Mivi Smartphone: మివి స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ.. సెప్టెంబర్‌లో తొలి ఫోన్!

వేరబుల్స్‌ బ్రాండ్‌ మివి త్వరలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్‌లో తొలి ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Aug 2026 12:20 AM IST
Mivi Smartphone
X

Mivi Smartphone

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దేశీయ కంపెనీల సందడి పెరుగుతోంది. ఇప్పటికే వేరబుల్స్ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న మివి (Mivi) ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఫ్లిప్‌కార్ట్‌లో మివి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పోస్టర్ కనిపించడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. కంపెనీ కూడా తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ప్రవేశిస్తున్న విషయాన్ని ధ్రువీకరించింది.

టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. మివి తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్‌లో ఆవిష్కరించనుంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన వ్యూహాలను బలోపేతం చేసుకునేందుకు పోకో, నథింగ్ వంటి సంస్థల్లో గతంలో పనిచేసిన హిమాంశు టాండన్‌ను చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా నియమించింది.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఫోన్లను తీసుకురావడంపై దేశీయ బ్రాండ్లు దృష్టి పెడుతున్నాయి. ఇదే వ్యూహంతో మివి కూడా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫైర్‌బోల్ట్ కూడా ప్రవేశిస్తోంది. ‘బోల్ట్’ బ్రాండ్‌పై ఏస్, ఎవో పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను ఆగస్టు 25న విడుదల చేయనుంది. తక్కువ ధరలో కొత్త ఫీచర్లతో ఈ ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం.

ఒకప్పుడు మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్ వంటి భారతీయ బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కీలకంగా ఉండేవి. చైనా కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదురుకావడంతో అవి క్రమంగా మార్కెట్‌కు దూరమయ్యాయి. ప్రస్తుతం లావా, ఏఐ+ వంటి దేశీయ బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మివి, ఫైర్‌బోల్ట్ ఎంట్రీతో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story