Social Media: సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఇన్ని లాభాలా? అధ్యయనంలో సంచలన విషయాలు
Social Media: ప్రస్తుతం పిల్లలు కూడా సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.
Social Media: సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఇన్ని లాభాలా? అధ్యయనంలో సంచలన విషయాలు
Social Media: ప్రస్తుతం పిల్లలు కూడా సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం వల్ల పిల్లల నిద్ర, చదువు, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న ఆందోళన చాలా కాలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వ మద్దతుతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
యూకే అధ్యయనం ఏమి చెబుతోంది?
బ్రిటన్ ప్రభుత్వ సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఉన్న 309 కుటుంబాలను ఎంపిక చేశారు. సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గిస్తే పిల్లల రోజువారీ జీవితం, మానసిక పరిస్థితి, నిద్ర, చదువుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడమే ఈ పరిశోధన ప్రధాన లక్ష్యం. ఒక నెలపాటు పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని వేర్వేరు విధాలుగా నియంత్రించి వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులను పరిశీలించారు.
పరిశోధనలో ఏం తేలింది?
ఈ అధ్యయనంలో పిల్లలను మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని పిల్లలకు రోజుకు కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే సోషల్ మీడియా ఉపయోగించే అవకాశం ఇచ్చారు. రెండో గ్రూపులో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు సోషల్ మీడియా పూర్తిగా నిషేధించారు. ఈ సమయంలో ఏ సోషల్ మీడియా యాప్‌ను కూడా ఉపయోగించనివ్వలేదు. మూడో గ్రూపులోని పిల్లలు తమ ఫోన్ల నుంచి సోషల్ మీడియా యాప్‌లను పూర్తిగా తొలగించి ఒక నెలపాటు వాటికి దూరంగా ఉన్నారు. ఈ ప్రయోగం అనంతరం చాలా మంది పిల్లలు తమకు గతంతో పోలిస్తే బాగా నిద్ర పడుతోందని, చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతున్నామని, మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపిస్తోందని చెప్పారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా పెరిగిందని వెల్లడించారు.
ఏ విధానం ఎక్కువ ప్రయోజనం ఇచ్చింది?
పరిశోధనలో అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలు చేసిన సోషల్ మీడియా బ్యాన్ ఉపయోగపడింది. ఈ విధానం వల్ల పిల్లల నిద్ర గణనీయంగా మెరుగుపడింది. అలాగే కుటుంబాలకు కూడా ఈ నిబంధనను అమలు చేయడం సులభంగా అనిపించింది. మరోవైపు, సోషల్ మీడియా యాప్‌లను పూర్తిగా తొలగించిన పిల్లల్లో చదువుపై ఏకాగ్రత అత్యధికంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ విధానం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని అధ్యయనం పేర్కొంది.
సోషల్ మీడియాను పూర్తిగా నిలిపేస్తే సమస్యలున్నాయా.?
సోషల్ మీడియా యాప్‌లను పూర్తిగా తొలగించిన తర్వాత కొంతమంది పిల్లలు తమ స్నేహితులతో సంబంధాలు తగ్గిపోయినట్లు భావించారు. ముఖ్యంగా స్నాప్‌చాట్ వంటి యాప్‌ల ద్వారా ఎక్కువగా మాట్లాడే స్నేహితులు ఉన్నవారికి తాము గ్రూప్‌కు దూరమైన భావన కలిగిందని తెలిపారు. అలాగే రోజుకు కేవలం 15 నిమిషాల సమయ పరిమితి విధించిన విధానం మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అధ్యయనం వెల్లడించింది. చాలామంది పిల్లలు సమయం ముగిసిన తర్వాత ఇతర పరికరాలు, పాత మొబైళ్లు లేదా ల్యాప్‌టాప్‌ల ద్వారా సోషల్ మీడియాను ఉపయోగించి ఆ పరిమితులను దాటేందుకు ప్రయత్నించినట్లు పరిశోధకులు గుర్తించారు.
వయసు ఆధారంగా సోషల్ మీడియా నియంత్రణపై పిల్లల అభిప్రాయం
ఈ అధ్యయనంలో పాల్గొన్న చాలా మంది యువకులు వయసును బట్టి సోషల్ మీడియా వినియోగానికి నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే పెద్ద వయసున్న పిల్లలకు వారి అవగాహన, బాధ్యతను దృష్టిలో పెట్టుకుని కొంత ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.
కేవలం వయసు ఆధారంగా మాత్రమే సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే, కొందరు VPNలు ఉపయోగించడం లేదా తప్పుడు వయసు నమోదు చేయడం ద్వారా ఆ నిబంధనలను తప్పించుకునే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరించారు. అందువల్ల సోషల్ మీడియా వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం కంటే, సమతుల్యమైన నియంత్రణ, తల్లిదండ్రుల పర్యవేక్షణ, డిజిటల్ అవగాహన పెంచడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఈ అధ్యయనం సూచిస్తోంది.




