AIలో కొత్త బాస్.. 'Nubia NaviX Ultra' టీజర్ రిలీజ్.!
Nubia NaviX Ultra : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'నుబియా' (Nubia) తన సరికొత్త ఏఐ-ఆధారిత (AI-powered) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను పంచుకుంది.
Nubia NaviX Ultra
Nubia NaviX Ultra : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'నుబియా' (Nubia) తన సరికొత్త ఏఐ-ఆధారిత (AI-powered) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను పంచుకుంది. షాంఘై వేదికగా జూలై 17 నుండి జూలై 20 వరకు జరగనున్న 'వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ 2026' (WAIC) ప్రదర్శనకు ముందే ఈ ఫోన్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ సరికొత్త ఫ్లాగ్షిప్ డివైజ్‌కు 'నుబియా నవిక్స్ అల్ట్రా' (Nubia NaviX Ultra) అని పేరు పెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'వైబో' (Weibo) లో కంపెనీ వరుస పోస్ట్‌ల ద్వారా ఈ ఫోన్ డిజైన్ , కలర్ ఆప్షన్లను రివీల్ చేసింది.
ఆకట్టుకునే డిజైన్.. నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో
నుబియా నవిక్స్ అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు విభిన్నమైన కలర్ ఫినిషింగ్స్‌లో లభించనుంది. ఇది బ్లాక్, పింక్, పర్పుల్ , వైట్ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్యాప్సూల్ (పిల్) ఆకారంలో ఉండే ప్రత్యేకమైన కెమెరా ఐలాండ్ డిజైన్‌ను అందించారు, దీనికి కాస్త కిందగా ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. అలాగే ఈ హ్యాండ్సెట్ పక్క భాగంలో (సైడ్) ఒక ఆరెంజ్ కలర్ బటన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బటన్ ద్వారా ఏఐ ఫీచర్లను వేగంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నప్పటికీ, దీని ఖచ్చితమైన పనితీరుపై కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ మధ్యలో హోల్-పంచ్ కటౌట్‌ను ఇచ్చారు.
'దౌబావో ఏఐ అసిస్టెంట్'తో ఏజెంటిక్ పవర్
ఈ స్మార్ట్‌ఫోన్ చైనాకు చెందిన ప్రముఖ 'దౌబావో ఏఐ అసిస్టెంట్' (Doubao AI assistant) తో పనిచేస్తుందని నుబియా ధృవీకరించింది. దీనిలోని ఏజెంటిక్ ఏఐ (Agentic AI) సామర్థ్యాల ద్వారా యూజర్లు వేర్వేరు అప్లికేషన్లలో పనులను చాలా సులభంగా , వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫోన్ అధికారికంగా విడుదల కాకముందే, దీని అత్యుత్తమ సాంకేతికతకు గాను ప్రతిష్టాత్మక 'WAIC 2026 సెయిల్ (SAIL) ఔట్‌స్టాండింగ్ ఏఐ లీడర్ అవార్డు' దక్కడం విశేషం. ఈ మోడల్ గతంలో చైనాలో విడుదలై, ఆ తర్వాత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 (MWC) లో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన 'నుబియా M153' స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో మార్కెట్లోకి వచ్చింది.
ఎప్పుడొస్తుందంటే..
ఈ సరికొత్త ఏఐ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు, ధర, మార్కెట్ లభ్యత , విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలను జూలై 17న ప్రారంభం కానున్న వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ ఈవెంట్ లోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఏఐ సాంకేతికతలో సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు వస్తున్న ఈ ఫోన్ పై టెక్ ప్రియుల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.




