Logitech: లాజిటెక్ నుంచి కొత్త స్మార్ట్ మౌస్.. దీనిలో ప్రతి ఫీచర్ నెక్స్ట్ లెవెల్ అంతే

లాజిటెక్ భారత్‌లో MX Master 4 Creator Edition స్మార్ట్ మౌస్‌ను లాంచ్ చేసింది. రూ.20,699 ఎంఆర్‌పీ ఉన్న ఈ లిమిటెడ్ ఎడిషన్ మౌస్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,995కే లభిస్తోంది.

CR Reddy
Published on: 22 Nov 2026 11:02 AM IST
Logitech MX Master 4
X

Logitech MX Master 4

Logitech: ప్రముఖ కంప్యూటర్ యాక్సెసరీస్ సంస్థ లాజిటెక్ భారత మార్కెట్లోకి తన సరికొత్త MX మాస్టర్ 4 క్రియేటర్ ఎడిషన్ మౌస్‌ను విడుదల చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ మౌస్. ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, అలాగే ఏఐ టూల్స్ ఉపయోగించే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. సాధారణ మౌస్‌లతో పోలిస్తే దీని డిజైన్, పనితీరు చాలా భిన్నంగా ఉంటాయి. యూజర్లు తమ రోజువారీ పనులను వేగంగా పూర్తి చేసుకునేందుకు వీలుగా ఇందులోని బటన్లు, కంట్రోల్స్‌ను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

రూ.7,704 భారీ డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతంటే?

భారత్‌లో MX మాస్టర్ 4 క్రియేటర్ ఎడిషన్ మౌస్‌ను అసలు ఎమ్మార్పీ ధర రూ.20,699గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో కేవలం రూ.12,995 ప్రత్యేక ధరకే లిస్ట్ చేశారు. అంటే కస్టమర్లకు ఎంఆర్‌పీ కంటే ఏకంగా రూ.7,704 తక్కువకే ఈ ప్రీమియం మౌస్ లభిస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కావడంతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

ఆర్ట్‌బోర్డ్ తరహా ప్రత్యేక డిజైన్

ఈ మౌస్ బాడీ డిజైన్ కోసం లాజిటెక్ క్రియేటివ్ స్టూడియోలలో వాడే ఆర్ట్‌బోర్డుల నుంచి స్ఫూర్తి పొందింది. మౌస్ పైభాగంలో విభిన్నమైన గీతలు, కలర్ కాలిబ్రేషన్ బ్యాండ్‌లు, డిజైనింగ్ టూల్స్‌ను తలపించే గుర్తులు కనిపిస్తాయి. వీటితో పాటు వరల్డ్ డిజైన్ డే, వరల్డ్ ఫోటోగ్రఫీ డే, వరల్డ్ క్రియేటివిటీ డే లాంటి ప్రత్యేక రోజులకు సంబంధించిన టైమ్‌స్టాంపులను కూడా మౌస్ బాడీపై ముద్రించారు. ఇది చూసేందుకు ఎంతో క్లాసీగా, క్రియేటివ్‌గా ఉంటుంది.

హ్యాప్టిక్ సెన్స్ ప్యానెల్, యాక్షన్స్ రింగ్‌తో పని మరింత సులభం

యూజర్ల పనిని సులువు చేసేందుకు ఇందులో అద్భుతమైన స్మార్ట్ ఫీచర్లు ఇచ్చారు. ఇందులోని హ్యాప్టిక్ సెన్స్ ప్యానెల్ ద్వారా మీరు షార్ట్‌కట్ వాడినప్పుడు లేదా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేళ్లకు చిన్నపాటి వైబ్రేషన్ తగులుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్‌ను మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. అలాగే ఇందులో యాక్షన్స్ రింగ్ అనే ప్రత్యేక బటన్ ఉంది. దీన్ని నొక్కగానే కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక మెనూ ఓపెన్ అవుతుంది. అందులో వివిధ యాప్‌ల షార్ట్‌కట్లు, ఫిల్టర్లు, ఎడిటింగ్ టూల్స్ కనిపిస్తాయి. దీనివల్ల మాటిమాటికీ మెనూలు వెతికే శ్రమ తప్పుతుంది.

సెకనుకు 1,000 లైన్ల స్క్రోలింగ్

ఈ మౌస్‌లో ఉన్న మ్యాగ్‌స్పీడ్ స్క్రోల్ వీల్ దీని ప్రధాన బలం. దీని సాయంతో కేవలం ఒక్క సెకనులో ఏకంగా 1,000 లైన్ల వరకు స్క్రోల్ చేయవచ్చని లాజిటెక్ చెబుతోంది. ఇది తమ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన, నిశ్శబ్దమైన, కచ్చితమైన స్క్రోలింగ్ సిస్టమ్ అని కంపెనీ పేర్కొంది. బ్లూటూత్ లేదా యూఎస్‌బీ టైప్-సీ రిసీవర్ ద్వారా దీన్ని కనెక్ట్ చేయవచ్చు. ఇందులోని కొత్త రేడియో చిప్, మెరుగైన యాంటెన్నా వల్ల పాత మోడల్ కంటే కనెక్టివిటీ వేగం రెట్టింపు అయింది. మొత్తం 7 బటన్లు, బొటనవేలితో తిప్పే మరో స్క్రోల్ వీల్, చేతికి సౌకర్యవంతంగా సరిపోయే డిజైన్ ఉండటంతో గంటల తరబడి కంప్యూటర్ ముందు పనిచేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.