AI Keypad : AIని చేతుల్లోకి తెచ్చిన OpenAI.. కొత్త కీప్యాడ్ లాంచ్.!
AI Keypad : ఎన్నో నెలల ఊహాగానాలకు తెరదించుతూ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) హార్డ్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టింది.
AI Keypad
AI Keypad : ఎన్నో నెలల ఊహాగానాలకు తెరదించుతూ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) హార్డ్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టింది. తన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ 'కోడెక్స్' (Codex) కోసం రూపొందించిన సరికొత్త కీప్యాడ్‌ను లాంచ్ చేయడం ద్వారా తన మొదటి హార్డ్‌వేర్ ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చింది. ప్రముఖ యాక్సెసరీస్ కంపెనీ 'వర్క్ లౌడర్' (Work Louder) భాగస్వామ్యంతో దీనిని రూపొందించారు. దీనికి 'కోడెక్స్ మైక్రో' (Codex Micro) అని పేరు పెట్టారు. అయితే, ఓపెన్ ఏఐ తన హార్డ్‌వేర్ వ్యాపారం కోసం తమ ట్రేడ్ సీక్రెట్స్ , కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని దుర్వినియోగం చేసిందంటూ యాపిల్ (Apple) సంస్థ వేసిన దావాను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ప్రొడక్ట్ లాంచ్ కావడం గమనార్హం. కాగా, ఈ దావాలో ఎలాంటి నిజం లేదని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది.
అసలు ఏంటిది? దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి?
కోడెక్స్ మైక్రోను ఓపెన్ ఏఐ కమాండ్ సెంటర్ ఫర్ ఏజెంటిక్ వర్క్ గా అభివర్ణిస్తోంది. అంటే, కేవలం ఫోన్ లేదా డెస్క్‌టాప్ స్క్రీన్‌పై మాత్రమే ఆధారపడకుండా, నేరుగా ఈ కీప్యాడ్ ద్వారా ఏఐ ఏజెంట్లను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. గత నెల శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఏఐ ఇంజనీర్ వరల్డ్ ఫెయిర్‌లో దీనిని మొదటిసారి ప్రదర్శించారు. ఈ చతురస్రాకార కీప్యాడ్‌లో 13 మెకానికల్ స్విచ్‌లు, ఒక టచ్ సెన్సార్, ఒక రోటరీ ఎన్‌కోడర్, ఒక ప్లానార్ జాయ్‌స్టిక్ ఉన్నాయి. టెక్కీలను ఆకట్టుకునేలా దీనికి ఆర్‌జీబీ లైటింగ్ కూడా ఇచ్చారు. ఇందులోని ప్రత్యేక లైట్-అప్ కీస్ టాస్క్ స్టేటస్‌ను చూపిస్తాయి. కమాండ్ కీస్ ద్వారా కోడెక్స్ పనులను వేగంగా చేయవచ్చు. జాయ్‌స్టిక్ సాయంతో వర్క్‌ఫ్లోలను ప్రారంభించవచ్చు.
ఒక టాస్క్ కోసం ఏఐ ఏజెంట్ ఎంత సమయం, ఎంత కంప్యూటింగ్ పవర్ ఉపయోగించాలనే 'రీజనింగ్ లెవెల్'ను అడ్జస్ట్ చేయడానికి ఈ కీప్యాడ్ లోని డయల్ ఉపయోగపడుతుంది. యూజర్లు తమకు నచ్చినట్లు కీలను రీమ్యాప్ చేసుకోవచ్చు. ఇందుకోసం బాక్స్‌తో పాటు 32 ఐకాన్ కీక్యాప్స్ ఇస్తున్నారు. వర్క్ లౌడర్ ఇన్‌పుట్ సాఫ్ట్‌వేర్ సాయంతో షార్ట్‌కట్లను అసైన్ చేసుకోవడానికి 6 ప్రోగ్రామబుల్ లేయర్స్ ఉంటాయి.
'సైలెంట్' వెర్షన్‌పై సామ్ ఆల్ట్‌మన్ ఆశ్చర్యం
ఈ కోడెక్స్ మైక్రో కీప్యాడ్ "క్లిక్కీ", "సైలెంట్" అనే రెండు వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ లాంచ్ తర్వాత ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో స్పందిస్తూ.. చాలా మంది యూజర్లు సైలెంట్ వెర్షన్ కోసం ఆసక్తి చూపించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని రాశారు. వర్క్ లౌడర్ కో-ఫౌండర్ మైక్ డి జెనోవా తెలిపిన వివరాల ప్రకారం, దీనిలోని 6 ఫ్రోస్టెడ్ కీస్ మీ కోడెక్స్ థ్రెడ్స్ ఎలా నడుస్తున్నాయో లైవ్‌గా చూపిస్తాయి. టాస్క్ ఖాళీగా ఉందా, ఆలోచిస్తోందా, పూర్తయిందా, ఎర్రర్ వచ్చిందా అనే విషయాలు వేర్వేరు రంగుల ద్వారా తెలుస్తాయి. వర్క్ లౌడర్ కంపెనీకి చెందిన 'క్రియేటర్ మైక్రో 2' కీప్యాడ్‌ను రీబ్రాండ్ చేసి దీనిని తెచ్చినట్లు తెలుస్తోంది. ఇది బ్లూటూత్, యూఎస్‌బీ-సి (USB-C) సపోర్ట్‌తో మ్యాక్ , విండోస్ ఓఎస్‌లపై పనిచేస్తుంది.
ధర ఎంత? ఎప్పుడు దొరుకుతుంది?
ఈ ఓపెన్ ఏఐ కీప్యాడ్ ధరను 230 డాలర్లు (సుమారు రూ. 22,000) గా నిర్ణయించారు. ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ (పరిమిత కాలం) మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ కొలాబరేషన్‌లో భాగంగా ఎన్ని యూనిట్లు తయారు చేశారనేది ఓపెన్ ఏఐ వెల్లడించలేదు. ప్రస్తుతం దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. యాపిల్ మాజీ చీఫ్ డిజైనర్ జోని ఐవ్‌తో కలిసి ఓపెన్ ఏఐ నిర్మిస్తున్న పెద్ద హార్డ్‌వేర్ ప్రాజెక్టులతో దీనికి సంబంధం లేదు. చాట్‌జీపీటీ సపోర్ట్, మెకానికల్ పార్ట్స్‌తో కూడిన స్క్రీన్ లేని పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్‌ను కూడా ఓపెన్ ఏఐ ప్రస్తుతం డెవలప్ చేస్తోంది, అది ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది.




