నిద్రతోపాటు గుండె, శ్వాసపై 24 గంటల నిఘా.. మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన స్మార్ట్ రింగ్!
Oura Ring 5 India: స్మార్ట్‌వాచ్‌కు ప్రత్యామ్నాయంగా చిన్న హెల్త్ ట్రాకింగ్ డివైజ్ కోరుకునే వారికి ఓరా కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఓరా రింగ్ 5 భారత మార్కెట్లోకి వచ్చింది.
నిద్రతోపాటు గుండె, శ్వాసపై 24 గంటల నిఘా.. మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన స్మార్ట్ రింగ్!
Oura Ring 5 India: స్మార్ట్‌వాచ్‌ను రోజంతా ధరించకుండా ఆరోగ్యానికి సంబంధించిన కీలక వివరాలను ట్రాక్ చేయాలనుకునే వారికి స్మార్ట్ రింగ్స్ ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారుతున్నాయి. ఈ విభాగంలో ప్రముఖ బ్రాండ్ ఓరా తన కొత్త ఓరా రింగ్ 5ను భారత్‌లో విడుదల చేసింది. కంపెనీ ప్రకారం, గత తరం ఓరా రింగ్ 4తో పోలిస్తే కొత్త రింగ్ మరింత చిన్నగా ఉండేలా డిజైన్ చేశారు.
ఓరా రింగ్ 5లో నిద్ర, యాక్టివిటీ, స్ట్రెస్, రికవరీ వంటి అంశాలకు సంబంధించిన డేటాను సేకరించే సెన్సర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 9 రోజుల వరకు బ్యాటరీ పనిచేయవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే వాస్తవ బ్యాటరీ లైఫ్ రింగ్ సైజ్, వినియోగ విధానంపై ఆధారపడి ఉంటుంది.
ఓరా రింగ్ 5 ధర ఎంత?
భారత్‌లో ఓరా రింగ్ 5 ప్రారంభ ధర రూ.39,900. బ్లాక్, సిల్వర్ వేరియంట్లు ఈ ధరలో లభిస్తాయి. గోల్డ్, డీప్ రోజ్, స్ట్రెంత్, సిల్వర్ వంటి ప్రీమియం కలర్ ఆప్షన్ల ధర రూ.50,900గా ఉంది.
రింగ్‌ను కొనుగోలు చేయడంతో పాటు Oura యాప్‌లో పూర్తి హెల్త్ ఇన్‌సైట్స్ కోసం నెలకు రూ.599 సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలి. అంటే ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఖర్చు రూ.7,188.
దీంతో రూ.39,900 రింగ్‌కు ఒక సంవత్సరం మెంబర్‌షిప్ కలిపితే మొత్తం ఖర్చు రూ.47,088 అవుతుంది. ప్రీమియం కలర్ మోడల్ తీసుకుంటే ఏడాది మెంబర్‌షిప్‌తో కలిపి ఖర్చు రూ.58,088కు చేరుతుంది. కొన్ని బేసిక్ ఫీచర్లు మాత్రం సబ్‌స్క్రిప్షన్ లేకుండా అందుబాటులో ఉంటాయి.
గత మోడల్ కంటే 40% చిన్న డిజైన్..
ఓరా రింగ్ 5ను తేలికైన టైటానియంతో రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. గత తరం మోడల్‌తో పోలిస్తే దీని పరిమాణాన్ని సుమారు 40 శాతం తగ్గించినట్లు పేర్కొంది.
రింగ్‌లోని సెన్సర్ వ్యవస్థను కూడా కొత్తగా రూపొందించారు. కొత్త ఎల్ఈడీ సెన్సర్లు, 12 మెరుగైన సిగ్నల్ పాత్‌వేలు వేర్వేరు వేళ్లు, స్కిన్ టోన్‌లలో ఆరోగ్య సంబంధిత సిగ్నల్స్‌ను మరింత స్థిరంగా రికార్డ్ చేయడంలో సహాయపడతాయని కంపెనీ చెబుతోంది.
ఓరా రింగ్ 5ను 6 నుంచి 13 వరకు సైజుల్లో కొనుగోలు చేయవచ్చు. మొత్తం ఆరు రంగుల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
బ్లడ్ ప్రెజర్ కొలుస్తుందా?
ఓరా రింగ్ 5లో బ్లడ్ ప్రెజెర్‌కు సంబంధించిన ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇది సాధారణ BP మెషీన్‌లా mmHgలో నేరుగా రక్తపోటు రీడింగ్ ఇవ్వదు.
రింగ్‌లోని బ్లడ్ ప్రెజర్ వంటి ఫీచర్లు రాత్రి సమయంలో సేకరించిన డేటాను విశ్లేషించి రక్తపోటుకు సంబంధించిన దీర్ఘకాలిక మార్పులు లేదా ప్యాటర్న్స్‌ను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. కొన్ని ఫీచర్లు సుమారు 30 రోజుల డేటాను పరిశీలించి ట్రెండ్స్‌ను చూపిస్తాయి.
అదనంగా, యూజర్ తన సొంత బీపీ మెషీన్‌తో తీసుకున్న రీడింగ్స్‌ను Oura యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. అయితే ఇవి వెల్‌నెస్ ఇన్‌సైట్స్ మాత్రమే. అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలను నిర్ధారించే మెడికల్ టూల్‌గా రింగ్‌ను ఉపయోగించకూడదు.
నిద్రలో శ్వాసను కూడా ట్రాక్ చేస్తుంది..
ఓరా రింగ్ 5లో రాత్రి నిద్ర సమయంలోనూ ఈ ఫీచర్ కూడా ఉంది. నిద్ర సమయంలో శ్వాసకు సంబంధించిన డేటాను పరిశీలించి, కొంతకాలంగా వస్తున్న మార్పులను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.
ఒక్క రాత్రి డేటుపై కాకుండా దీర్ఘకాలిక ప్యాటర్న్స్‌పై దృష్టి పెట్టడం దీని ప్రత్యేకత. శ్వాసకు సంబంధించిన అసాధారణ మార్పులు నిరంతరం కనిపిస్తే వైద్య నిపుణుడిని సంప్రదించడం గురించి ఆలోచించవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను వ్యాధి నిర్ధారణ సాధనంగా చూడకూడదు.
వర్కౌట్స్, కార్డియోపై కూడా నిఘా..
రింగ్‌లోని కార్డియో ఎఫెక్ట్ ఫీచర్ వర్కౌట్ సమయంలో శరీరంపై పడే కార్డియో లోడ్‌ను అంచనా వేయడంలో సహాయపడుతుంది. వారంలో చేసిన యాక్టివిటీని యూజర్ సాధారణ స్థాయితో పోల్చి చూపుతుంది.
మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక ఫీచర్లు..
ఓరా యాప్‌లో GLP-1 ఇన్ సైట్స్ ఫీచర్ కూడా ఉంది. GLP-1 మందులు ఉపయోగించే వారు డోస్, సమయం, సైడ్ ఎఫెక్ట్స్, బరువులో మార్పులను నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని నిద్ర, యాక్టివిటీ, రికవరీ, స్ట్రెస్ డేటాతో కలిపి చూడవచ్చు.
మహిళల కోసం మోనోపాజ్ ఇన్ సైట్స్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. పెరిమెనోపాజ్ సమయంలో నిద్ర, మూడ్, రోజువారీ పనితీరు వంటి అంశాల్లో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
కొనేముందు ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి..
ఓరా రింగ్ 5 స్క్రీన్ లేని చిన్న డివైజ్‌లో నిద్ర, యాక్టివిటీ, రికవరీ వంటి అంశాల దీర్ఘకాలిక ప్యాటర్న్స్‌ను ట్రాక్ చేయాలనుకునే వారికి ఉపయోగపడవచ్చు. చిన్న డిజైన్, ఎక్కువ రోజులు ఉండే బ్యాటరీ కూడా దీనికి ప్లస్ పాయింట్లు.
అయితే రూ.39,900 ప్రారంభ ధరతో పాటు నెలకు రూ.599 సబ్‌స్క్రిప్షన్ ఉండటం ముఖ్యమైన విషయం. అలాగే ఇది మెడికల్ డివైజ్ కాదు. రింగ్ అందించే హెల్త్ ఇన్‌సైట్స్ వైద్య పరీక్షలకు లేదా డాక్టర్ సలహాకు ప్రత్యామ్నాయం కావు.
మొత్తంగా చూస్తే ఓరా రింగ్ 5లో ప్రధాన ఆకర్షణ చిన్న డిజైన్, మెరుగైన సెన్సర్లు, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఆరోగ్య డేటాను దీర్ఘకాలిక ప్యాటర్న్స్‌గా చూపించే ఫీచర్లే.




