శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ లీక్.. రాయల్ బ్లూ రంగులో అదిరిపోయే లుక్..!

Samsung W27 foldable: శాంసంగ్ త్వరలో చైనా మార్కెట్‌లో ప్రత్యేకంగా విడుదల చేయనున్న డబ్ల్యూ27 ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అక్టోబర్ 29న జరిగే కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Venkat
Published on: 24 Oct 2026 7:59 AM IST
Samsung W27 foldable
X

శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ లీక్.. రాయల్ బ్లూ రంగులో అదిరిపోయే లుక్..!

Samsung W27 foldable: శాంసంగ్ డబ్ల్యూ27 ఫోల్డబుల్ ఫోన్‌ తాజాగా ఆన్‌లైన్‌లో కనిపించింది. టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ఎక్స్‌లో ఈ ఫోటోను పంచుకుంది. లీకైన ఫోటోను బట్టి చూస్తే ఈ చైనా ప్రత్యేక మోడల్‌కు ప్రత్యేకమైన కలర్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగం రాయల్ బ్లూ రంగులో కనిపిస్తోంది. వెనుక కెమెరా మాడ్యూల్‌కు బంగారు రంగును ఉపయోగించినట్లు తెలుస్తోంది. కెమెరా భాగం కింద మరో ప్రత్యేక సింబల్ కూడా కనిపిస్తోంది. దీనికీ గోల్డ్ ఫినిష్ ఇచ్చినట్లు లీకైన చిత్రం సూచిస్తోంది.

ప్రీమియం డిజైన్‌తో ఫోల్డబుల్..

శాంసంగ్ డబ్ల్యూ27లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా తరహాలో ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్ ఉండే అవకాశం ఉంది. అయితే మిడిల్ ఫ్రేమ్‌కు గోల్డ్ రంగు ఇవ్వడం వల్ల ఫోన్‌కు మరింత విలాసవంతమైన రూపం వచ్చినట్లు లీకైన ఫోటో చూపిస్తోంది. కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్ బటన్లు ఉండే అవకాశం ఉంది.

శాంసంగ్ డబ్ల్యూ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లు సాధారణ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ కంటే ఎక్కువ ప్రీమియం నిర్మాణానికి పేరుగాంచాయి. టెక్నాలజీ విషయంలో మాత్రం రెండు సిరీస్‌ల మధ్య పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నివేదిక పేర్కొంది.

అక్టోబర్ 29న విడుదలకు అవకాశం..

శాంసంగ్ అక్టోబర్ 29న ‘హార్ట్ ఆఫ్ ది వరల్డ్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇటీవల నివేదికలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో డబ్ల్యూ27ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ప్రచార పోస్టర్‌లో మరో ఎరుపు రంగు వేరియంట్‌కు సంబంధించిన సూచన కూడా కనిపించినట్లు సమాచారం.

చైనాలో ఈ ఫోన్ నవంబర్ 5న విక్రయానికి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీని ధర గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

స్పెసిఫికేషన్లపై అంచనాలు..

డబ్ల్యూ27లో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉందని సమాచారం. గరిష్ఠంగా 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వేరియంట్ రావచ్చని తెలుస్తోంది. వెనుక మూడు కెమెరాలతో పాటు కవర్ స్క్రీన్, ప్రధాన ఫోల్డబుల్ స్క్రీన్ కోసం 10 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండవచ్చని నివేదిక పేర్కొంది.

అయితే ఇవన్నీ ప్రస్తుతం లీకులు, నివేదికల ఆధారంగా ఉన్న వివరాలే. శాంసంగ్ అధికారికంగా ఫోన్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్లను ధృవీకరించలేదు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.