SIM Binding Rules: వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్
SIM Binding Rules: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లైన వాట్సాప్, టెలిగ్రామ్ వాడే కోట్లాది మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ముఖ్యమైన మార్పును పరిచయం చేయనుంది.
SIM Binding Rules: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లైన వాట్సాప్, టెలిగ్రామ్ వాడే కోట్లాది మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక ముఖ్యమైన మార్పును పరిచయం చేయనుంది. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో టెలికాం శాఖ సిమ్ బైండింగ్ నిబంధనను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు ఏ మొబైల్ నంబర్‌తో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశారో, సరిగ్గా అదే నంబర్‌కు సంబంధించిన యాక్టివ్ సిమ్ కార్డ్ కచ్చితంగా ఆ ఫోన్‌లో ఉండాలి. 2027 జనవరి 1 నాటికి ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సిమ్ బైండింగ్ అంటే ఏమిటి?
సాధారణంగా చాలామంది ఒకసారి ఓటీపీ ద్వారా అకౌంట్ వెరిఫై చేసుకున్న తర్వాత ఫోన్లో నుంచి సిమ్ కార్డ్ తీసేసి కేవలం వైఫై సాయంతో యాప్‌లను వాడుతుంటారు. కానీ సిమ్ బైండింగ్ రూల్ అమల్లోకి వస్తే ఈ పద్ధతికి పూర్తిగా స్వస్తి పలకాల్సి ఉంటుంది. ఏ నంబర్‌తో రిజిస్టర్ అయ్యారో ఆ సిమ్ మొబైల్‌లో యాక్టివ్‌గా ఉంటేనే యాప్ పనిచేస్తుంది. సైబర్ కేటుగాళ్లు విదేశీ లేదా నకిలీ నంబర్లతో అకౌంట్లు సృష్టించి, ఆ తర్వాత సిమ్ తీసేసి అమాయకులను డిజిటల్ అరెస్ట్ పేరుతో, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు చాలా వెలుగు చూశాయి. ఇలాంటి ఫేక్ అకౌంట్లను పూర్తిగా కట్టడి చేయడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం.
వాట్సాప్ వెబ్ అలాగే డెస్క్‌టాప్ వెర్షన్‌లపై ప్రభావం
ఈ సరికొత్త నిబంధనల ప్రభావం కేవలం స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కాకుండా వాట్సాప్ వెబ్ అలాగే కంప్యూటర్లలో వాడే డెస్క్‌టాప్ వెర్షన్‌లపై కూడా తీవ్రంగా పడనుంది. టెలికాం శాఖ ప్రాథమిక మార్గదర్శకాల ప్రకారం వెబ్ సెషన్‌లను ఎక్కువ గంటలు కంటిన్యూగా రన్ చేయడానికి వీలుండదు. భద్రతా కారణాలరీత్యా నిర్ణీత సమయం తర్వాత మళ్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రీ-లింక్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతరుల అకౌంట్లను అనధికారికంగా సుదీర్ఘకాలం పాటు కంప్యూటర్లలో వాడుకోవడం కుదరదు.
రెండు సిమ్‌లు వాడే యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఉండి, మీరు వేరే నంబర్‌తో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఉపయోగిస్తుంటే కొన్ని విషయాలు గమనించాలి. రిజిస్టర్ చేసిన నంబర్ సిమ్ కార్డ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఫోన్‌లోనే ఉండేలా చూసుకోవాలి. సిమ్ మార్చేటప్పుడు లేదా కొత్త హ్యాండ్‌సెట్‌కు మళ్లీ లాగిన్ అయ్యేటప్పుడు యాప్ వెరిఫికేషన్ ప్రక్రియ మళ్లీ అడగవచ్చు. ఒకవేళ వినియోగదారుడు విదేశీ పర్యటనలో రోమింగ్‌లో ఉంటే ఎలాంటి అంతరాయం ఉండదు, సిమ్ మాత్రం ఫోన్‌లో ఉండాలి. ఈ నూతన విధానం ద్వారా ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.




