Samsung Galaxy M47 5G : లాంచ్‌ అయిన వారానికే షాక్.. ఏకంగా 8 వేలు పెరిగిన శామ్‌సంగ్ ఫోన్ ధర.!

Samsung Galaxy M47 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ధరలు తగ్గడం లేదా ఏవైనా పండగ ఆఫర్లలో డిస్కౌంట్లు రావడం మనం సాధారణంగా..

G Krishna
Published on: 13 July 2026 5:36 PM IST
Samsung Galaxy M47 5G
X

Samsung Galaxy M47 5G

Samsung Galaxy M47 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ధరలు తగ్గడం లేదా ఏవైనా పండగ ఆఫర్లలో డిస్కౌంట్లు రావడం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ మాత్రం కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజులకే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'Galaxy M47 5G' ధరలను విపరీతంగా పెంచేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అమ్మకాలు మొదలైన కేవలం ఒక్క వారంలోనే ఈ భారీ ధరల పెంపు నిర్ణయం తీసుకోవడం మొబైల్ మార్కెట్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా మార్కెట్లో నెలలు గడిచిన పాత మోడళ్ల ధరలు పెరగడం చూస్తుంటాం కానీ, లేటెస్ట్‌గా లాంచ్ అయిన ఫోన్‌పై ఇంత తక్కువ టైమ్‌లోనే వేలల్లో రేట్లు పెంచడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు

అమెజాన్ వెబ్‌సైట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ M47 5G కి సంబంధించిన అన్ని మోడల్స్ ధరలు ఇప్పుడు భారీగా అప్‌డేట్ అయ్యాయి. ప్రారంభంలో రూ.25,999 కి లభించిన 6GB రామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర ఇప్పుడు ఏకంగా రూ.7,000 పెరిగి రూ.32,999 కి చేరింది. అలాగే రూ.28,999 ధర ఉన్న 8GB రామ్ + 128GB మోడల్ పై శామ్‌సంగ్ రూ. 8,000 పెంచడంతో ఇప్పుడు దాని ధర రూ.36,999 గా మారింది. ఇక అన్నింటికంటే టాప్ వేరియంట్ అయిన 8GB రామ్ + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర కూడా రూ.33,999 నుండి ఏకంగా రూ.8,000 అదనంగా పెరిగి రూ.41,999 కి చేరుకుంది. ఈ ఫోన్‌ను శామ్‌సంగ్ కంపెనీ జూన్ 29న భారత మార్కెట్లో విడుదల చేయగా, జూలై 4 నుండి అమెజాన్ ద్వారా బ్లేజ్ బ్లూ, రోగ్ రెడ్ కలర్లలో దీని విక్రయాలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా వారం తిరిగేసరికి కొనుగోలుదారులపై ఈ రకమైన ఆర్థిక భారం పడటం గమనార్హం.

వారం రోజులకే పెంచడానికి అసలు కారణం ఏంటి?

ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తయారీ భాగాల కొరత, గ్లోబల్ మార్కెట్లో మెమరీ కాస్ట్ పెరగడం వల్ల నథింగ్, రియల్‌మీ, షావోమి వంటి పలు బ్రాండ్లు కూడా తమ ఫోన్ల ధరలను క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. అయితే శామ్‌సంగ్ మాత్రం ఫోన్ సేల్స్ మొదలైన వారం రోజులకే రేట్లు పెంచేయడం వెనుక బలమైన వ్యూహం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మెమరీ ధరలు ఇప్పటికే పెరిగిన తర్వాతే శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది కాబట్టి కంపెనీకి తయారీ ఖర్చుపై ముందే పూర్తి అవగాహన ఉంది. ఈ విషయాన్ని బట్టి చూస్తే, ప్రారంభంలో ప్రకటించిన తక్కువ ధర కేవలం 'ఇంట్రడక్టరీ ఆఫర్' మాత్రమేనని స్పష్టమవుతోంది. కస్టమర్లను బేస్ ప్రైస్‌తో ఆకర్షించి, ఆ తర్వాత మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరను అసలు రేటుకు పెంచేలా శామ్‌సంగ్ ప్లాన్ చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కొత్తగా మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకునే శామ్‌సంగ్ లవర్స్‌కు మాత్రం ఇది గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story