Smart Watch: స్మార్ట్‌వాచ్ వెనుక గ్రీన్ లైట్ ఎందుకు వెలుగుతుంది? దాని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే
Smart Watch: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడే ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇప్పుడు స్మార్ట్‌వాచ్ కనిపిస్తోంది.
Smart Watch
Smart Watch: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడే ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇప్పుడు స్మార్ట్‌వాచ్ కనిపిస్తోంది. అయితే ఈ వాచ్‌లు ధరించినప్పుడు వాటి వెనుక భాగంలో ఒక చిన్న గ్రీన్ లైట్ తరచుగా వెలుగుతూ ఉంటుంది. అది కేవలం అందం కోసం ఇచ్చే డిజైన్ అనుకుంటే పొరబడినట్టే. దాని వెనుక అద్భుతమైన టెక్నాలజీ దాగి ఉంది. స్మార్ట్‌వాచ్ వెనుక భాగంలో కనిపించే ఈ చిన్న గ్రీన్ LED లైట్ ఒక కీలకమైన హెల్త్ ఫీచర్‌లో భాగమై ఉంటుంది. ఇది ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌గా పనిచేస్తుంది. మనం వాచ్ ధరించినప్పుడు ఈ సెన్సార్ చర్మంపై ఆకుపచ్చని కాంతిని ప్రసరింపజేస్తుంది. ఆ కాంతి చర్మం లోపలికి ఎంత దూరం వెళ్తుంది, వెనక్కి ఎంత తిరిగి వస్తుంది అనే అంశాన్ని సెన్సార్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది. దీనిని పీపీజీ (Photoplethysmography) టెక్నాలజీ అంటారు.
రక్తప్రవాహంతో గుండె కొట్టుకునే వేగం గుర్తింపు
మానవుని గుండె కొట్టుకున్న ప్రతిసారీ ధమనులలో రక్త ప్రవాహం మారుతూ ఉంటుంది. గుండె స్పందించినప్పుడు రక్తం వేగంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో చర్మం ద్వారా గ్రహించబడే లేదా పరావర్తనం చెందే కాంతి పరిమాణంలో కూడా మార్పులు వస్తాయి. స్మార్ట్‌వాచ్‌లోని సెన్సార్ ఈ చిన్నపాటి మార్పులను క్షణాల వ్యవధిలో పసిగట్టి, మన గుండె కొట్టుకునే వేగాన్ని చాలా కచ్చితంగా అంచనా వేస్తుంది.
ఎప్పుడూ ఒకేలా ఎందుకు వెలగదు?
ఈ గ్రీన్ లైట్ ఎల్లప్పుడూ ఒకే విధంగా వెలగదు. కొన్నిసార్లు నిరంతరం వెలుగుతూ ఉంటే, మరికొన్నిసార్లు కాసేపు ఆగి బ్లింక్ అవుతుంది. మనం నిశ్చలంగా ఉన్నప్పుడు లేదా సాధారణంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాచ్ తక్కువగా సెన్సార్‌ను వాడుతుంది. అదే వాకింగ్, రన్నింగ్ లేదా వర్కవుట్ చేసే సమయంలో హార్ట్ రేట్‌లో వేగంగా మార్పులు జరుగుతాయి. అటువంటి సమయాల్లో గుండె వేగాన్ని కచ్చితంగా పట్టుకోవడానికి సెన్సార్ మరింత చురుగ్గా పనిచేస్తుంది.
చర్మంపై ఎలాంటి ప్రభావం ఉండదా?
ఈ గ్రీన్ లైట్ వల్ల చర్మానికి ఎలాంటి హాని కలుగుతుందనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. సాధారణ వాడకంలో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో చాలా తక్కువ పవర్ ఉన్న LED బల్బులను మాత్రమే ఉపయోగిస్తారు. అయితే వాచ్‌ను నిరంతరం బిగుతుగా ధరించడం వల్ల చెమట పట్టి చర్మంపై చిన్నపాటి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమయానికి వాచ్‌ను తీసి చేతికి కాస్త విశ్రాంతిని ఇవ్వడం మంచిది.




