Elon Musk: స్టార్‌లింక్‌కు స్వాగతం.. ఆ చట్టాలను పాటించాల్సిందే: ఎలాన్ మస్క్‌కు రిలయన్స్ కౌంటర్!
Elon Musk: ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభాన్ని కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీని ఉద్దేశిస్తూ కూడా మస్క్ వ్యాఖ్యలు చేశారు,
Elon Musk: స్టార్‌లింక్‌కు స్వాగతం.. ఆ చట్టాలను పాటించాల్సిందే: ఎలాన్ మస్క్‌కు రిలయన్స్ కౌంటర్!
Elon Musk: ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభాన్ని కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీని ఉద్దేశిస్తూ కూడా మస్క్ వ్యాఖ్యలు చేశారు
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి సంబంధించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. స్టార్‌లింక్ సహా అన్ని సంస్థల నుంచి పోటీని స్వాగతిస్తున్నామని, అయితే దేశంలో పనిచేసే ప్రతి సంస్థ భారత చట్టాలు, విధానాలను తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
స్టార్‌లింక్‌ను భారత్‌లో ప్రారంభించకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. “స్టార్‌లింక్ సహా శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో పోటీని మేం స్వాగతిస్తున్నాం. జియోతో సహా ప్రతి సంస్థ భారత ప్రజలకు సేవ చేయడంతోపాటు దేశ చట్టాలు, విధానాలను పాటించాలి” అని పేర్కొంది.
రిలయన్స్ తన ప్రకటనలో ఎలాన్ మస్క్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయితే, తమ సంస్థ, భారత మార్కెట్‌పై ఇటీవల వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందుంచాలని తెలిపింది. “రిలయన్స్, భారత మార్కెట్‌కు సంబంధించి ఇటీవల వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలను రికార్డులో ఉంచాలనుకుంటున్నాం” అని కంపెనీ పేర్కొంది.
అంతకుముందు ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభాన్ని కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీని ఉద్దేశిస్తూ కూడా మస్క్ వ్యాఖ్యలు చేశారు. “అంబానీయే భారతదేశానికి అసలు బాస్?” అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. “భారత్‌కు స్వాగతం ఎలాన్. ఇంకో వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాత వేచి చూడండి” అని పేర్కొన్నారు.
జియోకు కూడా అనుమతుల కోసం ఎదురుచూపులు..
తమ జియో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రణాళికకు కూడా అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని రిలయన్స్ స్పష్టం చేసింది. స్టార్‌లింక్‌కు వర్తించే విధానమే తమకూ వర్తించిందని తెలిపింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పెట్టుబడులు, ఆవిష్కరణలను దేశీయమైనా, అంతర్జాతీయమైనా తాము స్వాగతిస్తున్నామని పేర్కొంది.
అయితే, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ప్రతి సంస్థ దేశ చట్టాలు, నియంత్రణ వ్యవస్థకు లోబడి పనిచేయాల్సిందేనని రిలయన్స్ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం కూడా దేశీయ, విదేశీ సంస్థలన్నింటికీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరిస్తోందని తెలిపింది.
ఇదిలా ఉంటే, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ కూడా ఇటీవల ఎలాన్ మస్క్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన, మస్క్, స్టార్‌లింక్ కంటే చాలా ముందుగానే తాను శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. “నేను ఆయన కంటే క్యూలో చాలా ముందున్నాను. ఐదేళ్ల క్రితమే దరఖాస్తు చేశాను” అని మిట్టల్ పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్.. యూటెల్సాట్ వన్‌వెబ్ ప్రాజెక్ట్‌కు మద్దతుదారుగా ఉంది.
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ అనుమతుల ప్రక్రియ దేశీయ సంస్థలకు అనుకూలంగా ఉందన్న ఎలాన్ మస్క్ ఆరోపణలను భారత కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ గతంలో తిరస్కరించింది. స్టార్‌లింక్, యూటెల్సాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ దాదాపు ఒకే దశలో ఉన్నాయని తెలిపింది. వాణిజ్య సేవలు ప్రారంభించడానికి ముందు మూడు సంస్థలు భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నాయని పేర్కొంది.
ఇటీవల జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2026లో స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ కూడా భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. అనుమతి లభించిన వెంటనే కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. గత ఐదేళ్లుగా భారత నియంత్రణ సంస్థలతో స్టార్‌లింక్ సన్నిహితంగా పనిచేస్తోందని, భారత్‌లో కార్యకలాపాలకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు.
మరోవైపు, జియో సుమారు 1,600 ఎల్ఈఓ ఉపగ్రహాలతో పాటు 23 గ్రౌండ్ స్టేషన్లతో శాటిలైట్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తక్కువ జనాభా ఉన్న మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు స్టార్‌లింక్ వంటి శాటిలైట్ నెట్వర్క్ సేవలు ఉపయోగపడతాయి. ఇవి లో ఎర్త్ ఆర్బిట్‌లోని ఉపగ్రహాలపై ఆధారపడి పనిచేస్తాయి. ఇందుకోసం సాధారణ మొబైల్ టవర్లు అవసరం ఉండదు.




