Realme 16T: విడుదలకు ముందే షాకిస్తోన్న రియల్‌మీ 16టీ.. ఎందుకో తెలుసా?
Realme 16T: రియల్‌మీ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 16టీని త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Realme 16T: విడుదలకు ముందే షాకిస్తోన్న రియల్‌మీ 16టీ.. ఎందుకో తెలుసా?
Realme 16T: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ నుంచి త్వరలో రాబోతున్న 'రియల్‌మీ 16టీ' మొబైల్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన గీక్‌బెంచ్ వివరాల ప్రకారం, ఈ కొత్త ఫోన్ పనితీరు దాని మునుపటి వెర్షన్ అయిన రియల్‌మీ 15టీ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు, సామర్థ్య వివరాలు ఓసారి చూద్దాం..!
గీక్‌బెంచ్ జాబితాలో రియల్‌మీ 16టీ వివరాలు..
రియల్‌మీ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 16టీని త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అధికారికంగా లాంచ్ కావడానికి ముందే, ఈ ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఆర్‌ఎమ్‌ఎక్స్ 5268 అనే మోడల్ నంబర్‌తో నమోదైన ఈ హ్యాండ్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని సమాచారం. ఇందులో 8జీబీ ర్యామ్ సామర్థ్యం ఉండవచ్చని ఈ జాబితా సూచిస్తోంది.
పనితీరులో తగ్గుదల?
గీక్‌బెంచ్ పరీక్షల్లో రియల్‌మీ 16టీ సింగిల్ కోర్ టెస్టింగ్‌లో 784 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టింగ్‌లో 2,007 పాయింట్లు సాధించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇది గతేడాది విడుదలైన రియల్‌మీ 15టీ కంటే తక్కువ స్థాయి పనితీరును కలిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రియల్‌మీ 15టీలో మెరుగైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. డైమెన్సిటీ 6400 మ్యాక్స్‌తో పోలిస్తే కొత్త చిప్‌సెట్ వేగం, సామర్థ్యం తక్కువగా ఉండటం వినియోగదారులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.
మెమరీ..
తాజా లీకుల ప్రకారం, రియల్‌మీ 16టీ మూడు వేర్వేరు మెమరీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అవి:
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్
8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్
అంతేకాకుండా, ఈ ఫోన్ ఆరోరా గ్రీన్, స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ రెడ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.
మునుపటి మోడల్ రియల్‌మీ 15టీతో పోలిక..
గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన రియల్‌మీ 15టీ ధర సుమారు రూ. 20,999 గా ఉంది. ఇందులో 6.57 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ముందు కెమెరాను అందించారు. ముఖ్యంగా ఇందులో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 60 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యం ఉంది. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ 66, 68, 69 రేటింగులను కూడా కలిగి ఉంది. ఇప్పుడు రాబోతున్న కొత్త ఫోన్ ఈ ప్రమాణాలను అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.




