Tech News: మెటాకు యూజర్ల షాక్.. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్తున్నారా?
Tech News: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నడుపుతున్న 'మెటా' (Meta) సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2026 మొదటి
Meta
Tech News: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నడుపుతున్న 'మెటా' (Meta) సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2026 మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ టెక్ దిగ్గజం, తమ రోజువారీ యాక్టివ్ యూజర్ల (Family Daily Active People - DAP) సంఖ్యలో గత త్రైమాసికంతో పోలిస్తే స్వల్ప క్షీణత నమోదైనట్లు పేర్కొంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే యూజర్ల సంఖ్య 4 శాతం పెరిగినప్పటికీ, త్రైమాసిక ప్రాతిపదికన వినియోగదారులు తగ్గడం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
క్షీణతకు ప్రధాన కారణాలు , గణాంకాలు
మెటా తన పత్రికా ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 2026తో ముగిసిన త్రైమాసికంలో మెటా ఫ్యామిలీ యాప్స్‌లో సగటు రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 3.56 బిలియన్లుగా ఉంది. అయితే, గత త్రైమాసికంతో పోల్చితే ఈ సంఖ్య తగ్గడానికి ఇరాన్‌లో ఇంటర్నెట్ అంతరాయాలు , రష్యాలో వాట్సాప్‌పై ఉన్న ఆంక్షలు ప్రధాన కారణాలని కంపెనీ వివరించింది. అయితే, అంతర్గత నివేదికల ప్రకారం మెటా తన ప్లాట్‌ఫామ్‌ల నుండి మొత్తంగా దాదాపు 20 మిలియన్ల మంది యూజర్లను కోల్పోయినట్లు సమాచారం. సోషల్ మీడియా ఫీడ్లలో నాణ్యత రోజురోజుకూ దిగజారుతుండటం వల్ల వినియోగదారులు ఇతర ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌లో సమూల మార్పులు
ఫీడ్ నాణ్యతపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మెటా ఇప్పటికే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ నాణ్యతను పెంచేందుకు రికమెండేషన్ అల్గారిథమ్‌ను మార్పు చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం, ఇతరుల కంటెంట్‌ను కాపీ చేసి, ఎలాంటి మార్పులు చేయకుండా తిరిగి పోస్ట్ చేసే 'అన్‌ఒరిజినల్ కంటెంట్'కు ఇన్‌స్టాగ్రామ్ ఇకపై చెక్ పెట్టనుంది. అటువంటి పోస్టుల యొక్క రీచ్‌ను తగ్గించడంతో పాటు వాటికి తక్కువ ర్యాంకింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే, కేవలం క్లిక్‌ల కోసమే పనిచేసే వెబ్‌సైట్ల నుండి వచ్చే వార్తలు , రచయితల సమాచారం సరిగ్గా లేని కంటెంట్‌ను కూడా వినియోగదారులకు తక్కువగా చూపేలా అల్గారిథమ్‌ను తీర్చిదిద్దుతున్నారు.
ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు , భవిష్యత్తు
యూజర్ల సంఖ్యలో ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల కోసం మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై భారీగా ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది ఏఐ కోసం గతంలో అంచనా వేసిన దానికంటే అదనంగా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 94,947 కోట్లు) ఖర్చు చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా ఏఐ సేవలను మెరుగుపరిచి, యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు గ్లోబల్ మార్కెట్లలో 'మెటా ఏఐ బిజినెస్ అసిస్టెంట్' అందుబాటులోకి రావడం, వాట్సాప్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మెసెంజర్ తరహా చాట్ బబుల్స్ ఫీచర్‌ను తీసుకురావడం వంటివి వినియోగదారులను తిరిగి ఆకట్టుకోవడంలో కీలకం కానున్నాయి.




