అప్పు చేసి స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు.. ప్రతీ 100 లోన్ అప్లికేషన్లలో 74 ఫోన్ల కోసమే!
Smartphone Loans: స్మార్ట్ఫోన్లు నిత్యావసరంగా మారడంతో కొత్త ఫోన్ కొనుగోలుకు లోన్లు, ఈఎంఐలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
అప్పు చేసి స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు.. ప్రతీ 100 లోన్ అప్లికేషన్లలో 74 ఫోన్ల కోసమే!
Smartphone Loans: స్మార్ట్ఫోన్లు నిత్యావసరంగా మారడంతో కొత్త ఫోన్ కొనుగోలుకు లోన్లు, ఈఎంఐలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీపావళి 2026 గణాంకాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ధోరణి పెరుగుతోంది.
ప్రతి 100 లోన్ దరఖాస్తుల్లో 74 ఫోన్ల కోసమే
లెండింగ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ లెంట్రా (Lentra) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దీపావళి 2026 సమయంలో కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల కోసం వచ్చిన ప్రతి 100 దరఖాస్తుల్లో 74 మొబైల్ ఫోన్ల కొనుగోలుకు సంబంధించినవే. అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఇతర గృహోపకరణాలతో పోలిస్తే స్మార్ట్ఫోన్ల కోసం రుణాలు తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ దీపావళి సమయంలో కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ దరఖాస్తులు 22 శాతం పెరిగాయి. కొత్త ఫోన్ల కొనుగోలుపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుండటంతో పాటు, ఈఎంఐ సదుపాయాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. ఈ రుణాల సగటు మొత్తం సుమారు రూ.28,000గా ఉంది. అంటే మధ్యస్థాయి స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు కూడా ప్రజలు రుణాలను ఆశ్రయిస్తున్నారు.
లోన్లు తీసుకోవడంలో యువతే ముందంజ
వయసుల వారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 62 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. ముఖ్యంగా 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిలో 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు మొబైల్ ఫోన్ల కొనుగోలుకు రుణాలు తీసుకునే వారిలో ముందున్నారు.
చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో చేరుతున్న యువతకు స్మార్ట్‌ఫోన్ అవసరం ఎక్కువగా ఉంటోంది. ఆన్లైన్ క్లాసులు, ఆఫీస్ పనులు, డిజిటల్ చెల్లింపులు, సోషల్ మీడియా వంటి అవసరాల కోసం మెరుగైన ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఒకేసారి రూ.20 వేల నుంచి రూ.30 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం అందరికీ సాధ్యం కావడం లేదు. దీంతో నెలవారీ వాయిదాల పద్ధతిలో ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధోరణి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతున్న ఈఎంఐ కొనుగోళ్లు
గతంలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను రుణాలపై కొనుగోలు చేసే ధోరణి ప్రధానంగా నగరాల్లోనే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ విధానం వేగంగా విస్తరిస్తోంది. లెంట్రా గణాంకాల ప్రకారం.. 2026 నవంబర్ 1 నుంచి 9వ తేదీ మధ్య వచ్చిన కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ దరఖాస్తుల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 58 శాతంగా ఉంది.
పట్టణ ప్రాంతాల నుంచి 42 శాతం దరఖాస్తులు వచ్చాయి. అంటే నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
గ్రామాల్లోనూ డిజిటల్ సేవల వినియోగం పెరగడం, స్మార్ట్ఫోన్ల అవసరం ఎక్కువ కావడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. మొబైల్ ఫోన్లతో పాటు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలను కూడా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఏ రాష్ట్రంలో ఏ వస్తువుకు ఎక్కువ డిమాండ్?
రాష్ట్రాల వారీగా చూస్తే మొబైల్ ఫోన్ల కొనుగోలుకు రుణాలు తీసుకోవడంలో గుజరాత్, రాజస్థాన్ ముందున్నాయి. గుజరాత్లో వచ్చిన మొత్తం కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ దరఖాస్తుల్లో 86 శాతం మొబైల్ ఫోన్ల కోసమే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఈ వాటా 82 శాతంగా నమోదైంది.
దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రం ఎల్ఈడీ టీవీల కొనుగోలుకు రుణాలు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో మొత్తం రుణ దరఖాస్తుల్లో 13.6 శాతం ఎల్ఈడీ టీవీల కోసం వచ్చాయి. తమిళనాడులో ఈ వాటా 12.4 శాతంగా ఉంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఫ్రిజ్‌ల కొనుగోలుకు 6.8 శాతం దరఖాస్తులు రాగా, కర్ణాటకలో 6.6 శాతం నమోదయ్యాయి. ఉత్తర భారత రాష్ట్రాల్లో వాషింగ్ మెషీన్ల కొనుగోలుకు ఫైనాన్స్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పంజాబ్‌లో మొత్తం దరఖాస్తుల్లో 15 శాతం వాషింగ్ మెషీన్ల కోసం వచ్చాయి. హర్యానాలో 8.3 శాతం, ఢిల్లీలో 6 శాతం దరఖాస్తులు నమోదయ్యాయి.
ఈ గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు ఈఎంఐ విధానం ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా రుణాల ద్వారా తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈఎంఐ సదుపాయం ఉందని అవసరానికి మించి అప్పులు చేయకుండా, నెలవారీ ఆదాయం, ఖర్చులను బట్టి కొనుగోళ్లు చేయడం మంచిది.




