యూజర్ల డేటాతో ఆట.. టిక్‌టాక్‌కు రూ.7 మిలియన్ జరిమానా
దక్షిణ కొరియాలో 94.5 లక్షల మంది వినియోగదారుల డేటాను అక్రమంగా సేకరించి ప్రకటనలకు వినియోగించిన టిక్‌టాక్‌కు 7 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు.
South Korea Fines TikTok $7M
వినియోగదారుల వ్యక్తిగత డేటా గోప్యతను ఉల్లంఘించినందుకు ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌కు దక్షిణ కొరియా గట్టి షాక్ ఇచ్చింది. దేశంలోని వ్యక్తిగత సమాచార పరిరక్షణ కమిషన్ (PIPC) టిక్‌టాక్‌పై 10.3 బిలియన్ వోన్ (సుమారు 7 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది.
కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. టిక్‌టాక్ థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లు, యాప్‌లలో ఏర్పాటు చేసిన ట్రాకింగ్ టూల్స్ ద్వారా దక్షిణ కొరియాలోని సుమారు 94.5 లక్షల మంది వినియోగదారుల ప్రవర్తనా డేటాను సేకరించింది. ఈ సమాచారాన్ని వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) ప్రకటనలు చూపించడానికి ఉపయోగించినట్లు గుర్తించింది.
అయితే వినియోగదారుల డేటాను ఈ విధంగా సేకరిస్తున్న విషయాన్ని టిక్‌టాక్ స్పష్టంగా తెలియజేయలేదని కమిషన్ పేర్కొంది. ఇది వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టానికి విరుద్ధమని తేల్చింది.
దక్షిణ కొరియాలో టిక్‌టాక్ సేవలను నిర్వహిస్తున్న సింగపూర్‌కు చెందిన టిక్‌టాక్ ప్రైవేట్ లిమిటెడ్పై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వినియోగదారుల గోప్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి డిజిటల్ సంస్థపై ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరించింది.




