Smart Watch: స్మార్ట్‌వాచ్‌తో అనారోగ్య సమస్యలు వస్తాయా.? శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Smart Watch: ఇటీవల కాలంలో స్మార్ట్‌వాచ్‌లు చాలా మంది జీవితంలో భాగమయ్యాయి.
Smart Watch: స్మార్ట్‌వాచ్‌తో అనారోగ్య సమస్యలు వస్తాయా.? శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Smart Watch: ఇటీవల కాలంలో స్మార్ట్‌వాచ్‌లు చాలా మంది జీవితంలో భాగమయ్యాయి. గుండె స్పందన, అడుగుల సంఖ్య, నిద్ర నాణ్యత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి వంటి ఆరోగ్య వివరాలను తెలుసుకోవడానికి చాలా మంది రోజంతా, కొందరు రాత్రిపూట కూడా స్మార్ట్‌వాచ్‌ను చేతికి ధరించి ఉంటున్నారు. అయితే, స్మార్ట్‌వాచ్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారంకూడా సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తోంది.
స్మార్ట్‌వాచ్ నుంచి ఎలాంటి రేడియేషన్ వస్తుంది?
స్మార్ట్‌వాచ్‌లు బ్లూటూత్, వై-ఫై లేదా కొన్ని మోడళ్లలో సెల్యులర్ (సిమ్) కనెక్షన్ ద్వారా ఫోన్ లేదా ఇంటర్నెట్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. ఈ కనెక్షన్ల కోసం అవి తక్కువ శక్తి గల రేడియో ఫ్రీక్వెన్సీ (Radio Frequency - RF) తరంగాలను విడుదల చేస్తాయి. దీనిని నాన్-అయోనైజింగ్ రేడియేషన్ అంటారు. ఇది ఎక్స్‌రేలు లేదా గామా కిరణాల వంటి అయోనైజింగ్ రేడియేషన్ కంటే పూర్తిగా భిన్నం. నాన్-అయోనైజింగ్ రేడియేషన్‌లో శరీర కణాలను నేరుగా దెబ్బతీసేంత శక్తి ఉండదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లూటూత్ ద్వారా పనిచేసే స్మార్ట్‌వాచ్‌లు చాలా తక్కువ శక్తితోనే సిగ్నల్స్ పంపిస్తాయి.
స్మార్ట్‌వాచ్ వల్ల క్యాన్సర్ వస్తుందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఇప్పటివరకు స్మార్ట్‌వాచ్ నుంచి వచ్చే తక్కువ శక్తి గల రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు క్యాన్సర్‌కు కారణమని నిరూపించే ఆధారాలు లేవు. కణాలు, జంతువులు, మనుషులపై నిర్వహించిన అనేక అధ్యయనాల్లో కూడా ఈ రేడియేషన్‌ను క్యాన్సర్‌తో నేరుగా అనుసంధానించే స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అందువల్ల "స్మార్ట్‌వాచ్ ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుంది" అనే ప్రచారానికి ప్రస్తుతం శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
జాగ్రత్తలు సూచిస్తున్నారు?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనల్లో ప్రమాదం నిరూపితంకాకపోయినా, ఎన్నో సంవత్సరాల పాటు నిరంతరం చర్మానికి అతుక్కునేలా స్మార్ట్‌వాచ్ ధరించడం వల్ల దీర్ఘకాలిక ప్రభావాలు ఏమైనా ఉంటాయా? అనే అంశంపై ఇంకా మరిన్ని అధ్యయనాలు అవసరమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే భయపడాల్సిన అవసరం లేకపోయినా, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
స్మార్ట్‌వాచ్ వాడేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
రాత్రి నిద్రపోయే సమయంలో అవసరం లేకపోతే స్మార్ట్‌వాచ్‌ను తీసేయడం మంచిది. అవసరం లేని సమయంలో బ్లూటూత్, వై-ఫై లేదా ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆఫ్ చేయాలి. చిన్న పిల్లలు నిరంతరం ఎక్కువసేపు స్మార్ట్‌వాచ్ ధరించకుండా చూడాలి. చర్మంపై అసౌకర్యం లేదా అలర్జీ కనిపిస్తే వెంటనే వాచ్‌ను తీసి వైద్యుడిని సంప్రదించాలి.
భయపడాల్సిన అవసరముందా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం స్మార్ట్‌వాచ్ ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పే ఆధారాలు లేవు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్నైనా అవసరమైనంత మేర మాత్రమే ఉపయోగించడం, తయారీ సంస్థ సూచించిన విధంగా వినియోగించడం మంచిది. భవిష్యత్తులో కొత్త పరిశోధనలు వెలువడితే వాటి ఆధారంగా ఆరోగ్య నిపుణుల సూచనలను పాటించడం ఉత్తమం.




