Microsoft: మైక్రోసాఫ్ట్ సరికొత్త వ్యూహం..ఉద్యోగులకు స్పెషల్ ప్యాకేజీ
Microsoft: మైక్రోసాఫ్ట్ తన 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించింది.
Microsoft: మైక్రోసాఫ్ట్ సరికొత్త వ్యూహం..ఉద్యోగులకు స్పెషల్ ప్యాకేజీ
Microsoft Exit Package: టెక్ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ అంటే ఒక సామ్రాజ్యం. 1975లో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, సంస్థ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తన చరిత్రలోనే మొదటిసారిగా వాలంటరీ రిటైర్మెంట్ పథకాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మైక్రోసాఫ్ట్ ఈ పథకం కోసం ఒక ఆసక్తికరమైన అర్హతను పెట్టింది. కంపెనీలో ఒక ఉద్యోగి పనిచేసిన సంవత్సరాలు, సదరు ఉద్యోగి వయస్సు.. ఈ రెండూ కలిపి 70 ఏళ్లు దాటితే, వారు ఈ ప్రత్యేక ఎగ్జిట్ ప్యాకేజీకి అర్హులు. అంటే, సంస్థ కోసం దశాబ్దాలుగా చెమటోడ్చిన సీనియర్లకు ఒక రాజమార్గం లాంటి వీడ్కోలు పలకాలని కంపెనీ భావిస్తోంది.
స్పెషల్ ప్యాకేజీ
వెళ్లిపోయే ఉద్యోగుల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ భారీ ఆఫర్లనే ప్రకటించింది. ఐదేళ్ల పాటు ఆరోగ్య సంరక్షణ మద్దతు లభిస్తుంది. ఇందులో మొదటి ఏడాది వైద్య, దంత, కంటి చికిత్సల ఖర్చును పూర్తిగా కంపెనీయే భరిస్తుంది. మిగిలిన నాలుగేళ్లు ఉద్యోగులు ప్రీమియం చెల్లిస్తూ అదే కార్పొరేట్ కవరేజ్‌ను పొందవచ్చు. ఉద్యోగి హోదా, సర్వీస్ కాలాన్ని బట్టి ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లిస్తారు. ముఖ్యంగా మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు గరిష్టంగా 39 వారాల జీతం అందే అవకాశం ఉంది. నగదుతో పాటు కంపెనీ షేర్ల రూపంలో కూడా ప్రయోజనాలను కల్పించి, ఆర్థికంగా వారికి భరోసా ఇస్తోంది.
నివేదికల ప్రకారం, మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ఈ భారీ వీడ్కోలు కార్యక్రమం కోసం కంపెనీ సుమారు రూ. 7,500 కోట్లు భారీ వ్యయాన్ని భరించడానికి సిద్ధమైంది. ఈ స్వచ్ఛంద విరమణ వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊపేస్తోంది. ఏఐ రంగంలో అగ్రగామిగా ఉండాలంటే భారీ పెట్టుబడులు అవసరం. అందుకే, ఖర్చులను నియంత్రించుకుంటూనే, కొత్త తరం సాంకేతికతకు అనుగుణంగా సంస్థను పునర్నిర్మించుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.
ఈ పర్వం ముగియగానే కొన్ని విభాగాల్లో ఉద్యోగాల కోత కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, సంస్థ ఎదుగుదలలో భాగస్వాములైన పాత తరాన్ని గౌరవంగా సాగనంపుతూ, కొత్త తరం ఏఐ వైపు మైక్రోసాఫ్ట్ వేస్తున్న ఈ అడుగు ఇప్పుడు కార్పొరేట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.




