Meta paid subscription: ఫేస్‌బుక్‌కు రూ.340 , వాట్సాప్‌కు రూ.255..ఇక నెల నెల చెల్లించాల్సిందే
Meta paid subscription: మెటా సంస్థ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యూజర్ల కోసం ప్లస్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రకటించింది.
Meta paid subscription: ఫేస్‌బుక్‌కు రూ.340 , వాట్సాప్‌కు రూ.255..ఇక నెల నెల చెల్లించాల్సిందే
Facebook and WhatsApp: సమాజంలో అత్యధికులు పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఉచితంగా వాడుతున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యాప్‌లలో ఇకపై సరికొత్త మార్పులు రాబోతున్నాయి. కేవలం యాడ్స్ ద్వారానే ఆదాయం సంపాదించే బిజినెస్ మోడల్‌ను దాటి, మెటా సంస్థ ఎట్టకేలకు సబ్స్క్రిప్షన్ ఆధారిత సేవల్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. అదనపు ఫీచర్లు, మరింత కంట్రోల్ కోరుకునే యూజర్ల కోసం మూడు ప్లాట్‌ఫారమ్‌లలోనూ ప్లస్ పేరిట పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. మెటా ప్రొడక్ట్ హెడ్ నవోమి గ్లీట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ సంచలన ప్రకటనను ధృవీకరించారు.
నివేదికల ప్రకారం ఈ కొత్త సేవలకు అంతర్జాతీయంగా మరియు భారతీయ కరెన్సీలో నిర్ణయించిన సుమారు ధరలు ఇలా ఉన్నాయి.ఇన్స్టాగ్రామ్ ప్లస్, ఫేస్బుక్ ప్లస్‌లకు నెలకు రూ.340 ఖర్చవుతుంది.వాట్సాప్ ప్లస్ ధర నెలకు రూ.255గా ఉండనుంది. ఈ పెయిడ్ ప్లాన్స్ వచ్చాయని సాధారణ ఉచిత యాప్‌లు ఎక్కడికీ పోవు. ఉచిత వెర్షన్లు యథావిధిగా కొనసాగుతాయి. మరింత ఎక్కువ ఫీచర్లు, అడ్వాన్స్డ్ టూల్స్ కావాలనుకునే వారు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను టార్గెట్ చేస్తూ డిజైన్ చేశారు. ఇందులో అధునాతన విశ్లేషణలు, మీ స్టోరీలను ఎవరు మళ్లీ మళ్లీ చూశారనే ఇన్సైట్స్, ప్రత్యేకమైన ప్రొఫైల్ కస్టమైజేషన్ ఆప్షన్లు మరియు మీ కంటెంట్‌ను ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ చేసేలా ప్రత్యేక సాధనాలు లభిస్తాయి.
ఇది పూర్తిగా పర్సనలైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. సాధారణంగా ఉండే మీ వాట్సాప్ లుక్‌ను మార్చేలా కస్టమ్ యాప్ థీమ్స్, సరికొత్త ప్రీమియం స్టిక్కర్లు మరియు మీ చాట్స్‌కు నచ్చిన విధంగా మార్చుకునే వ్యక్తిగతీకరించిన రింగ్టోన్లు ఇందులో అందుబాటులోకి రానున్నాయి. మెటా గతంలో యూరప్‌లో యాడ్స్ లేని పెయిడ్ వెర్షన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పటికీ, ఈసారి గ్లోబల్ రేంజ్లో పెద్ద స్కెచ్ వేసింది. భవిష్యత్తులో ఈ ప్రీమియం సేవలన్నింటినీ కలిపి మెటా వన్ అనే ఒకే ఒక్క గొడుగు బ్రాండింగ్ కిందకు తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. రాబోయే రోజుల్లో క్రియేటర్లు , బిజినెస్ అకౌంట్ల కోసం మరిన్ని ఏఐ ఆధారిత సబ్స్క్రిప్షన్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి.
మెటాపై ఎందుకు ఈ ఒత్తిడి?
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలు మరియు ఏఐ డేటా సెంటర్ల కోసం మెటా సంస్థ ఈ ఏడాది ఏకంగా $125 బిలియన్ల నుండి $145 బిలియన్ల వరకు భారీ వ్యయాన్ని అంచనా వేసింది. ఈ భారీ ఖర్చులను బ్యాలెన్స్ చేయాలంటే కేవలం యాడ్స్ మీదే ఆధారపడితే సరిపోదని మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సబ్స్క్రిప్షన్ వార్త బయటకు వచ్చిన వెంటనే మెటా స్టాక్ మార్కెట్ వాల్యూ దాదాపు 3 శాతం పెరిగింది. కంపెనీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను వెతుక్కుంటుండటంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




