Sarvam AI : భారత్‌కు మరో AI యూనికాన్.. 'సర్వం' సెన్సేషన్.!
Sarvam AI : భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి సరికొత్త జవసత్వాలు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ 'సర్వం' (Sarvam) తాజాగా 234 మిలియన్..
sarvam-ai
Sarvam AI : భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి సరికొత్త జవసత్వాలు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ 'సర్వం' (Sarvam) తాజాగా 234 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,950 కోట్లు) నిధుల సమీకరణను పూర్తి చేసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ 1.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.12,500 కోట్లు) చేరి, భారతదేశపు సరికొత్త 'ఏఐ యూనికాన్' (AI Unicorn) గా అవతరించింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా దేశీయంగా ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలకు ఈ పరిణామం పెద్ద ఊరటనిస్తోంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం 'హెచ్‌సీఎల్‌టెక్' (HCLTech) వ్యూహాత్మక పెట్టుబడిదారుగా ఈ నిధుల సమీకరణలో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుండగా.. బెసమర్ వెంచర్ పార్ట్నర్స్, కోస్లా వెంచర్స్, పీక్ XV పార్ట్నర్స్ వంటి పాత పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ నిధులను త్వరలోనే 300 మిలియన్ డాలర్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది.
సొంతంగా ఏఐ ఎకోసిస్టమ్ నిర్మాణం
చాలా కంపెనీలు కేవలం ఏఐ అప్లికేషన్లపై మాత్రమే దృష్టి పెడుతుంటే, 'సర్వం' మాత్రం ఏఐ మోడల్స్ అభివృద్ధి, కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌తో కూడిన పూర్తి ఏఐ ఎకోసిస్టమ్‌ను భారత్‌లోనే సొంతంగా తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే హెచ్‌సీఎల్‌టెక్‌తో కుదిరిన భాగస్వామ్యం ద్వారా పెద్ద పెద్ద వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలకు తమ ఏఐ సేవలను వేగంగా అందించడానికి సర్వం ప్రణాళికలు రచిస్తోంది. గత రెండేళ్లలో ఈ స్టార్టప్ 30-బిలియన్ , 105-బిలియన్ పారామీటర్లతో కూడిన రెండు ఓపెన్-సౌర్స్ ఏఐ మోడళ్లను విజయవంతంగా లాంచ్ చేసింది.
రికార్డు స్థాయిలో ఏఐ టూల్స్ వినియోగం
సర్వం అందిస్తున్న ఏఐ ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ప్రతిరోజూ 20 లక్షలకు పైగా సంభాషణలు (Interactions) సాగుతుండగా, రోజూ 1 కోటి కంటే ఎక్కువ ఏపీఐ (API) రిక్వెస్ట్‌లను ప్రాసెస్ చేస్తోంది. అంతేకాకుండా, నెలకు దాదాపు 5 లక్షల గంటలకు పైగా ఆడియోను టెక్స్ట్‌గా మారుస్తూ (Transcribe) రికార్డు సృష్టిస్తోంది.
కోట్లాది మందికి చేరువగా ఏఐ సేవలు
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ప్రభుత్వ రంగాలలో సర్వం ఏఐ సాంకేతికత ఇప్పటికే విస్తృతంగా ఉపయోగపడుతోంది. ప్రభుత్వ కార్యక్రమం కింద దాదాపు 1.7 కోట్ల మంది రైతుల నుంచి సమాచారాన్ని సేకరించడానికి సర్వం బహుభాషా (Multilingual) వాయిస్ ఏజెంట్లను ఉపయోగించారు. దేశవ్యాప్త ఇన్సూరెన్స్ క్యాంపెయిన్ ద్వారా ఏకంగా 4.5 కోట్ల మంది పాలసీదారులకు ఈ సాంకేతికత సేవలను అందించింది. ఒక ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ తన 3.5 లక్షల మందికి పైగా ఉన్న సేల్స్ నెట్‌వర్క్ కోసం సర్వం ఏఐ టెక్నాలజీని వాడుతోంది.
ధరలు 67 శాతం తగ్గింపు.. 22 భారతీయ భాషలకు సపోర్ట్
డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసే తమ 'సర్వం విజన్' (Sarvam Vision) ప్లాట్‌ఫారమ్ ధరలను కంపెనీ ఏకంగా 67 శాతం తగ్గించింది. డెవలపర్లు, సంస్థల నుంచి వస్తున్న భారీ స్పందన వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా పేజీలను డిజిటలైజ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగం గుర్తించిన మొత్తం 22 అధికారిక భాషలను ఈ ప్లాట్‌ఫారమ్ సపోర్ట్ చేయడం విశేషం. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు భారీ మొత్తంలో ఉన్న తమ పత్రాలను ఎంతో సులువుగా ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాయి.




