌గా ఆగిపోతే కంగారుపడి తలుపులను బలవంతంగా తెరవకూడదు. లోపల ఉండే అత్యవసర అలారం బటన్ నొక్కితే బయట ఉన్నవారికి సమాచారం అందుతుంది. సమాచార వ్యవస్థ కోసం లిఫ్ట్‌లో ఎమర్జెన్సీ ఫోన్ సదుపాయం ఉందో లేదో ముందే గమనించడం శ్రేయస్కరం.
పిల్లల విషయంలో జాగ్రత్త
చిన్నపిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వకూడదు. 12 ఏళ్ల లోపు పిల్లలు లిఫ్ట్ బటన్లతో ఆటలాడుతుంటే వెంటనే వారించాలి. లిఫ్ట్ ఆగి తలుపులు పూర్తిగా తెరుచుకున్న తర్వాతే బయటకు రావాలి. వృద్ధులు, పిల్లలను ముందుగా దిగనివ్వడం మంచిది. తోపులాట లేకుండా ప్రశాంతంగా ప్రయాణించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడవచ్చు.




