Spotify Meta Muse AI : స్పాటిఫైలో AI మ్యాజిక్.. ఇక పాటలన్నీ మాటతోనే.!
Spotify Meta Muse AI : ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై యూజర్లకు మరింత స్మార్ట్ మ్యూజిక్ అనుభవాన్ని అందించేందుకు మరో అడుగు ముందుకేసింది..
Spotify Meta Muse AI
Spotify Meta Muse AI : ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై యూజర్లకు మరింత స్మార్ట్ మ్యూజిక్ అనుభవాన్ని అందించేందుకు మరో అడుగు ముందుకేసింది. మెటాకు చెందిన ‘మ్యూజ్’ పర్సనల్ ఏఐ ఏజెంట్‌తో స్పాటిఫై ఇంటిగ్రేషన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త కాంబినేషన్‌తో యూజర్లు స్పాటిఫైలో పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఆడియోబుక్స్‌ను కేవలం ఏఐతో మాట్లాడటం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.
మాటలతోనే పాటలు ప్లే చేయొచ్చు
మెటా మ్యూజ్‌ను స్పాటిఫైతో కనెక్ట్ చేసిన తర్వాత మ్యూజిక్ ప్లేబ్యాక్ మరింత సులభంగా మారుతుంది. యూజర్లు తమకు కావాల్సిన పాటను వెతకడం, ప్లే చేయడం, క్యూలో పెట్టడం, నచ్చిన ట్రాక్‌ను సేవ్ చేయడం వంటి పనులను మ్యూజ్ ఏఐ ఏజెంట్ ద్వారా చేయించుకోవచ్చు. అంతేకాదు.. కొత్త ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయాలన్నా, ఇప్పటికే ఉన్న ప్లేలిస్ట్‌లో కొత్త పాటలను యాడ్ చేయాలన్నా ఏఐతో మాట్లాడితే సరిపోతుంది. యూజర్ కోరుకున్న పాటల ఆధారంగా ప్లేలిస్ట్‌ను తయారు చేయడంతో పాటు, దానికి సరిపోయే పేరును కూడా ఏఐ ఏజెంట్ సూచించగలదు.
‘పర్సనల్ పాడ్‌కాస్ట్’తో మరింత సౌకర్యం
ఈ ఇంటిగ్రేషన్‌లో స్పాటిఫై ‘పర్సనల్ పాడ్‌కాస్ట్’ ఫీచర్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. రోజువారీ సమాచారం, ముఖ్యమైన విషయాలు లేదా నోట్స్‌ను మ్యూజ్ ఏఐ ఏజెంట్ ఆడియో రూపంలోకి మార్చగలదు. తయారైన ఆడియో నేరుగా యూజర్ స్పాటిఫై లైబ్రరీలో ‘పర్సనల్ పాడ్‌కాస్ట్’గా సేవ్ అవుతుంది. దీంతో ఖాళీ సమయం దొరికినప్పుడు వాటిని పాడ్‌కాస్ట్‌లా వినొచ్చు.
క్యాలెండర్‌కు తగ్గట్టుగా ఆటో ప్లేబ్యాక్
మ్యూజ్ కేవలం పాటలు ప్లే చేసే ఏఐ ఏజెంట్‌గానే కాకుండా యూజర్ రోజువారీ షెడ్యూల్‌కు అనుగుణంగా ఆడియోను ప్లే చేసేలా పనిచేయనుంది. ఉదాహరణకు ఉదయం 7 గంటలకు రన్నింగ్‌కు వెళ్లే అలవాటు ఉంటే, ఆ సమయంలో రన్నింగ్ ప్లేలిస్ట్ ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఆఫీస్ వర్క్ సమయంలో ఫోకస్ పెంచే మ్యూజిక్ కావాలంటే, క్యాలెండర్ షెడ్యూల్ ఆధారంగా సంబంధిత ప్లేలిస్ట్‌ను ఆటోమేటిక్‌గా ప్రారంభించేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
లాంగ్ డ్రైవ్‌లకు ప్రత్యేక ప్లేలిస్ట్
లాంగ్ డ్రైవ్‌లు, రోడ్ ట్రిప్‌ల కోసం కూడా మ్యూజ్‌లో ప్రత్యేక సదుపాయం ఉంటుంది. యూజర్ తాను వెళ్లాల్సిన డెస్టినేషన్‌ను ఏఐ ఏజెంట్‌కు చెబితే, ఆ ప్రయాణానికి సరిపోయే మ్యూజిక్‌తో ప్రత్యేక ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయగలదు. అంతేకాదు.. ట్రిప్ ప్రారంభమయ్యే సమయాన్ని బట్టి ఆ ప్లేలిస్ట్ ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా ముందుగానే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. దీంతో డ్రైవ్ మొదలైన వెంటనే మ్యూజిక్ కోసం విడిగా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని ఏఐ ఫీచర్లు త్వరలో
స్పాటిఫై, మెటా మ్యూజ్ ఇంటిగ్రేషన్‌తో యూజర్లకు మరింత పర్సనలైజ్డ్ ఆడియో అనుభవాన్ని అందించడంపై ఫోకస్ చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ కాంబినేషన్‌లో మరిన్ని ఏఐ ఫీచర్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పాటిఫై తెలిపింది. మొత్తంగా చూస్తే.. పాటలు వెతకడం నుంచి ప్లేలిస్ట్‌లు క్రియేట్ చేయడం, పాడ్‌కాస్ట్‌లను వినడం, రోజువారీ షెడ్యూల్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ ప్లే చేయడం వరకు స్పాటిఫై అనుభవాన్ని ఏఐ మరింత స్మార్ట్‌గా మార్చే దిశగా ఈ ఇంటిగ్రేషన్ ముందడుగుగా నిలవనుంది.




