Swiggy: స్విగ్గీ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఒకేసారి ఐదు వేర్వేరు హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేయొచ్చు
Swiggy: ఇంటి వద్దే కూర్చుని నచ్చిన వంటకాన్ని రుచి చూడటానికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
Swiggy
Swiggy: ఇంటి వద్దే కూర్చుని నచ్చిన వంటకాన్ని రుచి చూడటానికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నగరంలోని ఏ మూలన ఉన్న హోటల్ నుంచి అయినా నిమిషాల్లో ఆర్డర్ తెప్పించుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఒకే యాప్‌లో ఒకసారి ఒకే రెస్టారెంట్ నుంచి వంటకాలు ఆర్డర్ చేసే అవకాశం ఉండేది. వేర్వేరు హోటళ్ల నుంచి రెండు రకాల వంటకాలు కావాలంటే విడివిడిగా ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చేది. కస్టమర్ల ఈ చిన్న అసౌకర్యాన్ని తొలగించడానికి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఒక అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేసింది.
కొత్త ఫీచర్ ప్రత్యేకతలు
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ సరికొత్త మల్టీ-రెస్టారెంట్ ఆర్డరింగ్ సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఏడు వందలకు పైగా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ఫీచర్ సహాయంతో కస్టమర్లు ఒకే సమయంలో వేర్వేరు 5 రెస్టారెంట్ల నుంచి తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒకరికి బిర్యానీ ఇష్టమైతే, మరొకరికి రోటి-సబ్జీ, వేరొకరికి మోమోస్ కావాలనుకుంటే విడివిడిగా వేర్వేరుగా ఆర్డర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నింటినీ ఒకే కార్ట్‌లో చేర్చి ఒకేసారి పేమెంట్ పూర్తి చేయవచ్చు.
బార్కోడ్లు, ఓటీపీల టెన్షన్‌కు స్వస్తి
గతంలో విడివిడిగా ఆర్డర్లు ఇస్తే ప్రతీసారి ఆన్లైన్ పేమెంట్ చేయడం, వేర్వేరు ఓటీపీలతో ఇబ్బంది పడటం జరిగేది. కానీ ఈ కొత్త సిస్టమ్‌లో కస్టమర్లు తమకు నచ్చిన ఐటమ్స్‌ను వేర్వేరు హోటళ్ల నుంచి సెలెక్ట్ చేసుకుని ఒకే ఒక్క సింగిల్ పేమెంట్‌తో ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పదే పదే చెల్లింపులు చేసే చిరాకు కూడా పూర్తిగా తొలగిపోతుంది. కస్టమర్లు తమకు నచ్చిన విధంగా వివిధ కార్ట్‌లను క్రియేట్ చేసుకుని వాటిని పోల్చి చూసుకునే సౌలభ్యం కూడా లభిస్తుంది.
డెలివరీ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
ఒకే బిల్లుతో ఐదు వేర్వేరు రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ ఇచ్చినప్పటికీ, ప్రతీ రెస్టారెంట్లోనూ ఆహారం వేర్వేరుగా తయారవుతుంది. ఆయా హోటళ్ల నుంచి డెలివరీ కూడా వేర్వేరుగా జరుగుతుంది. అయితే కస్టమర్లు వేర్వేరు యాప్‌లను ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా, స్విగ్గీ యాప్‌లోని ఒకే ఒక్క స్క్రీన్ ద్వారా అన్ని ఆర్డర్ల లైవ్ లొకేషన్, స్టేటస్‌ను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఏ రెస్టారెంట్ ఫుడ్ ఎక్కడి వరకు వచ్చిందనే పూర్తి సమాచారం ఒకే చోట కనిపించడం వల్ల వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.




