Parag Agrawal: ఎలోన్ మస్క్ వద్దని గెంటేశాడు.. కట్ చేస్తే ఏడాదిలోనే రూ. 19,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు
Parag Agrawal: ట్విట్టర్ నుంచి ఎలోన్ మస్క్ బయటకు పంపిన పరాగ్ అగర్వాల్, ఏడాదిలోనే 2 బిలియన్ డాలర్ల AI సామ్రాజ్యాన్ని నిర్మించి చరిత్ర సృష్టించారు.
Parag Agrawal: ఎలోన్ మస్క్ వద్దని గెంటేశాడు.. కట్ చేస్తే ఏడాదిలోనే రూ. 19,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు
AI Empire: గుర్తుందా? 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను దక్కించుకున్న ఎలోన్ మస్క్, ఆఫీసులోకి అడుగుపెడుతూనే చేసిన మొదటి పని.. అప్పటి సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను సాగనంపడం. నీ సేవలు మాకు ఇక చాలు అంటూ అగౌరవంగా బయటకు పంపినప్పుడు, ప్రపంచమంతా మస్క్ పవర్ చూసి ఆశ్చర్యపోయింది. కానీ, సైలెంట్‌గా వెళ్ళిపోయిన ఆ దేశీ టెక్కీ.. ఇప్పుడు మస్క్ ఫేవరెట్ రంగమైన AIతోనే రివెంజ్ అదుర్స్ అనేలా సమాధానం ఇచ్చారు.
చేతులు కట్టుకుని కూర్చోలేదు
ట్విట్టర్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత పరాగ్ ఖాళీగా ఉండలేదు. సరిగ్గా ఏడాది క్రితం Parallel Web Systems అనే AI స్టార్టప్‌ను ప్రారంభించారు. తాజాగా ఈ కంపెనీ సుమారు రూ. 840 కోట్ల నిధులను సేకరించింది. దీనితో ఈ కంపెనీ మొత్తం విలువ ఇప్పుడు 2 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ. 19,020 కోట్లు. మస్క్ తన 'X' ప్లాట్‌ఫామ్‌ను నిలబెట్టుకోవడానికి తలకిందులవుతుంటే, పరాగ్ మాత్రం కేవలం ఏడాదిలోనే యూనికార్న్ స్థాయిని దాటి డబుల్ యూనికార్న్‌గా ఎదిగారు. మస్క్ ఫైర్ చేసింది ఒక సీఈఓను కాదు, ఒక అపర కుబేరుడిని అని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది.
అసలు ఈ కంపెనీ ప్రత్యేకత ఏంటి?
మనం వాడే సాదాసీదా చాట్ బాట్లకు, పరాగ్ తయారు చేసిన AI ఏజెంట్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇవి కేవలం పాత డేటాతో పనిచేయవు. ఇంటర్నెట్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకుని పనులు పూర్తి చేస్తాయి. గంటల కొద్దీ మనుషులు చేసే పనిని చిటికెలో పూర్తి చేస్తాయి. ఇప్పటికే నోషన్, ఓపెన్ డోర్ వంటి కంపెనీలతో పాటు కొన్ని ఫోర్ట్యూన్ 100 బ్యాంకులు కూడా పరాగ్ టెక్నాలజీని వాడుతున్నాయి. ఈ కంపెనీలో ఉన్నది కేవలం 50 మంది ఉద్యోగులే. అంటే ఒక్కో ఉద్యోగి విలువ వందల కోట్లలో ఉందన్నమాట.
సెకోయా క్యాపిటల్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లు పరాగ్ ఐడియాను నమ్మి ఇప్పటివరకు మొత్తం 230 మిలియన్ డాలర్ల నిధులను కుమ్మరించారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ లోగోను పిట్ట నుంచి 'X'కి మార్చవచ్చు కానీ, టాలెంట్ ఉన్న మనిషి తలరాతను మార్చలేరని పరాగ్ నిరూపించాడు. అప్పట్లో మస్క్ చూపించిన ఎగ్జిట్ డోర్, పరాగ్ అగర్వాల్ పాలిట సక్సెస్ డోర్ అయ్యింది. మొత్తానికి తీసేసిన సీఈఓ కాస్తా ఇప్పుడు ఎవరూ అందుకోలేని టైకూన్ అయిపోయాడు. మస్క్ గారు.. వింటున్నారా? టాలెంట్‌ను తక్కువ అంచనా వేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.




