Smartphone: భారత్‌లో భారీగా పెరిగిన రిఫర్బిష్డ్ ఫోన్ల డిమాండ్.. కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Smartphone: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్దీ కొత్త స్మార్ట్ఫోన్ల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
Refurbished Smartphones
Smartphone: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్దీ కొత్త స్మార్ట్ఫోన్ల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కెమెరా, ప్రాసెసర్ అలాగే చిప్సెట్ తయారీ ఖర్చులు అధికం కావడం వల్ల సామాన్య ప్రజలు సరికొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లను కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు పొందడం కోసం రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ నివేదికల ప్రకారం దేశంలో ఈ సెకండ్ హ్యాండ్ కండిషన్ ఫోన్ల డిమాండ్ ఏకంగా 13 శాతం వరకు పెరిగింది.
రూ.45 వేల బడ్జెట్లో ప్రీమియం మోడల్స్
కేవలం తక్కువ ధర గల ఫోన్లే కాకుండా.. రూ.20,000 నుంచి రూ.45,000 బడ్జెట్ మధ్య లభించే ప్రీమియం ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా కొత్త ఐఫోన్ లేదా శాంసంగ్ గెలాక్సీ ప్రీమియం ఫోన్ కొనాలంటే రూ.70,000 నుంచి రూ.లక్ష వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ రిఫర్బిష్డ్ మార్కెట్లో అవే ఖరీదైన ఫోన్లు సగం ధరకే అందుబాటులో ఉంటున్నాయి. కాలేజీ విద్యార్థులు, యువత అలాగే కంటెంట్ క్రియేటర్లు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తక్కువ ఖర్చుతో హై-ఎండ్ ఫీచర్లు అనుభవిస్తున్నారు.
సెకండ్ హ్యాండ్ ఫోన్లకు రిఫర్బిష్డ్ ఫోన్లకు తేడా
సాధారణంగా ఎవరి దగ్గరైనా వాడి పడేసిన ఫోన్లను నేరుగా కొనుగోలు చేయడానికి, కంపెనీలు లేదా సర్టిఫైడ్ ప్లాట్‌ఫారమ్‌లు తనిఖీ చేసి అమ్మే రిఫర్బిష్డ్ ఫోన్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రిఫర్బిష్డ్ ఫోన్లను విక్రయించే ముందు నిపుణులు వాటి డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, సాఫ్ట్వేర్ పర్ఫామెన్స్ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఏదైనా లోపం ఉంటే ఒరిజినల్ పార్ట్లతో రిపేర్ చేసి పర్ఫెక్ట్ కండిషన్లోకి తెస్తారు. దీనివల్ల కస్టమర్లకు నాణ్యమైన ఫోన్ తక్కువ ధరకే లభిస్తుంది.
కొనుగోలుదారులు పాటించాల్సిన జాగ్రత్తలు
మార్కెట్లో రిఫర్బిష్డ్ ఫోన్లను కొనేటప్పుడు తక్కువ ధర చూసి తొందరపడకుండా కొన్ని కీలక విషయాలు గమనించాలి. అమ్మకందారులు అందించే వారంటీ కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే ఫోన్ బ్యాటరీ హెల్త్, బాడీ స్క్రాచెస్, సాఫ్ట్వేర్ అప్డేట్లు రాబోయే కాలంలో వస్తాయా లేదా అని నిర్ధారించుకోవాలి. రిపేర్ పాలసీ, ఈఎంఐ సౌకర్యాలు అలాగే రీప్లేస్మెంట్ గ్యారెంటీ ఇచ్చే నమ్మకమైన ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్లను ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.




