NODE Wireless Charger Launch: ఒక్క వైర్‌తో అన్నీ ఛార్జ్.. కొత్త గ్యాడ్జెట్ అదిరింది.!
NODE Wireless Charger Launch: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ, ఆఫీస్ డెస్క్ పైనా కనిపిస్తున్న పెద్ద సమస్య.. వైర్ల గోల. చేతిలో ఫోన్, వాచ్, చెవుల్లో
NODE Wireless Charger Launch
NODE Wireless Charger Launch: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ, ఆఫీస్ డెస్క్ పైనా కనిపిస్తున్న పెద్ద సమస్య.. వైర్ల గోల. చేతిలో ఫోన్, వాచ్, చెవుల్లో ఇయర్‌బడ్స్.. ఇలా గ్యాడ్జెట్లు ఎక్కువవుతున్న కొద్దీ వాటి ఛార్జర్లు, కేబుల్స్ అన్నీ కలిసి ఒక పెద్ద వలలా తయారవుతున్నాయి. ఏ ఛార్జర్ దేనికో తెలియక, సాకెట్ల దగ్గర వైర్లు చిక్కుపడిపోయి చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తూ, స్వదేశీ బ్రాండ్ 'డైలీఆబ్జెక్ట్స్' (DailyObjects) ఒక సూపర్ ఛార్జర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే 'నోడ్' (NODE) వైర్లెస్ ఛార్జర్. కంపెనీ దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి మాడ్యులర్ వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ అని చెబుతోంది.
ఏమిటీ మాడ్యులర్ డిజైన్? ఎలా పనిచేస్తుంది?
ఈ ఛార్జర్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. దీనిని 'డాక్ అండ్ గో' మోడల్ అంటారు. అంటే మీరు ఆఫీస్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు ఫోన్, వాచ్, ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ స్టాండ్లు అన్నీ ఒకే బేస్‌కు అతుక్కుని ఉండి అన్నింటినీ ఒకేసారి ఛార్జ్ చేస్తాయి. ఒకవేళ మీరు అర్జంట్‌గా బయటకు వెళ్లాలనుకుంటే, మొత్తం ఛార్జర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఫోన్ ఛార్జ్ చేసే భాగాన్ని మాత్రం విడదీసి పవర్‌బ్యాంక్‌లా జేబులో వేసుకుని వెళ్ళిపోవచ్చు. మీ అవసరాన్ని బట్టి 2-ఇన్-1 , 3-ఇన్-1 సెటప్‌ను మార్చుకోవచ్చు.
ఇన్‌బిల్ట్ పవర్‌బ్యాంక్, స్టైలిష్ టేబుల్ ల్యాంప్
నోడ్ ఛార్జర్లోని ఫోన్ స్టాండ్‌లో కంపెనీ 7800mAh పవర్‌బ్యాంక్‌ను కూడా పెట్టింది. దీనివల్ల మీరు దానిని మెయిన్ బోర్డు నుండి విడదీసి బయటకు తీసుకెళ్లినా, మీ ఐఫోన్ , ఆండ్రాయిడ్ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఐఫోన్‌ను ఒకటిన్నర సార్లు ఫుల్ ఛార్జ్ చేయగలదు. దీనితో పాటు ఒక చిన్న పోర్టబుల్ ల్యాంప్ (లైట్) కూడా వస్తుంది. ఇందులో 2600mAh బ్యాటరీ ఉంటుంది. రాత్రి పూట చదువుకోవడానికి , నైట్ లైట్లా వాడుకోవడానికి ఇది బాగుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ లైట్ 8 గంటల పాటు వెలుగుతుంది. ఈ డివైజ్ చూడటానికి చాలా మోడ్రన్‌గా, క్లాస్‌గా ఉంటుంది. కేవలం ఛార్జర్‌లా కాకుండా టేబుల్ పైన ఒక అందమైన షోపీస్‌లా కనిపిస్తుంది.
ఒక్క వైరే ప్రాణం.. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..!
ఈ మొత్తం సెటప్‌ను ఆన్ చేయడానికి బోర్డుకు ఒకే ఒక్క కేబుల్ (వైర్) పెడితే సరిపోతుంది. ఆ ఒక్క వైర్ ద్వారానే పక్కన ఉన్న ఫోన్, వాచ్, ల్యాంప్ అన్నింటికీ పవర్ అందుతుంది. దీనివల్ల మీ టేబుల్ పైన వైర్ల గందరగోళం పూర్తిగా తప్పుతుంది. ఇందులో సరికొత్త 'Qi2.2' వైర్లెస్ టెక్నాలజీని వాడారు. ఇది 25W స్పీడ్‌తో చాలా వేగంగా ఫోన్లను ఛార్జ్ చేస్తుంది. ఫోన్‌ను బట్టి ఏ భాగానికి ఎంత పవర్ కావాలో ఈ ఛార్జరే ఆటోమేటిక్‌గా డిసైడ్ చేసుకుంటుంది.
చిన్న మైనస్ పాయింట్.. ధర ఎంతంటే?
ఈ ఛార్జర్ ద్వారా ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లను దేన్నైనా వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీ దగ్గర ఉన్న స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ మాత్రం ఖచ్చితంగా ఆపిల్ కంపెనీవి (Apple Watch, AirPods) అయి ఉండాలి. ఆండ్రాయిడ్ వాచ్‌లు, నార్మల్ బడ్స్ ఇందులో ఛార్జ్ అవ్వవు. ఆ సపోర్ట్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక ధర విషయానికి వస్తే, ఈ నోడ్ ఛార్జర్ రేటు సుమారు రూ.10,000 నుండి ప్రారంభమవుతుంది. మీరు కొనే మోడల్, భాగాలను బట్టి ధర మారుతుంది. స్టైలిష్‌గా, వైర్ల గోల లేకుండా లైఫ్ సింపుల్‌గా ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.




