Cheap Voice SMS Plans: టెలికాం దిగ్గజాలకు TRAI షాక్.. డేటా లేకుండా చౌక రీఛార్జ్‌లు.?
TRAI Cheap Voice SMS Plans: భారత టెలికాం రంగంలో రీఛార్జ్ ప్లాన్ల ధరల విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' (TRAI) కి, ప్రముఖ టెలికాం కంపెనీలకు మధ్య కొత్త..
TRAI
TRAI Cheap Voice SMS Plans: భారత టెలికాం రంగంలో రీఛార్జ్ ప్లాన్ల ధరల విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' (TRAI) కి, ప్రముఖ టెలికాం కంపెనీలకు మధ్య కొత్త వివాదం మొదలైంది. ఇంటర్నెట్ అవసరం లేని సామాన్య వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాలింగ్ తో పాటు ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే చౌకైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జూన్ 15న జరిగిన ఒక బహిరంగ చర్చా వేదికలో టెలికాం కంపెనీలు తమ అభ్యంతరాలను గట్టిగా వినిపించాయి.
ట్రాయ్ సరికొత్త ప్రతిపాదన ఏమిటి?
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్లాన్లన్నీ కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో పాటు డేటాను కలిపి ఒకే ప్యాకేజీలా (బండిల్డ్ ప్లాన్స్) వస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడని వారు కూడా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, డేటా అవసరం లేని వినియోగదారుల కోసం అన్ని రకాల వ్యాలిడిటీలతో కూడిన ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలని ట్రాయ్ భావిస్తోంది. అంతేకాకుండా, ఈ చౌకైన ప్లాన్లు కస్టమర్లకు సులువుగా దొరికేలా యాప్స్, వెబ్‌సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాలని టెలికాం కంపెనీలను కోరుతోంది. అయితే ధరలు , ప్లాన్ల రూపకల్పన అనేది మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఉండాలని, ఇందులో నియంత్రణ సంస్థల జోక్యం సరికాదని టెలికాం కంపెనీలు వాదిస్తున్నాయి.
టెలికాం ఆపరేటర్ల సాంకేతిక, ఆర్థిక వాదనలు
ఈ ప్రతిపాదనపై రిలయన్స్ జియో స్పందిస్తూ, ప్రస్తుత 4G , 5G నెట్‌వర్క్‌లు పూర్తిగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తాయని, అందువల్ల డేటా నుంచి వాయిస్ సేవలను సాంకేతికంగా వేరు చేయడం కుదరదని పేర్కొంది. పైగా, తక్కువ ధరకే ఎస్ఎంఎస్ ప్లాన్లు ఇస్తే వాటిని స్పామ్, ఫ్రాడ్ మెసేజ్‌ల కోసం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా వాదన ప్రకారం, స్మార్ట్‌ఫోన్లలో బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ , సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల వల్ల ఎంతో కొంత డేటా ఖర్చవుతూనే ఉంటుంది, ఒకవేళ ప్లాన్‌లో డేటా అస్సలు ఇవ్వకపోతే ఆ బ్యాక్‌గ్రౌండ్ డేటా వినియోగానికి కస్టమర్లపై అదనపు ఛార్జీల భారం పడుతుంది. ఇక భారతీ ఎయిర్‌టెల్ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా సేవలన్నింటికీ ఇంటర్నెట్ ఎంతో ముఖ్యమని, ఇలాంటి సమయంలో కేవలం వాయిస్ ప్లాన్లను ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశాన్ని డిజిటలైజ్ చేసే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని అభిప్రాయపడింది.
కన్స్యూమర్ ఫోరమ్స్ వాదన.. వాడని డేటాకు రూ. 20,000 కోట్ల భారం
టెలికాం కంపెనీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, వినియోగదారుల సంఘాలు మాత్రం ట్రాయ్ ప్రతిపాదనకు గట్టిగా మద్దతు ఇస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన 'కన్స్యూమర్ ప్రొటెక్షన్ అసోసియేషన్' నివేదిక ప్రకారం ఇండియాలో దాదాపు 30 నుంచి 35 కోట్ల మంది ఫీచర్ ఫోన్ (కీప్యాడ్ ఫోన్) వినియోగదారులు ఉన్నారు, వీరిలో కనీసం 10 నుంచి 15 కోట్ల మందికి అసలు ఇంటర్నెట్ తో పనే లేదు. కేవలం తమ సిమ్ కార్డ్ యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసమే వీరంతా డేటాతో కూడిన ప్లాన్లను కొంటున్నారు. దీనివల్ల దేశంలోని సామాన్య ప్రజలు ఏటా రూ. 15,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్ల వరకు తాము వాడని డేటా కోసమే వృథాగా ఖర్చు చేయాల్సి వస్తోందని వినియోగదారుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే గిరిజన, కొండ ప్రాంతాలలో నెట్‌వర్క్ సరిగ్గా లేక ఇంటర్నెట్ వాడలేకపోతున్నా, డేటా ప్లాన్లకే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తోందని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం టెలికాం కంపెనీలు, వినియోగదారుల సంఘాల నుంచి వచ్చిన ఈ భిన్నమైన వాదనలను పరిశీలిస్తున్న ట్రాయ్, త్వరలోనే దీనిపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.




