ఆపిల్ చరిత్రలో అతిపెద్ద తప్పు.. 14 ఏళ్ల తర్వాత అసలు నిజాన్ని అంగీకరించిన సీఈఓ టిమ్ కుక్!
Apple Maps Failure: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఒక అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ కంపెనీ చరిత్రలో జరిగిన అతిపెద్ద లోపాన్ని గుర్తుచేసుకున్నారు. 2012లో ఆపిల్ మ్యాప్స్ విడుదలే తన నాయకత్వంలో జరిగిన అతిపెద్ద పొరపాటు అని ఆయన అంగీకరించారు.
Tim Cook
Apple Maps Failure: సాధారణంగా ఆపిల్ వంటి దిగ్గజ సంస్థ ఏదైనా వస్తువును లేదా సాఫ్ట్‌వేర్‌ను మార్కెట్లోకి తెస్తుందంటే, అది పర్ఫెక్ట్ గా ఉంటుందని ప్రపంచమంతా భావిస్తుంది. కానీ, ప్రతి ప్రయాణంలోనూ ఒడిదుడుకులు సహజం. ఆపిల్ ప్రయాణంలో కంపెనీ ప్రతిష్టను మసకబార్చిన ఒకానొక నిర్ణయం గురించి ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత, తన నాయకత్వంలో జరిగిన ఒక పెద్ద లోపాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించారు.
2012లో జరిగిన ఆ పొరపాటు ఏంటి?
టిమ్ కుక్ అంగీకరించిన ఆ పెద్ద తప్పు మరేదో కాదు, అది 'ఆపిల్ మ్యాప్స్' (Apple Maps) లాంచ్. 2012 సంవత్సరంలో గూగుల్ మ్యాప్స్‌కు పోటీగా ఆపిల్ స్వంతంగా మ్యాప్స్ సేవలను ప్రారంభించింది. అయితే, విడుదలైన తొలి రోజే ఇది వినియోగదారులకు చుక్కలు చూపించింది. తప్పుడు లొకేషన్లు చూపించడం, నేవిగేషన్ అస్సలు పనిచేయకపోవడం, ప్రధాన నగరాలు మ్యాప్ నుంచి మాయమవ్వడం వంటి ఎన్నో లోపాలతో ఈ యాప్ ఘోరంగా విఫలమైంది. అప్పట్లో ఈ వ్యవహారం ఆపిల్ బ్రాండ్ విలువను తీవ్రంగా దెబ్బతీసింది.
కంపెనీలో రేగిన ప్రకంపనలు..
ఈ వైఫల్యం ఆపిల్ అంతర్గత నిర్మాణంలో పెద్ద మార్పులకే దారితీసింది. మ్యాప్స్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అప్పట్లో ఐఓఎస్ సాఫ్ట్‌వేర్ విభాగాధిపతిగా ఉన్న స్కాట్ ఫోర్‌స్టాల్ కంపెనీని వీడాల్సి వచ్చింది. స్వయంగా టిమ్ కుక్ వినియోగదారులకు బహిరంగ క్షమాపణలు చెప్పడమే కాకుండా, మా మ్యాప్స్ సరిగ్గా పనిచేసే వరకు గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర ప్రత్యామ్నాయాలను వాడుకోమని సూచించడం అప్పట్లో పెద్ద సంచలనం. ఒక టెక్ దిగ్గజం తన వైఫల్యాన్ని అంతలా ఒప్పుకోవడం ఆపిల్ చరిత్రలోనే మొదటిసారి.
వైఫల్యం నేర్పిన పాఠం..
ఈ ఘటన ఆపిల్ పనితీరును శాశ్వతంగా మార్చేసిందని టిమ్ కుక్ పేర్కొన్నారు. ఏదైనా ప్రొడక్ట్ వినియోగదారుల అంచనాలను అందుకుంటుందని నమ్మకం కలిగే వరకు దానిని విడుదల చేయకూడదనే కఠిన నిర్ణయానికి అప్పుడే వచ్చామని ఆయన తెలిపారు. నేడు ఆపిల్ మ్యాప్స్ ఎంతో మెరుగుపడి ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఒక వైఫల్యం ఎదురైనప్పుడు దానిని అంగీకరించి, లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్తేనే మరింత బలమైన పునాదులు పడతాయని టిమ్ కుక్ మాటలు మరోసారి నిరూపించాయి.




