Motorola Signature 27: 200MP కెమెరా.. 100x జూమ్‌తో మెటరోలా సిగ్నేచర్ 27.. భారత్‌లో లాంచ్‌కు రెడీ!

Motorola Signature 27: మోటరోలా (Motorola) ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. Motorola Signature 27 నవంబర్‌లో భారత్‌లో లాంచ్ కానుంది.

Venkat
Published on: 28 Oct 2026 9:55 PM IST
Motorola Signature 27
X

Motorola Signature 27: 200MP కెమెరా.. 100x జూమ్‌తో మెటరోలా సిగ్నేచర్ 27.. భారత్‌లో లాంచ్‌కు రెడీ!

Motorola Signature 27: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మోటరోలా సిద్ధమవుతోంది. మెటరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్‌లో భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మోటరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌కు ప్రత్యేక పేజీ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే లాంచ్ తేదీ, ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఈ ఫోన్‌లో కెమెరా, ప్రాసెసర్‌తో పాటు గేమింగ్, ఏఐ ఫీచర్లు, వేడిని నియంత్రించే సాంకేతికతపై కూడా మోటరోలా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

స్నాప్ డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్..

మెటరోలా సిగ్నేచర్ 27లో క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్ర్టీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది వేగవంతమైన పనితీరు, గేమింగ్, ఏఐ ఆధారిత పనులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రీమియం చిప్‌సెట్‌గా కంపెనీ పేర్కొంటోంది.

ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, వీడియో రికార్డింగ్ వంటి భారీ పనుల సమయంలో ఫోన్ వేడెక్కకుండా ప్రత్యేక కూలింగ్ వ్యవస్థను కూడా అందిస్తున్నారు. ఈ కూలింగ్ టెక్నాలజీకి మోటరోలా డైమెండ్ కూల్డ్ 3D వేపర్ ఛాంబర్ అనే పేరు పెట్టింది. ఇందులో డైమండ్-ఇన్‌ఫ్యూజ్డ్ థర్మల్ జెల్, కొత్త డిజైన్‌తో రూపొందించిన వేఫర్ చాంబర్ ఉంటాయి.

ఫోన్‌లో ఉత్పత్తి అయ్యే వేడిని మరింత సమర్థంగా వ్యాప్తి చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. అయితే వాస్తవ వినియోగంలో దీని పనితీరు ఎంతవరకు ఉంటుందనేది ఫోన్ పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే స్పష్టమవుతుంది.

200MP పెరిస్కోప్ కెమెరా

మెటరోలా సిగ్నేచర్ 27లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనుంది. దూరంలోని వస్తువులను స్పష్టంగా ఫొటో తీయడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది. అలాగే సూపర్ జూమ్ ప్రో ఫీచర్ ద్వారా 100x వరకు డిజిటల్ జూమ్ అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది. జూమ్ చేసిన ఫొటోలను మెరుగుపరిచేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించనున్నారు.

ఫోన్‌లో 50MP సోనీ ప్రధాన కెమెరా కూడా ఉండనుంది. తక్కువ వెలుతురులో ఫొటోలు తీయడం, కెమెరా పనితీరును మెరుగుపరచడంలో ఈ సెన్సార్ కీలకంగా ఉండొచ్చు. అయితే కెమెరా నాణ్యతను కేవలం మెగాపిక్సెల్స్ ఆధారంగా నిర్ణయించలేం. కెమెరా సాఫ్ట్‌వేర్, వివిధ లైటింగ్ పరిస్థితుల్లో ఫొటోల నాణ్యత కూడా కీలకమే.

ఈ ఫోన్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ బ్యాంగ్ ఓలుఫ్సేన్ ట్యూన్ చేసిన ఆడియో వ్యవస్థ. ప్రీమియం సౌండ్ ఉత్పత్తులకు పేరుగాంచిన ఈ బ్రాండ్ ట్యూనింగ్‌తో ఫోన్‌లో సంగీతం, సినిమాలు, గేమ్స్, పాడ్‌కాస్ట్స్ కోసం ప్రత్యేక సౌండ్ మోడ్‌లు లభించనున్నాయి.

అయితే వాస్తవ సౌండ్ నాణ్యతను స్పీకర్ వాల్యూమ్, బాస్, స్పష్టత వంటి అంశాల ఆధారంగా పరీక్షించిన తర్వాతే పూర్తిగా అంచనా వేయగలం.

ప్రీమియం డిజైన్

మెటరోలా సిగ్నేచర్ 27లో ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం, గ్లాస్-సిరామిక్ వంటి ప్రీమియం మెటీరియల్స్‌ను ఉపయోగించారు. ఫోన్ అంచులను స్వల్పంగా రౌండ్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.

ధర ఎంత?

మెటరోలా సిగ్నేచర్ 27 భారత ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఓ నివేదిక ప్రకారం ఫోన్ ప్రారంభ ధర రూ.70,000 నుంచి రూ.80,000 మధ్య ఉండొచ్చని అంచనా. ఇది లీక్ ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే. మోటరోలా అధికారికంగా ధృవీకరించే వరకు ఈ ధరను ఖచ్చితమైనదిగా పరిగణించకూడదు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.