Samsung Galaxy F70 5G: శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Samsung Galaxy F70 5G: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తూ రూ.20 వేల బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఆప్షన్ వచ్చింది.

Venkat
Published on: 19 Oct 2026 7:53 PM IST
Samsung Galaxy F70 5G
X

Samsung Galaxy F70 5G: శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Samsung Galaxy F70 5G: దక్షిణ కొరియాకు చెందిన టెక్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో Galaxy F70 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ నుంచి మిడ్‌రేంజ్ విభాగంలోకి వచ్చే ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మీ మొదటి ఎంపిక శాంసంగ్ అయితే, బడ్జెట్ సుమారు రూ.20 వేల వరకు ఉంటే ఈ కొత్త ఫోన్‌ను పరిశీలించవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 5G భారతదేశంలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.19,999గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్‌తో దీని ఎఫెక్టివ్ ధర రూ.17,999 వరకు తగ్గే అవకాశం ఉంది.

ఫోన్‌లో 50MP కెమెరా, సూపర్ ఆల్ మోండ్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ను కూడా అందించారు. కెమెరాలో OIS (Optical Image Stabilization) సపోర్ట్ ఉంది. ఈ ఫీచర్లు ఈ ధర విభాగంలో ఉపయోగపడేవిగా ఉన్నాయి. అయితే Galaxy F70 5G ఈ ధరలో ఇతర స్మార్ట్‌ఫోన్లకు ఎంతవరకు పోటీ ఇస్తుందో చూడాలి.

Samsung Galaxy F70 5G రెండు వేరియంట్లలో వచ్చింది.

- 4GB RAM + 128GB Storage: రూ.19,999

- 6GB RAM + 128GB Storage: రూ.22,999

లాంచ్ ఆఫర్ కింద అర్హత ఉన్న బ్యాంక్ కార్డుతో డిస్కౌంట్ పొందితే ఫోన్ ప్రారంభ ఎఫెక్టివ్ ధర రూ.17,999కి చేరొచ్చు. అయితే ఈ ధర ఆఫర్ నిబంధనలను పూర్తి చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. అర్హత ఉన్న బ్యాంక్ కార్డు లేకపోతే ఫోన్ ధర మారవచ్చు.

ఫోన్ తొలి సేల్ అక్టోబర్ 20 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ Vivid Violet, Bold Black అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఫోన్‌లో ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయి?

శాంసంగ్ గెలాక్సీ F70 5G మందం సుమారు 7.5 మిల్లీమీటర్లు, బరువు దాదాపు 192 గ్రాములు. పెద్ద స్క్రీన్ ఉన్నప్పటికీ ఫోన్ చాలా మందంగా ఉండదు.

ఇందులో IP54 రేటింగ్ కూడా ఉంది. ఇది దుమ్ము, నీటి చినుకులు పడితే కొంత రక్షణ అందిస్తుంది. అయితే ఫోన్‌ను నీటిలో ముంచడం సురక్షితం అని భావించకూడదు.

50MP కెమెరాలో OIS.. ఫోటోలు, వీడియోలకు ఉపయోగం..

శాంసంగ్ గెలాక్సీ F70 5Gలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి OIS సపోర్ట్ అందించారు. ఫోన్ లేదా కెమెరా లెన్స్ కొద్దిగా కదిలినప్పుడు దాన్ని స్థిరీకరించడంలో OIS సహాయపడుతుంది. దీంతో చేతులు స్వల్పంగా కదిలినప్పుడు ఫోటోలు బ్లర్ అయ్యే అవకాశం తగ్గొచ్చు.

తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లో ఫోటోలు తీసేటప్పుడు కూడా OIS ఉపయోగపడవచ్చు.

వెనుకవైపు 50MP ప్రధాన కెమెరాతో పాటు 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ కెమెరాతో పెద్ద ప్రదేశాలు లేదా ఎక్కువ మంది వ్యక్తులను ఒకే ఫ్రేమ్‌లో బంధించవచ్చు. మాక్రో కెమెరా దగ్గరగా ఉన్న చిన్న వస్తువుల ఫోటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఇచ్చారు.

పెద్ద AMOLED స్క్రీన్, 5000mAh బ్యాటరీ

ఫోన్‌లో 6.7 అంగుళాల Full HD+ Super AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది.

సాధారణ 60Hz డిస్‌ప్లేతో పోలిస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌లో స్క్రోలింగ్, కొన్ని యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపించవచ్చు. AMOLED స్క్రీన్‌లో డీప్ బ్లాక్ కలర్స్, మెరుగైన కాంట్రాస్ట్ కనిపిస్తాయి. దీంతో వీడియోలు చూసే సమయంలో మంచి విజువల్ అనుభవం లభించవచ్చు.

గెలాక్సీ F70 5Gలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. సాధారణ రోజువారీ వినియోగానికి ఈ బ్యాటరీ సామర్థ్యం సరిపోవచ్చు. అయితే బ్యాటరీ ఎంతసేపు పనిచేస్తుందనేది స్క్రీన్ బ్రైట్‌నెస్, నెట్‌వర్క్, గేమింగ్, యాప్ వినియోగం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్‌లో ఏం లభిస్తుంది?

శాంసంగ్ గెలాక్సీ F70 5Gలో కంపెనీ సొంత Exynos 1330 ప్రాసెసర్ను ఉపయోగించింది. ఇది 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. రోజువారీ పనులు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, సాధారణ గేమింగ్ కోసం దీనిని రూపొందించారు.

ఫోన్ 4GB లేదా 6GB RAMతో 128GB స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తుంది. అవసరమైతే మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే శాంసంగ్ నాలుగు తరాల వరకు Android OS అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఎక్కువ కాలం ఫోన్ ఉపయోగించాలనుకునే వారికి ఇది ముఖ్యమైన అంశం. రెగ్యులర్ అప్‌డేట్ల ద్వారా కొత్త ఫీచర్లు, భద్రతా మెరుగుదలలు లభించవచ్చు.

ఫోన్‌లో సర్కిల్ సెర్చ్, గూగుల్ జెమినీ, శాంసంగ్ వాలెట్, క్విక్ షేర్, శాంసంగ్ నాక్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

సర్కిల్ సెర్చ్ సాయంతో స్క్రీన్‌పై కనిపిస్తున్న ఏదైనా వస్తువును సర్కిల్ చేసి దాని గురించి సెర్చ్ చేయవచ్చు. శాంసంగ్ నాక్స్ ఫీచర్లు ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేందుకు ఉపయోగపడతాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.