Loan Apps: మొబైల్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Loan Apps: అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు ఆన్‌లైన్ లోన్ యాప్‌లను కూడా చాలామంది ఆశ్రయిస్తున్నారు.
Loan Apps: మొబైల్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.? ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Loan Apps: అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు ఆన్‌లైన్ లోన్ యాప్‌లను కూడా చాలామంది ఆశ్రయిస్తున్నారు. కొన్ని యాప్‌లు నిమిషాల్లోనే రుణం అందిస్తామని ప్రచారం చేస్తున్నాయి. అయితే వేగంగా లోన్ వస్తుందనే కారణంతో ఏ యాప్‌ను పడితే అది నమ్మడం ప్రమాదకరం. యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆర్‌బీఐ అనుమతి ఉందా.?
ముందుగా ఆ యాప్ ద్వారా రుణం అందిస్తున్న బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ వివరాలను తెలుసుకోవాలి. ఆ సంస్థ ఆర్‌బీఐ పరిధిలో నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. సంస్థ పేరు, వెబ్‌సైట్, కార్యాలయ వివరాలు స్పష్టంగా లేకపోతే అలాంటి యాప్‌లకు దూరంగా ఉండటం మంచిది. కేవలం యాప్‌లో కనిపించే ప్రకటనలను నమ్మి రుణం తీసుకోకూడదు.
ఏయే అనుమతులు అడుగుతోంది.?
లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో యాప్ మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, మెసేజ్‌లు, ఫొటోలు, లొకేషన్ వంటి వివరాలకు అనుమతి కోరుతుందా గమనించాలి. రుణానికి అవసరం లేని వ్యక్తిగత సమాచారాన్ని అడిగే యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. యాప్ లేదా సంస్థకు సంబంధించిన ప్రైవసీ పాలసీని కూడా చదవాలి. వెబ్‌సైట్ సురక్షితంగా ఉందో తెలుసుకోవడానికి అది HTTPSతో ప్రారంభమవుతుందా అనేది చూడాలి.
రేటింగ్ మాత్రమే కాదు.. రివ్యూలు కూడా చూడాలి
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో ఉన్న రేటింగ్, వినియోగదారుల అభిప్రాయాలను పరిశీలించాలి. అధిక వడ్డీ, దాచిన ఛార్జీలు, రుణ వసూళ్ల సమయంలో వేధింపులు, కస్టమర్ సపోర్ట్ లేకపోవడం వంటి ఫిర్యాదులు ఎక్కువగా కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. మంచి రుణ సంస్థ సాధారణంగా తన రుణ నిబంధనలు, వడ్డీ, ఛార్జీలను స్పష్టంగా వెల్లడిస్తుంది.
రుణం తీసుకునే ముందు KFS చదవాలి
రుణ ఒప్పందానికి ముందు సంస్థ ఇచ్చే కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ (KFS)లో వడ్డీ, ఛార్జీలు, ఇతర ముఖ్యమైన నిబంధనలు ఉంటాయి. ఇందులో పేర్కొనని అదనపు మొత్తాలను తర్వాత వసూలు చేస్తున్నారా అనేది కూడా గమనించాలి. రుణం మంజూరు చేయడానికి ముందే ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బు పంపాలని ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండాలి. కేవలం నెలవారీ EMIని కాకుండా మొత్తం రుణ వ్యయాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా.?
యాప్‌లో కొన్ని నిమిషాల్లో రుణం రావడం సులభమే అయినా, దాన్ని తిరిగి చెల్లించడం అంతే సులభంగా ఉండకపోవచ్చు. మీ నెలవారీ ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలు, ఇతర ఖర్చులను లెక్కలోకి తీసుకుని EMI చెల్లించగలరా లేదా ముందుగానే చూసుకోవాలి. అత్యవసర సమయాల్లో మాత్రమే అవసరమైన మొత్తాన్ని తీసుకోవడం మంచిది. రుణం తీసుకునే ముందు సంస్థకు సరైన కస్టమర్ కేర్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉన్నాయా అనేది కూడా నిర్ధారించుకోవాలి.




